
'మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది కాదని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. ఉద్యమం సందర్భంగాకేసీఆర్ చేసింది దొంగ దీక్షని, నిమ్స్ లో కేసీఆర్ రోజూ 750 కేలరీల టోటల్ పెరటల్ న్యూట్రిషన్ ఇంజక్షన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇదంతా నిమ్స్ రికార్డుల్లో ఉందని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ మంచి వ్యాపారి, లాభం ఉంటే తప్పా సోనియా గాంధీని పొగడరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. మోదీతో బాహాటంగా కలిస్తే మైనారిటీలు, ప్రగతిశీల వర్గాలు దూరమవుతాయని కేసీఆర్ జంకుతున్నారని అన్నారు. మోదీ తెలంగాణ వ్యతిరేకి, అలాంటి ఆయనతో కేసీఆర్ రహస్య మంతనాలు సాగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పచ్చి అవకాశవాది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన ఫలితాలు కాంగ్రస్ పార్టీకే కాదు, రాష్ట్రంలో ఏ వర్గానికి దక్కలేదని జైపాల్ రెడ్డి అన్నారు.