రూల్స్‌ని పాటించడం ‘మనిష్టం!’
పార్లమెంటులో ఏం జరిగింది-37
(నిన్నటి తరువాయి)
రూల్స్, రాజ్యాంగం, చట్టాలు మనం తయారు చేసుకున్నాం. మనకి ఎలా వీలుగా ఉంటే అలా పాటించుకుంటాం. అధికార ప్రతిపక్షాలు కలిసిపోయాయి. మిగిలినవి అన్నీ చిన్న చిన్న పార్టీలు. వాళ్లు అరుస్తూనే ఉంటారు. మీరు బిల్లు పాస్ చేసేయండి. ‘పాస్’ అని ప్రకటించటమే గదా...!
జైపాల్‌రెడ్డి: ఈ గొడవ ఇంక మానండి. మొత్తం సభ్యులెవ్వరూ మా మాట వినరు... అంటూ నాయకులిద్దరూ తేల్చేశారుగా...
ఇంకో ఎంపీ: నిజమే సార్... ఒవైసీ పెట్టిన సవరణలు మేము చూడలేదు. నిజంగా ప్రాణహిత-చేవెళ్లకి, హైకోర్టుకి వ్యతిరేకంగా ఓటు వేసి హైద్రాబాద్ వెళ్లగలమా...!? ఇంతా జరిగి తెలంగాణ సాధించకుండా కూడా హైద్రాబాద్ వెళ్లలేం...
జైపాల్‌రెడ్డి: మీరు ఆగండి బాబూ... ఎందుకంత భయపడ్తారు. తెలంగాణ బిల్లు పాసవుతుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి.
కమల్‌నాథ్: నో చాన్స్... జైపాల్‌జీ, ఎన్ని సవరణలు పాసయిపోతాయో తెలీదు... ఒవైసీ, సౌగత్ రాయ్‌లు పెట్టిన ఒక్క సవరణ పాసు అయినా బిల్లు రూపమే మారిపోతుంది. సీమాంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం... ఇద్దరూ వ్యతిరేకిస్తే ఇంక ఈ బిల్లు ఎవరికోసం తెచ్చినట్టు...?
సుష్మాస్వరాజ్: నేనూ అదే చెప్తున్నాను. బిల్లు వీగిపోతే మేమే కారణమని ప్రచారం చెయ్యాలను కుంటున్నారు... మాకు వచ్చిన నష్టమేమీ లేదు. రెండు ప్రాంతాల్లోనూ మా బలం అంతంత మాత్రం! కానీ కాంగ్రెస్ ఎన్ని అనర్థాలు సృష్టించిందో ప్రజలముం దుంచుతాం. తెలంగాణ పేరుతో ఎన్ని రోజులు పార్లమెంట్ స్తంభించారో జనానికి చెప్తాం.
జైపాల్‌రెడ్డి: రేపు ఎన్నికలయ్యాక మళ్లీ అదే మొదలవుతుంది. మేము పదేళ్లు రాజ్యం చేశాం. రేపు వచ్చేది ఎన్డీయే. ప్రారంభం రోజు నుంచీ సభ జరగనివ్వరు. ఈ గొడవను ఈ ‘టర్మ్’లోనే ఎలా పూర్తి చేసేయాలో ఆలోచించమంటున్నాను.
స్పీకర్: మీరే చెప్పండి. ఈ సమస్యకు పరిష్కారముందా? ఉంటే అదేమిటో చెప్పండి.
జైపాల్‌రెడ్డి: నేనొక మార్గం చెప్తాను. (ఎంపీల వైపు చూస్తూ) మీరు కొంచెం సేపు నిశ్శబ్దంగా వినండి. ఇంతసేపూ మీరు బిల్లు ఓటింగ్‌లో గట్టెక్కటం ఎలా... అని తర్జనభర్జనలు పడుతున్నారు. దీనికోసం ఇంత టైం వేస్ట్ చెయ్యడం అనవసరం... ఓటింగ్ జరిగితే ఈ బిల్లు పాసవ్వటం జరగదు. ఇక్కడ మీరెవ్వరూ బుర్రపెట్టని యాంగిల్ ఒకటుంది... అసలు ఓటింగ్ ఎందుకు పెట్టాలి!
స్పీకర్: నాకర్థం కాలేదు... ఓటింగ్ పెట్టాలి... అదే రాజ్యాంగం చెప్పింది. అదే లోక్‌సభ రూల్స్‌బుక్‌లో ఉంది.
కమల్‌నాథ్: ఓటింగ్, డివిజన్ చేసి ఎటువైపు ఎంత మంది ఓటు వేశారో, ఎంత మంది తటస్థంగా ఉన్నారో ప్రకటించకుండా బిల్లు పాసయ్యిందని ఎలా డిక్లేర్ చేస్తారు?
జైపాల్‌రెడ్డి: అదే చెప్తున్నాను. ‘వాయిస్ ఓటు’తో బిల్లు పాసయినప్పుడు ఓటింగ్ ఉండదు కదా..!
సుష్మాస్వరాజ్: అదెలా సాధ్యం... మంత్రులే ‘వెల్’లో నినాదా లిస్తుంటే, వాయిస్ ఓటుతో పాసయిపోయిందని ఎలా క్లోజ్ చేస్తారు? ఇదేమైనా సీక్రెట్ మీటింగా... ప్రపంచమంతా చూస్తుంటుంది!?
జైపాల్‌రెడ్డి: నేను చెప్పేది కాస్సేపు నిశ్శబ్దంగా వినండి. ఓటింగ్ జరపకుండా, డివిజన్ చెయ్యకుండా బిల్లు పాస్ చెయ్యటానికి ప్రొవిజన్ ఉంది. మీ ప్రధాన కార్యదర్శిని పిలిచి రూల్ 367(3) చూడ మనండి. స్పీకర్ అనవసరమనుకుంటే డివిజన్ నిరాకరించవచ్చు.
స్పీకర్: అవును... నేను చూశాను. దాని మీద చర్చించాం. ఎప్పుడో 1956 ముందొకసారి ఆ ‘ప్రొవిజో’ వాడినట్లు రికార్డుల్లో ఉంది. ఆ తర్వాత ఎప్పుడూ ఏ స్పీకరూ ఓటింగ్ నిరాకరించలేదు.
జైపాల్‌రెడ్డి: రూల్ ఉందిగదా... ఎవరు వాడారు, ఎప్పుడు వాడారు అనేది కాదు ప్రశ్న! ఇప్పుడు వాడండి. ‘నో’ డివిజన్ అనండి. రూల్ చదవండి., బిల్లు పాసయ్యిందని ప్రకటిం చింది. దీనికెందుకింత చర్చ...
స్పీకర్: సాధ్యం కాదు జైపాల్‌గారూ... ‘కౌల్ అండ్ షక్దర్’లో స్పష్టంగా వ్రాశారు. ‘పనికిమాలిన’ కారణాల వల్ల ఓటింగ్ అడుగు తున్నారని స్పీకర్ భావిస్తే, డివిజన్ నిరాకరించవచ్చు... అని! కానీ ఒక పెద్ద రాష్ట్ర విభజన, అసెంబ్లీ వ్యతిరేకించినా, పార్లమెంటు చేబట్టినప్పుడు... ఓటింగ్ అడగటం పనికిమాలిన కారణంగా స్పీకర్ ఎలా భావించగలరు! స్పీకర్ ఆఫీసు గౌరవం పోతుంది జైపాల్‌జీ... మీరు ఒప్పించి సవరణల మీద ఒత్తిడి తేకుండా, ఓటింగ్ అడగ కుండా సరిచేయండి. అంతేగానీ ఏదో క్లాజుకున్న అనుబంధ వాక్యాలని ఆసరాగా తీసుకుని ఇంత అఘాయిత్యం చేయలేము.
జైపాల్‌రెడ్డి: ‘రూల్’లో ఏది ‘పనికిమాలిన’ కారణమో చెప్ప లేదు. స్పీకర్ ఇష్టం!
అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పుడు, అది చదివి, ఎంతమంది బలపరుస్తున్నారో లెక్కపెట్టి, యాబైమంది లేకపోతే, నోటీసు తిరస్కరించి, అప్పుడు తర్వాత అంశంలోకి వెళ్లాలి. ఇదీ ‘కౌల్ అండ్ షక్దర్’లో రాసి ఉంది. శీతాకాల సమావేశాల్లో, ఈ సమావేశాల్లో... ప్రతిరోజూ అవిశ్వాసం నోటీసు ఇస్తూనే ఉన్నారు. ఒక్క రోజైనా రూల్ ప్రకారం మీరు వ్యవహరించారా?! అవిశ్వాసం చదవటానికి మాత్రం మీకు సభలో ‘ఆర్డర్’ కనిపించటం లేదు. ఎందుకు కనిపించటం లేదని అడిగితే, సీమాంధ్ర ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, శివసేన... యాభైకన్నా ఎక్కువ మందే అవిశ్వాసాన్ని సమర్థిస్తారు కనుక, ఈ నాల్రోజుల్లో అవిశ్వాసం చర్చ మొదలు పెట్టడం ఇష్టం లేదు కనుక...
వంద మంది కాంగ్రెస్ ఎంపీలు, రాజ్‌బబ్బర్, అజారుద్దీన్ లాంటి సెలబ్రిటీలు, వెల్‌లోకి వచ్చి యుద్ధం చేస్తే, వారు మీకు కనిపించరు... ఆంధ్రప్రదేశ్ ఎంపీలని మాత్రమే సస్పెండ్ చేస్తారు... ఎందుకంటే అది మీ ఇష్టం కనుక.
13వ తారీఖున షిండేగారు బిల్లు ప్రవేశపెట్టేశారని మీరంటారు. సుష్మాస్వరాజ్ గారికి వినబడలేదు, పక్కనే ఉన్న మంత్రులకీ వినబడ లేదు, మీకు మాత్రమే వినబడుతుంది... ఎందుకంటే మీకిష్టం కాబట్టి మీకు వినబడింది.
ఇన్ని అఘాయిత్యాలూ మీకు అఘాయిత్యాలుగా కనబడలేదు కాని ఈ రోజు రూల్ 367(3) అమలు చేస్తే మీకు అఘాయిత్యంగా కనిపిస్తోంది... ఎందుకంటే, మీకిష్టం లేదు కనుక!
మేడమ్, రూల్స్, రాజ్యాంగం, చట్టాలు మనం తయారు చేసు కున్నాం. మనకి ఎలా వీలుగా ఉంటే అలా పాటించుకుంటాం. ప్రతిపక్షం వారు అడ్డుపడతారు - అల్లరి చేస్తారు - జరగనివ్వరు అనే ప్రశ్నే లేదు! అధికార ప్రతిపక్షాలు కలిసిపోయాయి. మిగిలినవి అన్నీ చిన్న చిన్న పార్టీలు. వాళ్లు అరుస్తూనే ఉంటారు. మీరు బిల్లు పాస్ చేసేయండి. ‘పాస్’ అని ప్రకటించటమే గదా...
స్పీకర్: ఎంత తేలిగ్గా చెప్తున్నారు జైపాల్‌రెడ్డి గారూ... ఓటింగ్ నిరాకరించినా, ఎంత మంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరే కమో లెక్కపెట్టి, సంఖ్య ప్రకటించి, బిల్లు పాసయ్యింది అని ప్రకటిం చాలి... ఇది సాధ్యమేనా?!
ఉండవల్లి అరుణ్‌కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు : a_vundavalli@yahoo.com