సమావేశంలో మాట్లాడుతున్న జైపాల్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ అర్బన్: ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత సూదిని జైపాల్‌రెడ్డి ప్రకటించారు. ఇకముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని పేర్కొన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు దూరంగా ఉంటానని రెండు నెలల క్రితమే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనారోగ్యం.. వయసుపైబడడమే తన ఈ నిర్ణయానికి కారణమన్నారు. అందుకే తన బదులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని డీకే అరుణను కోరినప్పటికీ ఆమె అడిగిన ప్యాకేజీ కుదరనందుకే పార్టీని వీడారని విమర్శించారు. 2014లో డీకే అరుణ వల్లనే తాను ఓడిపోయానని వెల్లడించారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం.. కళ్లు మూసుకొని గుంతలో పడ్డట్లేనని ఎద్దేవా చేశారు. ఇతరులపై నిందలు మోపే బదులు కొత్త పార్టీలో పరిస్థితి చక్కబెట్టుకోవాలని అరుణకు హితవు పలికారు. డబ్బులు, పదవుల కోసం పార్టీలు మారడం ఆమె నైజమని విమర్శించారు.
అధిష్టానం పొరపాట్లతోనే ఓటమి
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ అధిష్టానంచేసిన కొన్ని పొరపాట్ల వల్లనే 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఓటమి పాలైందని జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉంటే తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాదని వెల్లడించారు. ముకేశ్ అంబానీకి రూ. 7వేల కోట్ల జరిమానా విధించిన ఏకైక కేంద్ర మంత్రినని అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సిద్దిపేటలో నిరవధిక నిరాహార దీక్షకు దిగిన కేసీఆర్ 24 గంటలకే ముగించేశారని అన్నారు. ఖమ్మం దీక్ష సందర్భంగా నిమ్స్‌లో చేరి రోజుకు 750 కేలరీల ద్రవాహారం తీసుకున్నారని, అలా చేస్తే ఏళ్ల తరబడి జీవించవచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు అవరోధం కలుగుతుందని.. ఆయన చేసిన మోసాలు, దొంగ దీక్షల రహస్యాలు సోనియమ్మకు చెప్పలేదని అన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు, విద్యార్థులకు ఫీజులు లేవని, కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ రానుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ డబ్బులున్న అభ్యర్థులకు గాలం వేసి టికెట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment