
అనుమానంతో భార్య హత్య
భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
యాకుత్‌పురా: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తను మొఘల్‌పురా పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డబీర్‌పురాలోని మీర్‌చౌక్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో శనివారం ఏసీపీ ఎం. శ్రీనివాస్ రావు మొఘల్‌పురా ఇన్‌స్పెక్టర్ ఆర్. దేవేందర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా దెగ్లూర్ బిజ్లివాడి ప్రాంతానికి చెందిన వి. జైపాల్‌రెడ్డి (30), సుహాసిని (26) దంపతులు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. గతేడాది ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో జైపాల్‌రెడ్డి కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి మురాద్‌మహల్‌లో నివాసముంటూ అట్టల ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఇరువురి పెద్దలు కలుగజేసుకొని సర్దిచెప్పారు. ఇదిలా ఉండగా ఇదే విషయమై ఈ నెల 14న తెల్లవారుజామున జైపాల్ రెడ్డి భార్యతో గొడవకు దిగి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం తన భార్యకు చాతిలో నొప్పి వచ్చిందంటూ 108కు ఫోన్ చేశాడు. వాహన సిబ్బంది వచ్చి సుహాసినీని పరిశీలించి మృతి చెందిందని తిరిగి వెళ్లిపోయారు. జైపాల్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళుతున్నానని స్థానికులకు చెప్పి శవాన్ని కూకట్‌పల్లి వరకు ఆటోలో తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మరో వాహనంలో మహారాష్ట్రలోని సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. సుహాసినికి తీవ్ర నొప్పి రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించాడు. కాగా సుహాసిని సోదరుడు నరేశ్ రెడ్డికి అనుమానం రావడంతో వెంటనే మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహారాష్ట్రలోని మర్కల్ పోలీసులకు సమాచారం అందించి శవాన్ని దహనం చేయకుండా చూడాలని సూచించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు చాకచక్యంగా ఛేదించిన ఎస్సై రాజేష్, హెడ్ కానిస్టేబుల్ ఖాజావలీ, కానిస్టేబుల్ సురేష్‌లను ఏసీపీ అభినందించి రివార్డుకు సిఫారసు చేశారు.