Canced currency
-
నల్లకుబేరులకు నరేంద్రమోదీ హెచ్చరిక
-
‘డిసెంబర్ 30’ డెడ్‌లైన్ దాటాక చుక్కలే..
-
డెడ్‌లైన్ దాటాక చుక్కలే..
అవినీతిపరులు భయం భయంగా గడపాల్సిందే ► 50 రోజుల డెడ్‌లైన్ పై ప్రధాని మోదీ హెచ్చరిక ► అవినీతి పరులు ప్రతిఫలం అనుభవించక తప్పదని స్పష్టీకరణ నిజాయితీపరుల కష్టాలు తగ్గుముఖం పడతాయని భరోసా అవినీతిపరులు ప్రతిఫలం అనుభవించక తప్పదని స్పష్టీకరణ దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠిన సంస్కరణలు కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులకు వ్యూహం అవినీతిపరులారా.. 125 కోట్ల మంది దేశ ప్రజల ఆలోచనను తక్కువ అంచనా వేయొద్దు. డిసెంబర్ 30 తర్వాత మీరు భయం భయంగా గడపాల్సిందే. అక్రమార్కులపై కఠినమైన చర్యలకు సమయం ఆసన్నమైంది. ఇది స్వచ్ఛత ఉద్యమం. భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రభుత్వం బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాలను కొనసాగిస్తోంది. దేశానికి మేలుచేసేది ఎంత కఠినమైన నిర్ణయమైనా వెనుకడుగు వేసేది లేదు. కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులు రాబట్టాల్సి ఉంది. ఆర్థిక మార్కెట్లనుంచి లాభపడేవారు సరైన పన్నుల చెల్లింపు ద్వారా దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములవ్వాలి. ఇందుకోసం మేం సమర్థమైన, పారదర్శకమైన, ప్రగతిశీల విధానాలను ఆలోచిస్తున్నాం. – ముంబై సభలో ప్రధాని మోదీ ముంబై/పాతాళ్‌గంగ: నోట్లరద్దు పథకం అమలుకు సూచించిన ‘డిసెంబర్ 30’ డెడ్‌లైన్ ముగిసిన తర్వాత అవినీతిపరులకు తీవ్రమైన కష్టాలు మొదలవుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. ‘అవినీతి పరులారా.. 125కోట్ల మంది దేశ ప్రజల ఆలోచనను తక్కువ అంచనా వేయొద్దు. డిసెంబర్ 30 తర్వాత మీరు భయం భయంగా గడపాల్సిందే. అక్రమార్కులపై కఠినమైన చర్యలకు సమయం ఆసన్నమైంది. ఇది స్వచ్ఛత ఉద్యమం’ అని వెల్లడించారు. నవంబర్ 8 నిర్ణయానికి 50 రోజులు పూర్తయిన తర్వాత.. నిజాయితీ పరుల కష్టాలు తగ్గుముఖం పట్టి అక్రమార్కుల సమస్యలు పెరుగుతాయని ప్రధాని తెలిపారు. ‘నోట్లరద్దు ప్రకటించిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నా నిర్ణయానికి మద్దతిచ్చారు. దీన్ని విఫలం చేద్దామనుకున్న వారి ఆటలు సాగనివ్వలేదు. బ్యాంకు అధికారులతో కలిసి నల్లధనాన్ని చెలమణిలోకి తెచ్చుకునేందుకు కొందరు ప్రయత్నించారు. వారిలో చాలా మందిని పట్టుకున్నాం. 50 రోజులు ఇబ్బందులు తప్పవని ముందే చెప్పాను. మరొక్కసారి చెబుతున్నా.. మనం గెలిచేంతవరకు ఈ యుద్ధం ముగిసినట్లు కాదు’ అని ప్రధాని అన్నారు. 70 ఏళ్లుగా దేశంలో అవినీతికి పాల్పడిన వారంతా తమ చర్యలకు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదన్నారు. మరింత ‘కేపిటల్’ పన్ను దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠినమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. విశాలమైన దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాల’ను తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. మహారాష్ట్రలోని కర్జత్ సమీపంలోని పాతాళ్‌గంగ (మహారాష్ట్రలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం)లో సెబీ నేతృత్వంలో నడిచే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్ఐఎస్ఎమ్) ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌కు (ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టొచ్చని భావిస్తున్నారు) సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రభుత్వం బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాలను కొనసాగిస్తుంది. స్వల్పకాలిక రాజకీయ అవసరాల కోసం మా నిర్ణయాలుండవు. దేశానికి మేలుచేసేది ఎంత కఠినమైన నిర్ణయమైనా వెనుకడుగు వేసేది లేదు’ అని మోదీ స్పష్టం చేశారు. కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులు రాబట్టాల్సి ఉందన్న మోదీ.. ‘ఆర్థిక మార్కెట్లనుంచి లాభపడేవారు సరైన పన్నుల చెల్లింపు ద్వారా దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములవ్వాలి. ఇందుకోసం మేం సమర్థమైన, పారదర్శకమైన, ప్రగతిశీల విధానాలను ఆలోచిస్తున్నాం’ అని తెలిపారు. కేపిటల్ మార్కె ట్లు.. మౌలిక వసతులు, వ్యవసాయ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘మార్కెట్లు సరైన దిశలో విజయవంతంగా నడుస్తుంటే.. దీని లాభం దలాల్ స్ట్రీట్కో, ఢిల్లీలోని ప్రభుత్వానికో కాదు.. గ్రామాల్లో, లక్షల మంది రైతులకు కలుగుతుంది’ అని తెలిపారు. కమొడిటీ మార్కెట్లు రైతులకు ఉపయోగపడకపోతే.. ఆర్థిక వ్యవస్థకు ఈ మార్కెట్ల ఉ పయోగం ఉండదన్నారు. ఇన్నాళ్లుగా దేశంలో ము నిసిపల్ బాండ్లు లేకపోవటం అసంతృప్తిని కలిగించిందని.. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా కనీసం పది నగరాల్లో మునిసిపల్ బాండ్లు ఇష్యూ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సెబీ, ఆర్థిక శాఖలను కోరారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) త్వరలోనే అమల్లోకి రానుందని తెలిపారు. స్టార్టప్‌లు స్టాక్మార్కెట్లోకి రావాలన్నారు. మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవిస్, ఆర్థిక మంత్రి జైట్లీ, సెబీ చైర్మన్ యూకే సిన్హా పాల్గొన్నారు. -
కొందరి చేతికే ఎలా?
కొత్తనోట్లపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ► రూ.24వేల విత్‌డ్రాయల్‌పై నోటిఫికేషన్ కు కట్టుబడి ఉండాలని సూచన ► డీసీసీబీలపై రెండ్రోజుల్లో నిర్ణయమన్న అటార్నీ జనరల్ న్యూఢిల్లీ: పెద్ద నోట్లరద్దు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో కొత్తనోట్లు పట్టుబడటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు అందుబాటులో నోట్లు లేక ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలు కడుతుంటే.. దేశవ్యాప్తంగా సోదాలు, దాడుల్లో వందల కోట్ల విలువైన కొత్తనోట్లు బయటపడటంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘కొత్త కరెన్సీ కొందరికి మాత్రమే పెద్ద సంఖ్యలో దొరుకుతోంది. ఎలా కొందరు ఇంత పెద్దమొత్తాన్ని సంపాదిస్తున్నారు?’అని కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం సీజేఐ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. ‘కొందరు బ్యాంకు ఉద్యోగులు మోసపూరితంగా డబ్బులను బయటకు తరలించినట్లు తెలియటంతో వారిని అరెస్టు చేశారు. లెక్క తేలని ధనాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి’అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. కాగా, వారానికి రూ. 24వేల విత్‌డ్రాయల్ పరిమితికి కేంద్రం కట్టుబడి ఉండాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘పాతనోట్లను డిపాజిట్ చేస్తున్న వారికి మీరు డబ్బులివ్వాలి. కానీ అది జరగటం లేదు. మీ దగ్గర డబ్బులేదనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. ఎప్పటిలోగా ప్రజలు చేసుకున్న డిపాజిట్లకు సరైన మొత్తాన్ని చెల్లిస్తారో చెప్పండి. మీకూ కొన్ని నిబంధనలుండాలి కదా’అని ధర్మాసనం.. రోహత్గీని ప్రశ్నించింది. నోట్లరద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ పిటిషనర్ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్.. ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు నోట్లరద్దు తర్వాత మూడు రోజుల పాటు రూ.8వేల కోట్లు సేకరించినా.. తర్వాత ఈ బ్యాంకుల ద్వారా డబ్బులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వలేద’ని వాదించారు. దీనికి రోహత్గీ స్పందిస్తూ.. ‘సహకార బ్యాంకుల ద్వారా కొత్త నోట్ల పంపిణీపై రెండ్రోజుల్లో తాజా నోటిఫికేషన్ ఇస్తాం’అని తెలిపారు. ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి రానందునే సహకార బ్యాంకులకు కొత్తనోట్ల పంపిణీ అవకాశం ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. కొత్త కరెన్సీలో రూ.5లక్షల కోట్ల వరకు చెలామణిలోకి వచ్చిందని.. దీంతోపాటు రూ. 2.5లక్షల కోట్ల కరెన్సీ రూ.100, రూ.50 నోట్ల రూపంలో మార్కెట్లో ఉందని కోర్టుకు విన్నవించారు. నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో వేస్తున్న పిటిషన్లను విచారించవద్దని రోహత్గీ కోరగా.. దీనిపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఆదేశాలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. గడ్డం క్రమశిక్షణకు అడ్డమే! వాయుసేన ఉద్యోగి పిటిషన్ పై సుప్రీం కీలక తీర్పు న్యూఢిల్లీ: వాయుసేనలో పనిచేసే వ్యక్తులు మత సంబంధ కారణాలతో క్రమశిక్షణను ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. వాయుసేన (ఐఏఎఫ్) ఉద్యోగి అన్సారీ పొడవైన గడ్డంతో విధులకు హాజరవుతుండటాన్ని తప్పుపడుతూ ఐఏఎఫ్ 2003లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై అన్సారీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిక్కులు తలపాగా ధరిస్తారని, వారిలాగే తనకూ మతపరమైన సమానత్వం కల్పించాలని కోరారు. సాయుధ దళాల నిబంధనలు క్రమశిక్షణను, ఏకరూపతను పాటించేలా చేయడానికి ఉద్దేశించినవంటూ ఐఏఎఫ్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఆ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది. -
మాటల్లో మావో.. చేతల్లో నియంత
ప్రధాని మోదీపై జైపాల్‌రెడ్డి ఫైర్ ► ‘నోట్ల రద్దు’ పెద్ద తప్పుడు నిర్ణయం ► దేశ ప్రజలకు కొత్త కష్టాలు తీసుకువచ్చారు ► కొందరికి వందల కోట్ల కొత్త కరెన్సీ ఎలా అందుతోంది? ► బ్యాంకులనే నియంత్రించలేని మోదీ నల్లధనాన్ని ఆపుతారా? ► మోదీకి కేసీఆర్ మద్దతుపై అనుమానాలున్నాయి ► కేసీఆర్‌లా దిగజారి ఆరోపణలు చేయలేనని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మావోయిస్టులా ధర్మాలు మాట్లా డుతూ.. పచ్చి నిరంకుశవాదిగా ప్రజలను కష్టపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మండిపడ్డారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త కష్టాలు తెచ్చిపెట్టారని విమర్శించారు. కొత్త నోట్లు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లనే నియం త్రించలేని మోదీ.. నల్లధనాన్ని ఎలా నియం త్రిస్తారని నిలదీశారు. మంగళవారం గాంధీ భవన్ లో పార్టీ నేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, ఉద్దెమర్రి నర్సింహారెడ్డిలతో కలసి జైపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిన ప్రధాన మంత్రి మోదీ తప్ప మరెవరూ లేరని పేర్కొన్నారు. పేదలు, రైతులు, సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతుంటే... కొంత మందికి వందల కోట్లలో కొత్త కరెన్సీ ఎలా వస్తోందని ప్రశ్నించారు. కరెన్సీని పంపిణీ చేయడంలో బ్యాంకులను నియంత్రించలేని మోదీ... నల్లధనాన్ని, 125 కోట్ల మంది దేశ ప్రజలను ఎలా నియంత్రిస్తారని నిలదీశారు. మొత్తంగా రూ.14 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు చలామణీలో ఉండగా.. రద్దు తర్వాత ఇప్పటికే రూ.13 లక్షల కోట్లు బ్యాంకులకు చేరిపోయాయని... అంటే దేశంలో నల్లధనమే లేదని ప్రధాని మోదీ తేల్చడానికి రంగం సిద్ధమైందని విమర్శించారు. పూటకో మాట.. మోదీ పూటకో మాటతో సంపన్నులను కాపాడుకుంటూ, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని జైపాల్‌రెడ్డి మండిపడ్డారు. సామాన్యులు ఒక్క నోటు కోసమే తిప్పలు పడుతుంటే.. ధనవంతుల దగ్గరకు వందల కోట్ల కొత్త కరెన్సీ ఎలా చేరిందన్నారు. మోదీ మావోయిస్టులాగా ధర్మాలు మాట్లాడుతూ.. చేతల్లో ఆర్థిక నిరంకు శత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శిం చారు. నోట్ల రద్దుతో సామాన్యులు నిత్యావసరాల కోసమే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. మరి ఈ ఇబ్బందులు మోదీ కేబినెట్లో ఉన్న నితిన్ గడ్కరీకి లేవేమిటని ప్రశ్నించారు. నోట్ల రద్దు తర్వాత నితిన్ గడ్కరీ, గాలి జనార్దనరెడ్డి వంటి వారు ఆడంబరంగా వివాహాలు జరిపించారని గుర్తుచేశారు. ఇది పెద్ద తప్పుడు నిర్ణయం నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు రిజర్వుబ్యాంకుతో ప్రధాని మోదీ చర్చిం చారా..? మాట్లాడితే వారు ఏం చెప్పారనే విషయాలను వెల్లడించాలని జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘వ్యవసాయ పనుల కాలం తర్వాత నిర్ణయం తీసుకుందామని, అప్పటిలోగా కరెన్సీని అందుబాటులోకి తేవడానికి వీలుంటుం దని ఆర్బీఐ అధికారులు సూచనలు చేశారని తెలిసింది. అయినా మోదీ పట్టించుకోలేదు. విదేశాల్లో 80 లక్షల కోట్ల నల్లధనం ఉందని, అదంతా తెప్పించి ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం తప్పు, సందర్భం తప్పు, ఏర్పాట్లు చేయకపోవం తప్పు. ఇంత పెద్ద నిర్ణయాన్ని అవగాహన, అనుభవం లేకుండా తీసుకున్నారు. అందుకే మొత్తం ఫలితాలే చాలా ప్రమాదకరంగా ఉండబోతున్నాయి..’’ అని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ప్రసన్నుడెలా అయ్యాడో? తొలుత నోట్ల రద్దును వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ తర్వాత ఎందుకు మద్దతిచ్చారని.. దీనిపై అనుమానాలు ఉన్నాయని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఖిన్నుడిగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రసన్నుడిగా తిరిగి వచ్చారని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలో, వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసమో మద్దతిచ్చి ఉండవచ్చన్నారు. అయితే అనుమానాల గురించి ఆరోపణలు చేయలేనని, నిర్దిష్టమైన సమాచారం వస్తే మాట్లాడుతానని చెప్పారు. కాంగ్రెస్ నేతల దగ్గర నల్లధనం ఉందంటూ మాట్లాడిన కేసీఆర్ స్థాయికి తాను దిగజారి మాట్లాడలేనని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ రాజకీయంగా ఎప్పుడు, ఎవరితో దోస్తీ చేస్తారో, ఎవరితో వైరం పెంచుకుంటారో దేవుడికి కూడా తెలియదని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ ఎటు తిరిగినా, ఎవరితో ఉన్నా అంతిమంగా బీజేపీ గూటికే చేరుతాడన్నారు.