న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రహస్య పొత్తు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేసులో తాను లేనని.. తనకూ పరి మితులున్నాయని, వయసు కూడా సహకరించదని.. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ కూడా చేయడం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైపాల్ పలు అంశాలపై మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఖాయమైందని.. సీపీఐ, టీజేఎస్‌తో చర్చలు జరుగుతున్నాయని జైపాల్ తెలిపారు.
ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్, బీజేపీ కలుస్తాయని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. ‘అందుకు 100 శాతం అవకాశం ఉంది. రహస్య పొత్తులపై సీఎం కేసీఆర్, ప్రధాని మోదీల మధ్య ఓ అవగాహన ఉంది. కేసీఆర్ ఈ సారి 50 శాతం సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. ఇటు బీజేపీ కూడా 6 నుంచి 7 సీట్ల వరకే పరిమితమవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ లేదా ఎంఐఎంతో పొత్తు అనివార్యమవుతుంది. ఒకవేళ టీఆ ర్‌ఎస్ బీజేపీని ఆశ్రయిస్తే ఎంఐఎంకు విపత్కర పరిస్థితులే ఎదురవుతాయి’ అని చెప్పారు.
అయితే అలాంటి పరిస్థితి రాబోదని.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా మెజారిటీ సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కేసీఆర్ బఫూన్ అన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేసీఆర్ ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.
తాను తీసుకున్న ముందస్తు ఎన్నికల నిర్ణయం వల్ల ఆయనే అసంతృప్తితో ఉన్నారని తెలి పారు. ఎన్నికలకు సంబంధించి సర్వేల ఫలితాలన్నీ కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయి కదా అని ప్రశ్నిం చగా.. ‘ఆ సర్వేలన్నీ పనికిరానివే. బయట పరిస్థితి ఎలా ఉన్నా అంతర్గతంగా కాంగ్రెస్‌కి అనుకూల పవనాలు వీస్తున్నాయి’ అని జైపాల్ వెల్లడించారు.
గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయం: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావుకు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ఈసారి ఓటమి ఖాయమని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కు ప్రజా ఆదరణ తగ్గిపోయిందని, ఆ ప్రాంతం లో కాంగ్రెస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ప్రజాకూటమిలో మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే ఓ కొలిక్కివస్తుందని వీహెచ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment