ఉనికి కోసం జైపాల్‌రెడ్డి పోరాటం  | Harish Rao fires on Jaipal Reddy | Sakshi
Sakshi News home page

ఉనికి కోసం జైపాల్‌రెడ్డి పోరాటం 

Published Wed, Oct 17 2018 1:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Harish Rao fires on Jaipal Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి విమర్శలు ఆ పార్టీ లో తన ఉనికి కోసం పోరాడుతున్నట్లు ఉం దని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. ఆధారాలతో రావాలని సవాల్‌ విసిరారు. పదేళ్ల కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలన లో ఆయకట్టు అభివృద్ధిపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌లతో కలసి తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. ‘ప్రాంతీయ వాదినో, ఉప ప్రాంతీయవాదినో కాదని ఆనాడు ఉద్యమాన్ని అవమానపరిచిన పెద్ద మనిషి.. ఇప్పుడు నోటికొచ్చినట్లు అబద్ధాలాడారు. ఏనాడూ ఉద్యమాన్ని పట్టించుకోలేదు. జైపాల్‌రెడ్డి మాటలు టీఆర్‌ఎస్‌కు లాభించాయి. కాంగ్రెస్‌ సెల్ఫ్‌ గోల్‌ కొట్టుకుంది. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ఎంత ఎక్కువ మా ట్లాడితే టీఆర్‌ఎస్‌కు అంతమేలు. కాంగ్రెస్‌ వారు చేపట్టింది జలయజ్ఞం కాదని, ధనయజ్ఞమని ఇప్పటి వాళ్ల దోస్తు చంద్రబాబు అప్పుడు విమర్శించారు. జైపాల్‌రెడ్డి మాట్లాడితే అతికేటట్లు ఉండాలె. ఒక్క ఇంటికన్న నీళ్లు ఇచ్చిన్రా.. పైపులు తప్ప ఏమున్నయని అడిగిండ్రు. ఆయన మాటల కు నవ్వుకుంటున్నారు. రోజూ ఆ నీళ్లు తాగేవారు జైపాల్‌ను ఏమనుకోవాలి’అని అన్నారు. 

మా చిత్తశుద్ధిని రైతులు చెబుతారు.. 
‘ఒక్క ఎకరానికి సాగునీరు ఇవ్వలేదన్న మీ మాటలకు నవ్వాల్నో, ఏడవాల్నో తెలుస్తలేదు. మీ కల్వకుర్తికి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన పార్టీ మాది. పదేళ్లు అధికారంలో ఉండి 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు రికార్డులో రాసుకున్నారు. ఎన్ని విభజన సమస్యలు ఉన్నా నాలుగేళ్లలో 12 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చాం. మరో 13 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. మా చిత్తశుద్ధి ఏమిటో రైతులు చెబుతారు. మీ లాంటి పెద్దలు వాస్తవాలు తెలుసుకోవాలి. జైపాల్‌రెడ్డి నోరుపారేసుకుని విలువల్లేని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు’అని హరీశ్‌ మండిపడ్డారు.  

అవినీతి గురించి మీరా మాట్లాడేది? 
‘కాంగ్రెస్‌లో చాలా మంది నేను సీఎం అంటే నేను సీఎం అని కొట్టుకుంటున్నారు. ఆ జాబితాలో జైపాల్‌ పేరు కనబడుతలేదు. ఉనికి చాటుకోవడానికి సీఎం రేసులో ఉన్నానని చెప్పుకునేందుకు అలా మాట్లాడారు. అవినీ తి గురించి మాట్లాడేది మీరా. ప్రాజెక్టులో అవినీతి గురించి మాట్లాడే నైతికత, హక్కు కాంగ్రెస్‌కు ఉందా? జైపాల్‌రెడ్డి నిన్న చెప్పిన విషయాలు అన్నీ బహిరంగమే. సర్వే డిజైన్ల పేరిట పనులు కాకుండానే బిల్లులు తీసుకున్నది మీరు. మీ దోస్తు చంద్రబాబే ఈ విషయాలను చెప్పాడు. ఆంధ్రా కంపెనీలను పెంచి పోషించింది మీరు. నవరత్నాలని 9 కంపెనీలను మీ ప్రభుత్వమే ఎంపిక చేసింది. ఆ కంపెనీలను పెంచి పోషించింది కాంగ్రెస్‌. ఆ పనులు రిలయన్స్, వేదాంత కంపెనీలకు వచ్చాయి’అని వివరించారు. 

సర్వే డిజైన్ల పేరిట దోచుకున్నారు 
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలను రూ.16వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచారు. నాలుగేళ్లలో నీళ్లు ఇస్తామని చెప్పి మోసంచేశారు. 2012లో సర్వే కోసం రూ.1,480 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చారు. రూ.140 కోట్ల పనులు చేశారు. ప్రాణహితలో 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు. ఆ రోజు వాళ్లు చెప్పిన కంపెనీలే ఉన్నాయి. అన్ని ప్యాకేజీల్లోనూ 4.8% పైనే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌లో మైనస్‌ 4 శాతంతో టెండర్లు ఇచ్చాం. ప్రభుత్వానికి 10% లాభం వచ్చింది. ఒక్క ప్రాణహితలో రూ.1,205 కోట్లు సర్వే డిజైన్ల పేరిట బిల్లులు దోచుకుం టున్నారు. మేం వచ్చాక వాప్కోస్‌తో సర్వే చేయించాం. అవినీతి విధానాలకు మీరు తెరలేపితే ఆ రోజు జైపాల్‌రెడ్డి గొంతు ఎందుకు మూగబోయింది. మేం పారదర్శక పద్ధతి తెస్తే పైశాచిక ఆనందం కోసం విమర్శలు చేస్తున్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు కడుతుంటే జైపాల్‌ నోరు మూసుకున్నారు. పాల మూరు ఎత్తిపోతలపై కోర్టులో కేసులు వేస్తే కోర్టులు మొట్టికాయలు వేశాయి. కేసీఆర్‌ నిజంగానే నీళ్లు ఇస్తరని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్‌ వాళ్లు చనిపోయిన వారి పేర్లతో కేసులు వేశారు’అని సవాల్‌ విసిరారు.  
తెలంగాణ సాధకులు, ద్రోహులకు మధ్యే పోటీ 
రానున్న ఎన్నికలు తెలంగాణ సాధకులు, తెలంగాణ ద్రోహులకు మధ్యే జరుగుతున్నాయని, ప్రజలు ఎవరివైపు నిలబడతారో చూడాలని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ సాధన కోసం త్యాగాలు చేసిన పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని, ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డు నిలిచింది కాంగ్రెస్‌ నేతలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతల నిర్వాకంతోనే తెలంగాణ యువకుల ప్రాణత్యాగాలు చేయాల్సి వచ్చిందని మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. హరీశ్‌ వారికి పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. తెలంగాణ ఇవ్వొద్దంటూ సోనియాకు లేఖరాసిన చరిత్ర జగ్గారెడ్డిదన్నారు. అమెరికాకు మనుషులను అక్రమ రవాణా చేసిన జగ్గారెడ్డికి టికెట్‌ ఇచ్చి కాంగ్రెస్‌ దేశద్రోహానికి పాల్పడిందన్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న జగ్గారెడ్డికి ఓటు వేస్తారా, అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తికి ఓటు వేస్తారో ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement