ఆ తర్వాత మూసీ సుందరీకరణ చేపట్టండి
ఈ ప్రాజెక్టు కోసం రూ.1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?
డీపీఆర్, యాక్షన్ ప్లాన్ లేకుండా, డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దకుండా ఎలా చేస్తారు?
మీడియా చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేసే ముందు మహాత్మాగాం«ధీ బస్టాండ్ (ఎంజీబీఎస్)ను, మెట్రో పిల్లర్లను కూల్చాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వాటిని తొలగించకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రణాళికలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ‘ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలాంటి డీపీఆర్, కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దకుండా సుందరీకరణ ఎలా చేస్తారు? ప్రభుత్వమే రోడ్లువేసి, విద్యుత్ కనెక్షన్లు, ఇంటినంబర్, ఆధార్‌కార్డ్‌లు ఇచ్చి.. ఇప్పుడు పేదలు, దిగువ మధ్యతరగతి వారి ఇళ్లు కూలుస్తామంటే ఎలా? ముందు ఇళ్లు కూల్చుతాము, ఆ తర్వాత ప్రణాళిక వేస్తామంటే.. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతే బాధిత ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? ఇళ్ల కూలి్చవేతపై మూసీ ప్రభావిత ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డి దర్బార్ పెట్టి ప్రజలను ఒప్పించాలి.
సీఎం వస్తే నేను కూడా అక్కడకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడేందుకు సిద్ధం’అని కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చే ముందు ఇమ్లీబన్‌లోని ఎంజీబీఎస్‌ను, అక్కడి మెట్రో పిల్లర్లు, స్టేషన్‌ను కూల్చాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో 30, 40 ఏళ్ల కిందటే పేదలు తమ కష్టార్జితంతో ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే, ప్రభుత్వం పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లను వదిలిపెట్టి పేదలపై పడతామంటే మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు’అని హెచ్చరించారు. కాగా, తమతో బీఆర్‌ఎస్ నేతలెవరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు. తెలంగాణను లూటీ చేసిన ఆ పార్టీతో ఎలాంటి రాజీ లేదని, ఆ పార్టీ అవినీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రాజెక్ట్ పెట్టదని, అక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
హైడ్రా, మూసీపై నేను చెప్పేదే పార్టీ పాలసీ..
‘హైడ్రా ద్వారా దుందుడుకు చర్యలు తీసుకోవడం సరికాదు. హైడ్రా అనేది రేవంత్‌రెడ్డి పెట్టుకున్న పేరు. అక్రమ నిర్మాణాల కూలి్చవేతలకు జీహెచ్‌ఎంసీలో ఓ వ్యవస్థ ఉంది. హైడ్రా వెనుక సీఎం రేవంత్‌రెడ్డికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి’అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీలో హైడ్రాపై భిన్నస్వరాలు వినిపించడంపై ఏమంటారని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘పేదల ఇళ్లు కూల్చమని మా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరైనా చెప్పారా’అని కిషన్‌రెడ్డి తిరిగి ప్రశ్నించారు. హైడ్రా, మూసీపై తాను చెప్పేదే పార్టీ పాలసీ అని స్పష్టంచేశారు.
ఉగ్రవాదాన్ని ఉపేక్షించం
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు క్షీణిస్తే కేంద్రం జోక్యానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ‘కశ్మీర్‌లో బీజేపీ వంద శాతం లక్ష్యం చేరుకుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకి చేయగలిగాం. భారత్‌కు వ్యతిరేకం కాబట్టి ఆ దేశానికి చైనా అన్నిరకాలుగా సహాయపడుతోంది’అని తెలిపారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణ అసాధ్యమని, అది ముగిసిన అధ్యాయమని అన్నారు. జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదా కల్పనపై తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment