సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌ల జాబితాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం ఖరారు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను చీఫ్‌విప్‌గా నియమించారు. గత ప్రభుత్వంలో విప్‌లుగా పనిచేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను మరోమారు విప్‌లుగా కొనసాగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీరితోపాటు అచ్చంపేట, శేరిలింగంపల్లి, చెన్నూరు, పినపాక ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, బాల్క సుమన్, రేగ కాంతారావులను విప్‌లుగా నియమించారు. వినయ భాస్కర్, గాంధీ మంత్రి పదవులు ఆశిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, తాజా నియామకాలతో వారికి మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం కనిపించడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలుపొందిన కాంతారావు ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. చీఫ్ విప్, విప్‌ల నియామకాల్లో సామాజికవర్గాల సమతుల్యత, ఉద్యమ నేపథ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.
సభాకమిటీలు కూడా ఖరారు..
శాసనసభ, మండలి సభ్యులతో కూడిన సభాకమిటీల ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కమిటీ చైర్మన్లుగా, మరికొందరు ఎమ్మెల్యేలు కమిటీ సభ్యులుగా నియమితులయ్యే అవకాశముంది. ఈ మేరకు ఏయే కమిటీకి ఎవరు చైర్మన్, సభ్యులుగా ఉండాలో కూడా సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ నెల 9న శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఫైనాన్స్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, సంఖ్యాబలం పరంగా కమిటీలన్నింటిలోనూ టీఆర్‌ఎస్ సభ్యులే ఏకపక్షంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
మండలి చీఫ్‌విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు
శాసనమండలి చీఫ్‌విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌లుగా కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, టి.భానుప్రసాదరావు, కర్నె ప్రభాకర్‌లను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పేర్లను శనివారం సాయంత్రం ఖరారు చేశారు.
చీఫ్ విప్‌గా దాస్యం వినయభాస్కర్
Published Sun, Sep 8 2019 3:01 AM | Last Updated on Sun, Sep 8 2019 3:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment