సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజే ఆ వార్త నిజమైంది. ఇప్పటికే టీఆర్‌ఎస్ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీలు ఎం.ఎస్. ప్రభాకర్, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి.. నిన్న టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసిన ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్ కాంగ్రెస్ మండలి పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు శుక్రవారం లేఖ సమర్పించారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
దీంతో తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఉన్న 7 మంది ఎమ్మెల్సీల సంఖ్య రెండుకు చేరింది. మిగిలిన ఇద్దరు సభ్యులు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిల పదవీకాలం మార్చిలో ముగియనుంది. దీంతో మండలిలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం శూన్యమవనుంది. ఇదిలాఉండగా..విలీన పరిణామాలతో షాక్ తిన్న కాంగ్రెస్ హైకమాండ్ స్పందించింది. తమ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను హుటాహుటిన మండలికి పంపింది. మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్‌ని కలిసిన షబ్బీర్, పొంగులేటి విలీన ప్రక్రియపై అభ్యంతరాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment