ఆమనగల్లు : క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పనిచేసిన చోటల్లా తనదైన ముద్ర వేసిన నాయకుడు, పార్టీలకు అతీతంగా అందరితోనూ అపర చాణక్యుడనిపించుకున్న మహనీయుడు సూదిని జైపాల్ రెడ్డి. విద్యార్థి నాయకుడిగా రాజకీయాలను ఒంటబట్టించుకున్న ఆయన.. నాలుగుసార్లు శాసనసభకు, ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిన జైపాల్ రెడ్డి.. దక్షిణాది నుంచి చిన్న వయసులోనే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మధ్యలో జనతా పార్టీలో చేరి అక్కడా అగ్రనాయకుడిగా వెలుగొందిన ఆయన.. మళ్లీ హస్తం పార్టీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ కీలక పాత్ర పోషించారు.
1969లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా..
చిన్న వయసులోనే పోలియోతో అంగవైకల్యానికి గురైనా ఆయన ఆత్మవిశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఉన్నత విద్యనభ్యసించాలన్న ఆయన తపనకు వైకల్యం ఏమాత్రం అడ్డుకా లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో చురుకుగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డి.. 1965లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కల్వకుర్తి అసెంబ్లీ ని యోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 1969లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1972, 1978, 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 1975లో దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని వీడి జనతా పార్టీలో చేరి అగ్రనేతగా ఎదిగారు.
1984లో ఎంపీగా ఎన్నిక
1980లో తొలిసారిగా మెదక్ పార్లమెంటు స్థానం నుంచి ఇందిరాగాంధీపై పోటీచేసి ఓడిపోయారు. అనంతరం 1984లో మహబూబ్‌నగర్ పార్లమెంటు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో బరిలో దిగి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1998లోనూ పాలమూరు నుంచి విజయం సాధించారు. అయితే 1999లో మళ్లీ కాంగ్రెస్‌లో చేరి మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. 2004లోనూ మిర్యాలగూడ నుంచి, 2009 చేవెళ్ల నుంచి జైపాల్‌రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అయితే.. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి.. జితేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1990–1998 మధ్యలో రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1997లో ఐకే గుజ్రాల్ ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రి (సమాచార ప్రసార శాఖ)గా పనిచేసే అవకాశం లభించింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో 2004, 2009ల్లోనూ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. కొన్నేళ్లు ఏఐసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములు అయ్యారు.
చేవెళ్ల ఎంపీగా..
జైపాల్‌రెడ్డికి చేవెళ్లతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి చేపట్టారు. చేవెళ్ల పార్లమెంట్ ఏర్పడిన తర్వాత తొలిసారి ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. జైపాల్‌రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో వికారాబాద్‌ను శాటిలైట్ టౌన్‌షిప్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. చేవెళ్ల ప్రాంతంలో రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు జైపాల్‌రెడ్డి ఎంతో సహకరించారు.
జైపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే..
- ఉస్మానియా విద్యార్థి సంఘం నాయకుడిగా జైపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. 1963–64మధ్య ఉస్మానియా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
- 1966–67లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే సమయంలో యూత్ కాంగ్రెస్ జాతీయ సభ్యుడిగానూ కొనసాగారు. 1971 వరకు జాతీయ పార్టీ సభ్యుడిగా ఉన్నారు.
- 1969లో తొలిసారి కల్వకుర్తి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వరుసగా నాలుగుసార్లు అక్కడినుంచే గెలిచారు.
- ఈ సమయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ నుంచి బయటికొచ్చారు. అనంతరం 1979లో జనతాపార్టీలో చేరారు. 1985 నుంచి 1988 వరకు జనతాపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
- 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి 60వేల పైచిలుకు ఓట్లతో ఓటమిపాలయ్యారు.
- 1984, 98లో మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
- 1999లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.
- 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999–2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
- 2009లో చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు.
- 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991–1992 వరకు రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరించారు.
- ఐకే గుజ్రాల్ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా ఉన్నారు.
- 2004–2014 మధ్య పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు.
- 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment