
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నాయకుడు ఎస్. జైపాల్‌రెడ్డితో విభేదాలున్నాయని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ అంగీకరించారు. వయసు అంతరం కారణంగానే ఆయనతో రాజకీయ విభేధాలున్నాయని చెప్పుకొచ్చారు. గాంధీభవన్‌లో విలేకరులతో గురువారం ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డికి మహబూబ్‌నగర్ లోక్‌సభ టికెట్ ఇవ్వకూడదని, బీసీల నుంచి బలమైన నేత ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. రేవంత్ రెడ్డితో విభేదాలు లేవని చెప్పారు. రేవంత్ వర్గంపై దాడులను పీసీసీ కాచుకోవాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏఐసీసీ పదవులు తనకు వద్దని, తన సేవలు అవసరం ఉన్నచోట పనిచేసేందుకు సిద్ధమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇతర చోట్ల పనిచేయాల్సిన సమయం ఇది కాదన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత ఉందని, దీన్ని క్యాష్ చేసుకోవడానికి పీసీసీ స్పీడ్ పెంచాలని సూచించారు. అభ్యర్థుల ప్రకటనతో ఒకరిద్దరు ఇబ్బంది పడొచ్చని, వారిని సముదాయించి ముందుకు పోవాలని సూచించారు. తన కుమార్తెకు టికెట్ ఇమ్మని ఇప్పటివరకు అడగలేదన్నారు. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇతర పార్టీల నుంచి కొంత మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment