పార్లమెంటులో ఏం జరిగింది-39
(నిన్నటి తరువాయి)
స్పీకర్ చాంబర్స్‌లోంచి లోక్ సభలోకి వచ్చేశారు...
టి. కాంగ్రెస్ ఎంపీలు, జైపాల్‌రెడ్డి. ఎవ్వరూ మాట్లాడే ధైర్యం చెయ్యలేదు. జైపాల్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అతి తీవ్రంగా నడిచిన 1969 లో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ వైపే నిలబడిన చరిత్ర జైపాల్‌రెడ్డి గారిది. టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడినా, కాంగ్రెస్ ఎంపీలందరూ హైకమాండ్ మీద ఒత్తిడి తెస్తున్నా, ఈ విషయంలో ఆయన అభిప్రాయం తెలిపే ప్రయత్నమే చేయలేదు... 9.12.2009 వరకూ!
ఒక ఎంపీ: సార్... మీరు చెప్పినట్లు స్పీకర్ చేస్తుందంటారా?!
జైపాల్‌రెడ్డి: చేస్తుంది... బిల్ పాసవుతుంది... తెలంగాణ ఏర్పడుతుంది... మనకొచ్చే లాభం?!
ఎంపీ: అదేంటి సార్, రేపటి ఎన్నికల్లో ‘స్వీప్’ చేస్తాం... అన్ని స్థానాలూ మనమే గెలుస్తాం.
జైపాల్‌రెడ్డి: మనమే అంటే, కాంగ్రెస్ అభ్యర్థులమా... తెలంగాణ వాదులమా?!
మరో ఎంపీ: రెండిటికీ తేడా ఏముంది సార్. ఇప్పు డు తెలంగాణ వచ్చిందంటే అది మన వల్లనే కదా... మేమెంత ప్రయత్నించినా మొహం మొహం చూసుకోవడానికే ఇష్టపడని సుష్మాస్వరాజ్, కమల్‌నాథ్‌లు స్పీకర్ ఎదురుగా గంటసేపు కూర్చుండి పోయారు గదా...! మీరు చెప్తుంటే వాళ్ల ముగ్గురే కాదు, మేమంతా కూడా నిశ్చేష్టులయిపోయాం.
ఇంకో ఎంపీ: ‘లాస్ట్ బాల్’ వరకూ ఆడతామన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డే కాదు, మీరు బౌల్ చేసిన ‘లాస్ట్ బాల్’తో అందరూ కలసి అడ్డంగా నిలబడ్డా క్లీన్‌బౌల్డ్ అవ్వాలసిందే.
జైపాల్‌రెడ్డి: మనం స్పీకర్ దగ్గరకు వెళ్తున్నట్లు కేసీఆర్‌కి తెలుసా?
ఎంపీ: ఇందాకా కమల్‌నాథ్ దగ్గరకు మీరు మమ్మ ల్ని పంపినప్పుడు ‘లాబీ’లో కలిశాడు సార్! మొత్తం జరుగుతున్నదంతా చెప్పాం...
జైపాల్‌రెడ్డి: ఆయనేమన్నాడు?
ఎంపీ: మొత్తం విన్నాడు సార్... ఆయన్ని కూడా రమ్మని పిలిచాం.
జైపాల్‌రెడ్డి: మరి ఏడి?!
మరో ఎంపీ: వస్తానని చెప్పలేదు గానీ, వస్తానన్నట్టే మొహం పెట్టాడు. వస్తాడనే అనుకున్నాం.
జైపాల్‌రెడ్డి: మరెందుకు రాలేదంటావ్?!
మరో ఎంపీ: బహుశా ఇక్కడ మనం ‘సక్సెస్’ అవ్వ మేమోనని వచ్చి ఉండడు... అయినా మనకేం నష్టం సార్! ఆఖరుగా మనం వెళ్లకపోతే ‘తెలంగాణ’ రాష్ట్రమే లేదు కదా!! తెలంగాణ రాష్ట్రమే లేకపోతే, మనమూ లేము- కేసీఆర్ లేరు...
జైపాల్‌రెడ్డి: తెలంగాణ రాష్ట్రం లేకపోతే కాంగ్రెస్, అంటే మనం లేము... రాష్ట్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా కేసీఆర్ మాత్రం ఉంటాడు. చదరంగం ఆటలో ఆటగాడు జాగ్రత్తగా చూసుకోకపోతే, ప్రత్యర్థి గుర్రంతో ‘చెక్’ పెడతాడు. ఆ ఎత్తుగానీ ప్రత్యర్థికి దొరికిందా, ఆటకట్టు... లేదా మంత్రి (క్వీన్) ఎగిరిపోవటం ఖాయం! కేసీఆర్ మనకి గుర్రంతో ‘చెక్’ పెట్టాడయ్యా!! ఇందాక వస్తానన్నట్టుగా మొహం పెట్టాడన్నావు... అతనెందుకు వస్తాడు, చిద్విలాసంగా నాటకమంతా చూస్తూ కూర్చుంటాడు.
ఎంపీ: అదేమిటి సార్, తెలంగాణ రావటం మన కెంత అవసరమో ఆయనకీ అంతే అవసరం గదా...!
జైపాల్‌రెడ్డి: ఈ రోజు తెలంగాణ బిల్లు పాసయితే కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి! పాసవ్వక పోతే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి!! అతని ఆటలో అతనికి పూర్తి ‘క్లారిటీ’ ఉంది. మనమాడుతున్న ఆటే ఎందుకాడుతున్నామో మనకి తెలియకుండా ఆడు తున్నాం...
ఎంపీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు సార్? సీమాంధ్ర వారు తెలంగాణ మనిషికి ముఖ్య మంత్రి పదవిస్తారా?!
జైపాల్‌రెడ్డి: ఖచ్చితంగా ఇస్తారు. సమైక్యం కోరుకునే వారు, తెలంగాణకి ముఖ్యమంత్రి ఇవ్వమని ఎలా అనగలరు? బిల్లు పాసవ్వకపోతే, కేసీఆర్ తెలంగాణలో, జగన్ సీమాంధ్రలో గెలుస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, జగన్ ఉపముఖ్యమంత్రి...
ఎంపీ: ఎందుకు సార్ అపశకునం మాటలు? మీరు చేసిన కౌన్సిలింగ్ వృథా పోదు. స్పీకర్ మీరు చెప్పింది చెప్పినట్లు అమలు చేస్తుంది... బిల్లు పాసవుతుంది: ఆఖరి గంటలో మీరే స్పీకర్ చాంబర్‌కి రాకపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రమే లేదన్న విషయం మేము గట్టిగా ప్రచారం చేస్తాం... ముఖ్యమంత్రి మీరా, కేసీఆర్... అవుతారా అనేది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తేలుస్తుంది.
జైపాల్‌రెడ్డి: (అసహనంగా) శకునాలు, దశలు, జాతకాలు, రాహుకాలం చూసుకుని మీరు పని చేస్తారు. సాధ్యాసాధ్యాలూ, వాస్తవిక పరిస్థితులూ బేరీజు వేసుకుని నేను పనిచేస్తాను. ఆఖరి గంటలో నేను మాట్లాడిన ఏమాట మీరు ‘పబ్లిగ్గా’ చెప్పినా, నేను ఖండిస్తాను. స్పీకర్ గదిలో జరిగిన మొత్తం మర్చిపోండి... ఆ మాటలు నేను అనలేదు - మీరు వినలేదు. ఇకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రో, కాదో కాంగ్రెస్ పార్టీ తేలుస్తుందంటున్నావు.. కేసీఆర్ కాంగ్రెస్‌లో చేరారా?! టీఆర్‌ఎస్‌ని విలీనం చేస్తారా?!
ఎంపీ: తెలంగాణ బిల్లు పాసయిన మరుక్షణం కాంగ్రెస్‌లో కలిసిపోతానని మాటిచ్చాకే కదా... వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది.
జైపాల్‌రెడ్డి: చూశావా... నువ్వే చెప్పేస్తున్నావు...
తెలంగాణ తీర్మానం, కేసీఆర్ మాటివ్వటం వల్లనే జరిగిందని...!
ఇదే రేపు కేసీఆర్ చెప్తాడు... ‘‘నేను మాటివ్వకపోతే కాంగ్రెస్ వారు తెలంగాణ ఇవ్వమన్నారు... అందుకే మాటిచ్చాను... తెలంగాణ తెచ్చాను’’ అంటాడు.
ఇంకో ఎంపీ: సార్ కన్‌ఫ్యూజ్ చెయ్యకుండా చెప్పండి సార్... మనం చేస్తున్నది రైటా... తప్పా..
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు : a_vundavalli@yahoo.com