సీడబ్ల్యూసీలోకి జైపాల్‌రెడ్డి? | Jaipal Reddy into CWG? | Sakshi
Sakshi News home page

సీడబ్ల్యూసీలోకి జైపాల్‌రెడ్డి?

Published Sun, Sep 3 2017 2:06 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

సీడబ్ల్యూసీలోకి జైపాల్‌రెడ్డి? - Sakshi

సీడబ్ల్యూసీలోకి జైపాల్‌రెడ్డి?

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పొన్నాలకు అవకాశం
► టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పొన్నం?  
► పార్టీపై పట్టు బిగిస్తున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌
► సీనియర్లకు చెక్‌ పెట్టేలా వ్యూహాత్మక అడుగులు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టు బిగిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకూ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కొనసాగుతారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అంతర్గత అంశాల్లో అవరోధంగా మారవచ్చనే అన్ని అంశాలపైనా ఉత్తమ్‌ దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరికీ చెక్‌ పెట్టేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు.

రాష్ట్రంలో పార్టీ అంతర్గత అంశాలు, నిర్ణయాలపై పూర్తిగా పట్టు చిక్కిన తర్వాతే ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడానికి వీలుంటుందనే వ్యూహంతో ఉత్తమ్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే పార్టీలోని సీనియర్ల ప్రభావాన్ని రాష్ట్రంలో తగ్గించడానికి, తనదైన ముద్ర వేసుకోవడానికి ఆయన ఎత్తులు వేస్తున్నారు. తెలంగాణకు చెందిన సీనియర్లు ఎస్‌.జైపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి వారిని జాతీయ పార్టీలోకి తీసుకోవాలని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీకి కీలకమైన వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి జైపాల్‌ వెళ్లనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పొన్నాలకు అవకాశం దక్కనుంది. ఈ ప్రతిపాదనలపై కుంతియా, ఉత్తమ్‌తోనూ చర్చించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరి ప్రమేయం, జోక్యాన్ని రాష్ట్ర పార్టీకి సంబంధించి పరిమితం చేయవచ్చనే ఎత్తుగడతో ఉత్తమ్‌ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. పార్టీకి సీనియర్లుగా ఉన్న సీఎల్పీ నేత కె.జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి సోదరులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పొన్నం..?
టీపీసీసీకి అదనంగా మరో కార్యనిర్వాహక అధ్యక్షుడు వస్తాడని ఉత్తమ్‌ స్వయంగా వెల్లడించారు. ఉత్తమ్‌ ఎత్తుగడలో భాగంగానే అదనంగా మరొకరిని నియమించాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మల్లు భట్టివిక్రమార్క ఒక్కరే ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఉన్నారు.

అయితే సంస్థాగతమైన అంశాలు, నిర్ణయాలు, కార్యక్రమాలకు సంబంధించి ఉత్తమ్‌కు, భట్టివిక్రమార్కకు పొసగడం లేదని చాలాకాలంగా పార్టీలో చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్‌ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భట్టి కూడా పార్టీలో పట్టుకోసం ఎత్తులు వేస్తున్నారు. ఒక్కరే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉంటే అనివార్యంగా ప్రాముఖ్యత పెరుగుతుందని, కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుందనే అలోచనతో మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలని ఉత్తమ్‌ అధిష్టానాన్ని కోరినట్టుగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

మరో సామాజిక వర్గం నుంచి...
భట్టివిక్రమార్కను కదిలించకుండానే స్థాయిని తగ్గించడం ద్వారా తన పట్టును మరింత పెంచుకోవడానికి మరో నాయకుడిని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయాలని ఉత్తమ్‌ కోరినట్టుగా వారంటున్నారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెరో సామాజికవర్గం నుంచి ఉన్నారు. ఓసీలకు సంబంధించి ఉత్తమ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి భట్టి ఉండటంతో బీసీల నుంచి ఒకరికి మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తారని దాదాపుగా తేలిపోయింది. బీసీలకు చెందిన పలువురు నేతలు పోటీపడుతున్నా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి దానం నాగేందర్‌ తన ప్రయత్నాలను చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్లుగా ఉన్న మరికొందరు నాయకులకు ఏఐసీసీలో అవకాశాలు వరించనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement