
కేసీఆర్‌ది దొంగ దీక్ష కాదని నిరూపిస్తారా?
హైదరాబాద్: ‘కేసీఆర్ దీక్ష చేయడం వల్ల తెలంగాణ రాలేదు. ఆయన ఎలా దీక్ష చేశారో .. ఎలా విరమించారో .. ఉస్మానియా విద్యార్థుల నుంచి ఎలా నిరసన ఎదుర్కొన్నారో జనానికి తెలుసని’ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి వ్యాఖ్యానించారు. కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష కాదని తెరాస నేతలు నిరూపించగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర లేదని తెరాస నేతలు మాట్లాడటం, ఆయన పై విమర్శలు చేయడం రాజకీయ అజ్ఞానమేనన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక కేసీఆర్ మొదట జైపాల్ రెడ్డిని కలిసిన విషయం తెరాస నేతలు మర్చిపోయారా అని నిలదీశారు.
తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ నేతలు చేసిన కృషి ప్రజలకు తెలుసు, తెరాస మాటలను జనం నమ్మరని తెలిపారు. కేసీఆర్ వేయి రోజుల పాలనలో వేయి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రుణమాఫీ పథకాన్ని వడ్డీ మాఫీ పథకంగా మార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పాటలు పాడిన ధూంధాం కళాకారులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిందని విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచితహామీని అటకెక్కించారని అన్నారు. 2013 చట్టం ప్రకారమే ప్రాజెక్టుల భూసేకరణ జరగాలని డిమాండ్ చేశారు.