
బెంగళూరు : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ జైపాల్‌రెడ్డి మరణవార్త విని దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జైపాల్‌రెడ్డి నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉండేవారు. ఆయన నాకు గురువుతో సమానం. నాకు ఆయన 1980 నుంచి తెలుసు.. నేను ఆయన్ని అన్నయ్యలా భావిస్తాను. ఆయన గొప్ప పార్లమెంటరీయన్. మంచి మనస్సు ఉన్నవాడు. జీవితంలో జైపాల్‌రెడ్డి లాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం నా అదృష్టం. ఆయనకు నేను వందనం చేస్తున్నాను. ఇది నాకు చాలా విషాదకరమైన రోజు’ అని తెలిపారు.
కాగా, తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన జైపాల్‌రెడ్డి అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీలకు అతీతంగా పలువురు నేతలు జైపాల్‌రెడ్డికి నివాళులర్పించేందకు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment