ఉన్మాదం పెరిగితే దేశ ఉనికికే ముప్పు
- మతాన్ని, కులాన్ని ఆరాధించేవాళ్లు హిట్లర్ వంశీకులు
- చండ్ర రాజేశ్వరరావు జయంతి సభలో జైపాల్‌రెడ్డి
- రాజకీయాలను వ్యాపారమయం చేసిందే చంద్రబాబు: నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉన్మాదం పెరిగితే ఉనికికే ముప్పు ఏర్పడుతుందని మాజీ కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి హెచ్చరించారు. మత సామరస్యతకు, సమగ్రతకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత బీజేపీ పాలనలో ఆపద ముంచుకొచ్చిందని ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ అధ్యక్షతన సోమవారమిక్కడ జరిగిన సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 102 జయంతి సభకు జైపాల్‌రెడ్డి ప్రధాన వక్తగా హాజరై ‘ప్రస్తుత రాజకీయాలు- ప్రధాన సవాళ్లు’ అంశంపై మాట్లాడారు. దేశం, జాతి, జాతీయ సమైక్యత అనేవి వాస్తవానికి రెండు మూడొందల ఏళ్ల కిందటి వరకు లేవని చెప్పారు.
మతాన్ని, జాతిని కీర్తించేవాళ్లందరూ హిట్లర్ వంశీకులేనన్నారు. దేశ సమగ్రత, భావ సమైక్యతకు మతతత్వ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి మనం ఇప్పుడు ఇరాన్‌గా పిలుస్తున్న దేశం ఆర్యులదని, ఆ మాటంటే బీజేపీకి కోపం రావొచ్చన్నారు. వాజ్‌పేయి హయాంలో ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్య అంశం, 371 ఆర్టికల్ ఊసే లేవన్నారు. కానీ 2014 ఎన్నికల ప్రణాళికలో బీజేపీ వీటిని పెట్టి, రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేని ప్రాంతీయ పార్టీలతో కలసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందన్నారు. గతంలో మత సామరస్యతకు ముప్పు ఏర్పడిన ప్రతిసారి కమ్యూనిస్టులు, ప్రత్యేకించి చండ్ర రాజేశ్వరరావు లాంటి వారు ముందుండి పోరాడారని గుర్తుచేశారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే గిట్టని కమ్యూనిస్టులే మంచి పార్లమెంటేరియన్లుగా ఎదిగారని, ప్రజాస్వామ్య పునాదుల్ని, స్ఫూర్తిని దెబ్బతీసే ఏ చర్యనూ సహించవద్దన్నారు. తెలుగువారి చరిత్రపుటల్లో ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ల సరసన నిలవగలిగిన గొప్ప వ్యక్తి చండ్ర అని కొనియాడారు. అంతకుముందు చండ్ర రాజేశ్వరరావు చిత్ర పటానికి జైపాల్‌రెడ్డితోపాటు, సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, చెన్నకేశవ్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, సీనియర్ జర్నలిస్టు సి.రాఘవాచారి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీఆర్ ఆంధ్రుడని ఫౌండేషన్‌కు కేసీఆర్ స్థలం ఇవ్వనన్నారు: నారాయణ
చండ్ర రాజేశ్వరరావు లాంటి అంతర్జాతీయ దిగ్గజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తన దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వబోనని చెప్పడమే కాకుండా బాబ్రీ మసీదు ధ్వంసాన్ని అడ్డుకున్న చండ్ర త్యాగజీవని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన యోధుడని చెప్పారు. ప్రజల కోసం వందలాది ఎకరాలను తృణప్రాయంగా త్యజించిన చండ్ర పేరిట నిర్వహిస్తున్న సీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఏర్పాటుకు రెండెకరాల స్థలం ఇమ్మని తమ పార్టీ అడిగితే కేసీఆర్ తిప్పికొట్టిన తీరు క్షోభకు గురిచేసిందన్నారు.
సీఆర్ ఆంధ్రుడైనందున స్థలం ఇవ్వడానికి నిరాకరించారని తెలిసి ఇక ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు చెప్పారు. రాజకీయ వ్యవస్థ వ్యాపారమయమైందని, అమ్ముడు పోయే బడుద్ధాయిలు, సంతలో గొర్రెల మాదిరి కొనే నాయకులు తయారయ్యారన్నారు. రాజకీయాలను వ్యాపారమయం చేసిందే చంద్రబాబు అని, పారిశ్రామిక వేత్తల్ని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేసింది ఆయనేనన్నారు. సుజానా చౌదరిని ఎంపీగా చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్,బాబు ఇద్దరూ ఒకే తాను ముక్కలని, గొడవలు మాని కృష్ణా, గోదావరి జలాల సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు.