
డెడ్‌లైన్ దాటాక చుక్కలే..
అవినీతిపరులు భయం భయంగా గడపాల్సిందే
► 50 రోజుల డెడ్‌లైన్ పై ప్రధాని మోదీ హెచ్చరిక
► అవినీతి పరులు ప్రతిఫలం అనుభవించక తప్పదని స్పష్టీకరణ
నిజాయితీపరుల కష్టాలు తగ్గుముఖం పడతాయని భరోసా అవినీతిపరులు ప్రతిఫలం అనుభవించక తప్పదని స్పష్టీకరణ దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠిన సంస్కరణలు కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులకు వ్యూహం
అవినీతిపరులారా.. 125 కోట్ల మంది దేశ ప్రజల ఆలోచనను తక్కువ అంచనా వేయొద్దు. డిసెంబర్ 30 తర్వాత మీరు భయం భయంగా గడపాల్సిందే. అక్రమార్కులపై కఠినమైన చర్యలకు సమయం ఆసన్నమైంది. ఇది స్వచ్ఛత ఉద్యమం.
భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రభుత్వం బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాలను కొనసాగిస్తోంది. దేశానికి మేలుచేసేది ఎంత కఠినమైన నిర్ణయమైనా వెనుకడుగు వేసేది లేదు. కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులు రాబట్టాల్సి ఉంది. ఆర్థిక మార్కెట్లనుంచి లాభపడేవారు సరైన పన్నుల చెల్లింపు ద్వారా దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములవ్వాలి. ఇందుకోసం మేం సమర్థమైన, పారదర్శకమైన, ప్రగతిశీల విధానాలను ఆలోచిస్తున్నాం. – ముంబై సభలో ప్రధాని మోదీ
ముంబై/పాతాళ్‌గంగ: నోట్లరద్దు పథకం అమలుకు సూచించిన ‘డిసెంబర్ 30’ డెడ్‌లైన్ ముగిసిన తర్వాత అవినీతిపరులకు తీవ్రమైన కష్టాలు మొదలవుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. ‘అవినీతి పరులారా.. 125కోట్ల మంది దేశ ప్రజల ఆలోచనను తక్కువ అంచనా వేయొద్దు. డిసెంబర్ 30 తర్వాత మీరు భయం భయంగా గడపాల్సిందే. అక్రమార్కులపై కఠినమైన చర్యలకు సమయం ఆసన్నమైంది. ఇది స్వచ్ఛత ఉద్యమం’ అని వెల్లడించారు. నవంబర్ 8 నిర్ణయానికి 50 రోజులు పూర్తయిన తర్వాత.. నిజాయితీ పరుల కష్టాలు తగ్గుముఖం పట్టి అక్రమార్కుల సమస్యలు పెరుగుతాయని ప్రధాని తెలిపారు.
‘నోట్లరద్దు ప్రకటించిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నా నిర్ణయానికి మద్దతిచ్చారు. దీన్ని విఫలం చేద్దామనుకున్న వారి ఆటలు సాగనివ్వలేదు. బ్యాంకు అధికారులతో కలిసి నల్లధనాన్ని చెలమణిలోకి తెచ్చుకునేందుకు కొందరు ప్రయత్నించారు. వారిలో చాలా మందిని పట్టుకున్నాం. 50 రోజులు ఇబ్బందులు తప్పవని ముందే చెప్పాను. మరొక్కసారి చెబుతున్నా.. మనం గెలిచేంతవరకు ఈ యుద్ధం ముగిసినట్లు కాదు’ అని ప్రధాని అన్నారు. 70 ఏళ్లుగా దేశంలో అవినీతికి పాల్పడిన వారంతా తమ చర్యలకు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదన్నారు.
మరింత ‘కేపిటల్’ పన్ను
దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠినమైన ఆర్థిక సంస్కరణలు తీసుకురానున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. విశాలమైన దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాల’ను తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. మహారాష్ట్రలోని కర్జత్ సమీపంలోని పాతాళ్‌గంగ (మహారాష్ట్రలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం)లో సెబీ నేతృత్వంలో నడిచే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్ఐఎస్‌ఎమ్) ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌కు (ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టొచ్చని భావిస్తున్నారు) సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రభుత్వం బలమైన, దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాలను కొనసాగిస్తుంది. స్వల్పకాలిక రాజకీయ అవసరాల కోసం మా నిర్ణయాలుండవు. దేశానికి మేలుచేసేది ఎంత కఠినమైన నిర్ణయమైనా వెనుకడుగు వేసేది లేదు’ అని మోదీ స్పష్టం చేశారు.
కేపిటల్ మార్కెట్ నుంచి మరిన్ని పన్నులు రాబట్టాల్సి ఉందన్న మోదీ.. ‘ఆర్థిక మార్కెట్లనుంచి లాభపడేవారు సరైన పన్నుల చెల్లింపు ద్వారా దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములవ్వాలి. ఇందుకోసం మేం సమర్థమైన, పారదర్శకమైన, ప్రగతిశీల విధానాలను ఆలోచిస్తున్నాం’ అని తెలిపారు. కేపిటల్ మార్కె ట్లు.. మౌలిక వసతులు, వ్యవసాయ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘మార్కెట్లు సరైన దిశలో విజయవంతంగా నడుస్తుంటే.. దీని లాభం దలాల్ స్ట్రీట్‌కో, ఢిల్లీలోని ప్రభుత్వానికో కాదు.. గ్రామాల్లో, లక్షల మంది రైతులకు కలుగుతుంది’ అని తెలిపారు. కమొడిటీ మార్కెట్లు రైతులకు ఉపయోగపడకపోతే.. ఆర్థిక వ్యవస్థకు ఈ మార్కెట్ల ఉ పయోగం ఉండదన్నారు.
ఇన్నాళ్లుగా దేశంలో ము నిసిపల్ బాండ్లు లేకపోవటం అసంతృప్తిని కలిగించిందని.. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా కనీసం పది నగరాల్లో మునిసిపల్ బాండ్లు ఇష్యూ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సెబీ, ఆర్థిక శాఖలను కోరారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) త్వరలోనే అమల్లోకి రానుందని తెలిపారు. స్టార్టప్‌లు స్టాక్‌మార్కెట్‌లోకి రావాలన్నారు. మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవిస్, ఆర్థిక మంత్రి జైట్లీ, సెబీ చైర్మన్ యూకే సిన్హా పాల్గొన్నారు.