సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయాలనుకుంటోన్న జాతీయ పార్టీనుద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నడుమ పిట్టపోరుకు దారితీశాయి. కేసీఆర్ తన పార్టీని ఊహల్లోనూ నడుపుకోవచ్చని, అంతర్జాతీయ పార్టీ పెట్టి చైనా, అమెరికాల్లో కూడా పోటీ చేయొచ్చని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఆయన స్పందనకు ట్విట్టర్ వేదికగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌లు కూడా కౌంటర్‌లు ఇచ్చారు.
సొంత సీటు... కన్న కూతురు
రాహుల్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘సొంత స్థానం అమేథీలో గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీ.. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్‌కు సుద్దులు చెపుతున్నారు’ అని పేర్కొన్నారు. దేశానికి ప్రధాని కావాలనుకునే నాయకుడు ముందు సొంత నియోజకవర్గ ప్రజలను మెప్పించాలని సూచించారు. ఈ ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
‘కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేని ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా? ఎవరన్నా గుర్తు చేయండ్రాబాబూ!? అంటూ రీట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ కూడా స్పందించారు. ఓటమితోనే గెలుపు ప్రారంభమవుతుందని, ఒక్క ఓటమి ద్వారా నాయకుడి భవిష్యత్‌ను నిర్ణయించలేమని, అలా అయితే సిద్దిపేటలో ఓడిపోయింది ఎవరని మాణిక్యం ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment