నిజాయతీ, నిస్వార్థ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది | Congress Leader Jaipal Reddy Dies | Sakshi
Sakshi News home page

జైపాల్‌ రెడ్డి ఇకలేరు

Published Mon, Jul 29 2019 2:40 AM | Last Updated on Mon, Jul 29 2019 4:31 AM

Congress Leader Jaipal Reddy Dies - Sakshi

నిజాయతీ, నిస్వార్థ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. పదవులు, స్వార్థం కన్నా దేశ ప్రయోజనాలు, ప్రజల సెంటిమెంటే గొప్పదని గుర్తించి.. ఆ దిశగా అలుపెరగక పనిచేసిన ఓ మేరునగం కుప్పకూలింది. సమకాలీన దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌ రెడ్డి పరమపదించారు. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరి ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. వైకల్యం శరీరానికేనని.. మనసుకు కాదంటూ రాజకీయాలు, చరిత్ర, ఆంగ్ల భాషపై అసమానమైన రీతిలో పట్టు సంపాదించిన ఆయన.. సన్నిహితులు, పార్టీ నేతలకు ఓ ‘ఎన్‌సైక్లోపీడియా’. విద్యార్థి దశనుంచే చురుగ్గా రాజకీయాల్లో భాగస్వామ్యుడైన జైపాల్‌ రెడ్డి.. చివరి నిమిషం వరకు నమ్మిన సిద్ధాంతం కోసం ముక్కుసూటిగా వ్యవహరించారు.

ఎమర్జెన్సీలో ఇందిరను వ్యతిరేకించినా.. లౌకిక శక్తుల ఏకీకరణ పేరిట జనతాదళ్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా తన ప్రతి అడుగునూ  హుందాగా సమర్ధించుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం పెల్లుబికిన సమయంలో కేంద్ర కేబినెట్‌లో ఉంటూనే.. ఎన్నో ఒత్తిళ్లలోనూ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించారు. దేశానికి దక్షిణాది అందించిన రాజకీయ ఆణిముత్యాల్లో జైపాల్‌రెడ్డి ఒకరు. పీవీ తర్వాత ఢిల్లీలో ఆ స్థాయిలో చక్రం తిప్పిన తెలుగువారిలో తొలి వరసలో ఉండే వ్యక్తి. నిరంతరం దేశ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే జైపాల్‌ రెడ్డి ఇకలేరనే వార్త.. తెలంగాణకు, తెలుగు వారికి తీరని లోటే.

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, కాం గ్రెస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ రాజకీయాలపై తనదైన ముద్రవేసిన సూదిని జైపాల్‌రెడ్డి (77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరం, నిమోనియాతో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యా స్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజాము న తుదిశ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా చం డూరు మండలం నర్మట గ్రామంలో దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు 1942 జనవరి 16న ఆయన జన్మించారు. వీరి స్వగ్రామం ఉమ్మడి పాలమూరు జిల్లా మాడు గుల. ఆయనకు 18 నెలలున్నప్పుడే కాలికి పోలియో సోకింది. జైపాల్‌ రెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జైపాల్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఇంగ్లీష్‌ లిట్‌రేచర్‌) సహా బీసీజే పూర్తిచేశారు. విద్యార్థి దశనుంచే జైపాల్‌రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. కాగా, జైపాల్‌ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్‌ పక్కన జైపాల్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌కు తీసుకొస్తారు. 11 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి ఏఐసీసీ తరఫు నుంచి లోక్‌సభలో పార్టీ పక్ష మాజీ నేత మల్లికార్జున ఖర్గే, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి హాజరుకానున్నట్టు టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

అంత్యక్రియలకు ఏర్పాట్లు 
ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌ రెడ్డి అంత్యక్రియలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేస్తోంది. నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌కు పశ్చిమం వైపు బతుకమ్మ కుంట హెలిప్యాడ్‌ పక్కనున్న హెచ్‌ఎండీఏకు చెందిన 1.4 ఎకరాల భూమిలో కొంత స్థలాన్ని కేటాయించారు. దీంతో హెచ్‌ఎండీఏ, ఆర్‌ అండ్‌ బీ, రెవెన్యూ అధికారులు అంత్యక్రియల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సంజీవయ్య పార్కులోని టెన్నిస్‌ కోర్టు ప్రాంగణం, హెలిప్యాడ్‌ పక్కనే ఉండే పార్కు స్థలాన్ని రెండింటిని పరిశీలించారు. ముందుగా సంజీవయ్య పార్కు స్థలంలో కలుపు మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. అయితే సాయంత్రం హెలిప్యాడ్‌ పక్కననున్న స్థలాన్ని కేటాయించారు. 

ప్రముఖుల సంతాపం 
జైపాల్‌రెడ్డి పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని ఆయన నివాసానికి తరలించారు. అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు, వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంఐంఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వర్‌రావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎంపీలు గుత్తా సుఖేం దర్‌రెడ్డి, జి.వివేక్, కల్వకుంట్ల కవిత, వినోద్, సురవరం సుధాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు, బీసీ కమిషనర్‌ చైర్మన్‌ రాములు, ఇనుగాల పెద్దిరెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, నల్లగొండ మాజీ జెడ్పీ చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, జర్నలిస్టు సంఘాల నాయకులు దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళు లు అర్పించారు. దేశం గొప్ప పార్లమెంటేరీయన్‌ను కోల్పొయిందన్నారు. ఆయనతో తమకు న్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

ఆలోచనా పరుడైన నాయకుడు: రాష్ట్రపతి 
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. ‘జైపాల్‌ రెడ్డి ఇక లేరన్న వార్త బాధ కలిగించింది. ఆయనొక ఆలోచనాపరుడైన రాజకీయ నాయకుడు, అద్భుతమైన పార్లమెంటేరియన్‌. ఆయన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’అని పేర్కొన్నారు.

జైపాల్‌రెడ్డి మంచి వక్త: ప్రధాని మోదీ 
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్‌ రెడ్డి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జైపాల్‌రెడ్డి ప్రజాజీవితంలో అనేక సంవత్సరాలు గడిపారు. ప్రతి ఒక్కరూ గౌరవించగలిగే మంచి వ్యక్తి. మంచి వాక్చాతుర్యం కలిగిన నేత.  ఆయన సమర్థవంతమైన పాలకుడు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ’’అని ప్రధాని నరేంద్రమోదీ తన ట్వీట్టర్‌లో ట్వీట్‌ చేశారు.  
 
‘‘జైపాల్‌ రెడ్డి మృతి చెందడం చాలా విషాదకరం’’ 
– కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 

‘‘జైపాల్‌ రెడ్డి ఓ విజ్ఞాన గని. మేధావి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’’     
– మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 

ఆయన మరణం కలచివేసింది: సోనియా
 సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి ఆకస్మిక మరణం తనను కలచివేసిందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పేర్కొన్నారు. ‘‘ఐదు సార్లు ఎంపీగా పనిచేసి జాతీయ స్థాయిలో అనేక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ఆయన మంచి వక్త అని, పార్టీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడంలో ఎప్పడూ ముందుండే వారు.’’అని సోనియా ఆదివారం జైపాల్‌ సతీమణి లక్ష్మికి సంతాప లేఖలో పేర్కొన్నారు. నమ్మకమైన సహచరుడిని, గౌరవప్రదమైన సీనియర్‌ నాయకుడిని కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని తెలిపారు. 
 
‘‘జైపాల్‌రెడ్డి మృతితో తెలంగాణ తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌. తన జీవితాన్నంతటినీ ప్రజల కోసమే వెచ్చించారు.’’     
– కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ 

రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది: గవర్నర్‌ 
జైపాల్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి తెలంగాణకు చెందిన అసాధారణ పార్లమెంటేరియన్‌ అని కొనియాడారు. అద్భుతమైన పాలనాదక్షత, ప్రతిభావంతుడైన వక్త అయిన జైపాల్‌రెడ్డి మరణంతో తెలంగాణ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందన్నారు. అంకితభావం గల ప్రజాసేవకుడిని రాష్ట్రం కోల్పోయిందని తన సంతాప సందేశంలో తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు నరసింహన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.   

జైపాల్‌రెడ్డి మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం 
 కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని సీఎం ఆదేశించారు.

మంచి రాజకీయవేత్తను కోల్పోయాం: జగన్‌
సాక్షి, అమరావతి :  ప్రముఖ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మంచి వాగ్ధాటి గల జైపాల్‌రెడ్డి పార్లమెంటు, అసెంబ్లీలలో తనకంటూ సముచితమైన స్థానాన్ని పొందారని జగన్‌ నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు. ‘సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి మృతిపై తీవ్రమైన విచారాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నాను. ఒక మంచి రాజకీయవేత్తను మనం కోల్పోయాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సంతాపం 
జైపాల్‌రెడ్డి ఆకస్మిక మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా, వీపీ సింగ్, మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గాల్లో కేబినెట్‌ మంత్రిగా పని చేసిన సీనియర్‌ నేత, ప్రజా నాయకుడు మృతి చెందడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు.  

జైపాల్‌రెడ్డి మరణం బాధాకరం: కేటీఆర్‌ 
‘‘సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ట్వీట్‌ చేశారు.

మాకు తీరని లోటు: ఉత్తమ్‌ 
 జైపాల్‌రెడ్డి మృతి తనకు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు లోక్‌సభ, రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, మాజీ కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన తెలంగాణ ముద్దుబిడ్డల్లో ఒకరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక మంచి వక్తను, మేధావిని కోల్పోయిందని వెల్లడించారు.

దేశ రాజకీయాల్లో ప్రజ్ఞాశాలి: చిరంజీవి 
 కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. రాజకీయ దురంధరుడు, మేధావి, జ్ఞాని అయిన జైపాల్‌రెడ్డి మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ‘దేశ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి. ఆయన వాగ్దాటి, రాజకీయ పరిజ్ఞానం నాకు ఆయన పట్ల గౌరవాన్ని పెంచాయి. జైపాల్‌ మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు. ఆయ న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’అని పేర్కొన్నారు.

అన్మాస్‌పల్లితో ఆత్మీయ అనుబంధం 
కడ్తాల్‌ (కల్వకుర్తి) : కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి తన అత్తగారి ఊరైన అన్మాస్‌పల్లితో ఆత్మీయ అనుబంధముంది. అన్మాస్‌పల్లికి చెందిన కోర్పోలు నారాయణరెడ్డి, యశోదమ్మ దంపతుల కూతురు లక్ష్మమ్మను వివాహం చేసుకున్న జైపాల్‌రెడ్డి.. ఆ తర్వాత గ్రామంలో బంధువుల ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా తప్పనిసరిగా హాజరయ్యే వారు. అన్మాస్‌పల్లికి వచ్చినప్పుడు గ్రామస్తులతో ఆప్యాయంగా మాట్లాడేవారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవారు. ఆయన ఒక వ్యక్తిని ఒకసారి చూసి పలకరిస్తే మళ్లీ ఆ వ్యక్తి ఎక్కడ తారసపడినా పేరుపెట్టి ఆప్యాయంగా పిలిచి మాట్లాడేవారు. ఆయన్ను తమ ఊరి అల్లుడిగా గ్రామస్తులు ఎంతో అభిమానించేవారు. ఈ గ్రామస్తులకు వివిధ సందర్భాల్లో ఆయన సాయం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

జైపాల్‌రెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్న సీఎం కేసీఆర్‌

2
2/2

ఆదివారం హైదరాబాద్‌లో జైపాల్‌రెడ్డి పార్థివదేహం వద్ద నివాళులు అర్పిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement