'వైఎస్ఆర్ సహకారంతో హైదరాబాద్ అభివృద్ధి చేశాం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీనే కానీ... మాటల పార్టీ కాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎస్ జైపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ జైపాల్రెడ్డి మాట్లాడుతూ.... తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్కు రూ. 4 వేల కోట్లను వివిధ పథకాల కింద మంజూరు చేసినట్లు గుర్తు చేశారు.
ఆ నిధులతో అప్పటి ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో హైదరాబాద్ను అభివృద్ధి చేశామన్నారు. పేదలకు 76 వేల ఇళ్లు నిర్మించి ఇచ్చామని.... కృష్ణా జలాలు భాగ్యనగరానికి రప్పించేందుకు రూ. 600 కోట్లు ఇచ్చామని ఆయన వివరించారు. ఆర్టీసీ ద్వారా నగరానికి 1400 బస్సులు కూడా ఇచ్చామని చెప్పారు.
తమ పార్టీ అభివృద్ధి చేయడమే తప్పా... చిల్లర ప్రచారం చేసుకనే అలవాటు లేదని ఎస్ జైపాల్రెడ్డి ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చురక అంటించారు. అల్లరి చేసే కంటే ప్రజలకు పనులు చేయడంపైనే శ్రద్ధ చూపాలని ఈతరం నేతలకు ఎస్. జైపాల్రెడ్డి హితవు పలికారు.