
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి తోకపార్టీ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ ఏకమై అవిశ్వాసం పెడితే.. టీఆర్‌ఎస్ అడ్డుకుందని ఆరోపించారు. శనివారం గాంధీభవ న్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా ఓ వ్యాపారి అని, ఆయనకు కొనడం అమ్మడమే తెలుసని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెంచుతున్నా మోదీకి సీఎం కేసీఆర్ సహకరించడాన్ని తప్పుపట్టారు. కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నా కేసీఆర్ మోదీని వదలరని ఎన్నికలు వచ్చే వరకు మోదీకి మిత్రపక్షంగా ఉంటారని జోస్యం చెప్పారు.
విభజన హామీలైన ఎయిమ్స్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిధుల కోసం కేసీఆర్ కేంద్రంతో పోరాడం లేదని విమర్శించారు. లేని ఆస్తులను తెలంగాణ పేరిట చూపించి అప్పులు తెచ్చారని దానివలన ద్రవ్యోల్బణంతో వస్తువుల ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. మన వ్యవస్థలో కాగ్‌కి ప్రత్యేక స్థానం ఉందని, కానీ టీఆర్‌ఎస్ నేతలకు అవి కాకి లెక్కల్లా కనిపిస్తున్నాయని అన్నారు.