
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచి తీరుతుందని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పనిపడతామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ తనకు తానే తెలివిగలవాడినని, అందరినీ మోసం చేయగలనని అనుకుంటున్నాడు. ఇన్నాళ్లూ ఫెడరల్ ఫ్రంట్ పాట పాడాడు. ఇప్పుడు ప్రధాని మోదీతో స్నేహం చేస్తున్నాడు’’అని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడెక్కడుందో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందని, టీఆర్‌ఎస్‌ను గద్దె దించే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్పారు.
ఇందిరది చెరగని ముద్ర
దివంగత ప్రధాని ఇందిరా గాంధీని బీజేపీ నేతలు హిట్లర్‌తో పోల్చడాన్ని జైపాల్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇటీవల పాస్‌పోర్ట్ రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న ఒక హిందూ ముస్లిం జంట విషయంలో కేంద్రంలోని పెద్దలు వివక్ష చూపారని జైపాల్ ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అనుచరులు ఆ జంటపై సోషల్ మీడియాలో అసభ్య విమర్శలు చేశారని మండిపడ్డారు. ఇలాంటి వారే హిట్లర్ మనస్తత్వం కలవారని ఎద్దేవా చేశారు. ఇందిరపై దాడి రాజకీయ కుట్రలో భాగమేనని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మోదీ నేతృత్వంలో దేశ సార్వభౌమత్వంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ఇందిర ఇమేజ్‌ను బీజేపీ నేతలు ఏమీ చేయలేరన్నారు.
రెండు చోట్లా మా ప్రభుత్వాలే
దేశంలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశముందని జైపాల్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ సొంత ప్రభుత్వం ఏర్పాటవుతాయని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులందరికీ అందడం లేదన్నారు. తన డ్రైవర్ కుమార్తె పెళ్లి జరిగి మూడేళ్లవుతున్నా ఇంతవరకు కల్యాణలక్ష్మి డబ్బులు రాలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment