మాటల్లో మావో.. చేతల్లో నియంత | jaipal reddy fires on narendra modi | Sakshi
Sakshi News home page

మాటల్లో మావో.. చేతల్లో నియంత

Published Wed, Dec 14 2016 4:11 AM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM

మాటల్లో మావో.. చేతల్లో నియంత - Sakshi

మాటల్లో మావో.. చేతల్లో నియంత

ప్రధాని మోదీపై జైపాల్‌రెడ్డి ఫైర్‌
‘నోట్ల రద్దు’ పెద్ద తప్పుడు నిర్ణయం
దేశ ప్రజలకు కొత్త కష్టాలు తీసుకువచ్చారు
కొందరికి వందల కోట్ల కొత్త కరెన్సీ ఎలా అందుతోంది?
బ్యాంకులనే నియంత్రించలేని మోదీ నల్లధనాన్ని ఆపుతారా?
మోదీకి కేసీఆర్‌ మద్దతుపై అనుమానాలున్నాయి
కేసీఆర్‌లా దిగజారి ఆరోపణలు చేయలేనని వ్యాఖ్య


సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మావోయిస్టులా ధర్మాలు మాట్లా డుతూ.. పచ్చి నిరంకుశవాదిగా ప్రజలను కష్టపెడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త కష్టాలు తెచ్చిపెట్టారని విమర్శించారు. కొత్త నోట్లు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లనే నియం త్రించలేని మోదీ.. నల్లధనాన్ని ఎలా నియం త్రిస్తారని నిలదీశారు. మంగళవారం గాంధీ భవన్ లో పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డిలతో కలసి జైపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

దేశ ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిన ప్రధాన మంత్రి మోదీ తప్ప మరెవరూ లేరని పేర్కొన్నారు. పేదలు, రైతులు, సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతుంటే... కొంత మందికి వందల కోట్లలో కొత్త కరెన్సీ ఎలా వస్తోందని ప్రశ్నించారు. కరెన్సీని పంపిణీ చేయడంలో బ్యాంకులను నియంత్రించలేని మోదీ... నల్లధనాన్ని, 125 కోట్ల మంది దేశ ప్రజలను ఎలా నియంత్రిస్తారని నిలదీశారు. మొత్తంగా రూ.14 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణీలో ఉండగా.. రద్దు తర్వాత ఇప్పటికే రూ.13 లక్షల కోట్లు బ్యాంకులకు చేరిపోయాయని... అంటే దేశంలో నల్లధనమే లేదని ప్రధాని మోదీ తేల్చడానికి రంగం సిద్ధమైందని విమర్శించారు.

పూటకో మాట..
మోదీ పూటకో మాటతో సంపన్నులను కాపాడుకుంటూ, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని జైపాల్‌రెడ్డి మండిపడ్డారు. సామాన్యులు ఒక్క నోటు కోసమే తిప్పలు పడుతుంటే.. ధనవంతుల దగ్గరకు వందల కోట్ల కొత్త కరెన్సీ ఎలా చేరిందన్నారు. మోదీ మావోయిస్టులాగా ధర్మాలు మాట్లాడుతూ.. చేతల్లో ఆర్థిక నిరంకు శత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శిం చారు. నోట్ల రద్దుతో సామాన్యులు నిత్యావసరాల కోసమే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. మరి ఈ ఇబ్బందులు మోదీ కేబినెట్‌లో ఉన్న నితిన్  గడ్కరీకి లేవేమిటని ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత నితిన్ గడ్కరీ, గాలి జనార్దనరెడ్డి వంటి వారు ఆడంబరంగా వివాహాలు జరిపించారని గుర్తుచేశారు.

ఇది పెద్ద తప్పుడు నిర్ణయం
నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు రిజర్వుబ్యాంకుతో ప్రధాని మోదీ చర్చిం చారా..? మాట్లాడితే వారు ఏం చెప్పారనే విషయాలను వెల్లడించాలని జైపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘‘వ్యవసాయ పనుల కాలం తర్వాత నిర్ణయం తీసుకుందామని, అప్పటిలోగా కరెన్సీని అందుబాటులోకి తేవడానికి వీలుంటుం దని ఆర్‌బీఐ అధికారులు సూచనలు చేశారని తెలిసింది. అయినా మోదీ పట్టించుకోలేదు. విదేశాల్లో 80 లక్షల కోట్ల నల్లధనం ఉందని, అదంతా తెప్పించి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం తప్పు, సందర్భం తప్పు, ఏర్పాట్లు చేయకపోవం తప్పు. ఇంత పెద్ద నిర్ణయాన్ని అవగాహన, అనుభవం లేకుండా తీసుకున్నారు. అందుకే మొత్తం ఫలితాలే చాలా ప్రమాదకరంగా ఉండబోతున్నాయి..’’ అని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్‌ ప్రసన్నుడెలా అయ్యాడో?
తొలుత నోట్ల రద్దును వ్యతిరేకించిన సీఎం కేసీఆర్‌ తర్వాత ఎందుకు మద్దతిచ్చారని.. దీనిపై అనుమానాలు ఉన్నాయని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఖిన్నుడిగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌ ప్రసన్నుడిగా తిరిగి వచ్చారని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలో, వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసమో మద్దతిచ్చి ఉండవచ్చన్నారు. అయితే అనుమానాల గురించి ఆరోపణలు చేయలేనని, నిర్దిష్టమైన సమాచారం వస్తే మాట్లాడుతానని చెప్పారు. కాంగ్రెస్‌ నేతల దగ్గర నల్లధనం ఉందంటూ మాట్లాడిన కేసీఆర్‌ స్థాయికి తాను దిగజారి మాట్లాడలేనని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ రాజకీయంగా ఎప్పుడు, ఎవరితో దోస్తీ చేస్తారో, ఎవరితో వైరం పెంచుకుంటారో దేవుడికి కూడా తెలియదని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్‌ ఎటు తిరిగినా, ఎవరితో ఉన్నా అంతిమంగా బీజేపీ గూటికే చేరుతాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement