సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి(77) మృతి పట్ల సినీ నటుడు, కాంగ్రెస్ నేత మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతాప సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ‘రాజకీయ దురంధురుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్ రెడ్డి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి. ఆయన వాగ్ధాటి, రాజకీయ పరిజ్ఞానం ఆయన పట్ల నాకు గౌరవాన్ని పెంచింది. అభిమాన పాత్రుడిని చేసింది. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’అని తన సందేశంలో చిరంజీవి తెలిపారు.
ఇద్దరం కలిసి ఒకే యూనివర్సీటీలో కలిసి చదువుకున్నాం : సురవరం
జైపాల్‌రెడ్డి మరణం తనను దిగ్బ్రాంతి కలిగించిందని సీపీఐ మాజీ జాత్యీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రాజకీయంగా భిన్న ధృవాలలో ఉన్నా తమ దోస్తాన మాత్రం అలాగే కొనసాగిందని చెప్పారు. ఇద్దరం కలిసి ఉస్మానియా యూనివర్సీటీలో కలిసి చదువుకున్నామని గుర్తుచేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంత్రి పదవులు నిర్వహించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జైపాల్‌రెడ్డి గొప్ప ప్రజ్ఞశాలి అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment