Vinaya Bhaskar
-
చీఫ్ విప్‌గా దాస్యం వినయభాస్కర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ల జాబితాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం ఖరారు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను చీఫ్‌విప్‌గా నియమించారు. గత ప్రభుత్వంలో విప్‌లుగా పనిచేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను మరోమారు విప్‌లుగా కొనసాగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీరితోపాటు అచ్చంపేట, శేరిలింగంపల్లి, చెన్నూరు, పినపాక ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, బాల్క సుమన్, రేగ కాంతారావులను విప్‌లుగా నియమించారు. వినయ భాస్కర్, గాంధీ మంత్రి పదవులు ఆశిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, తాజా నియామకాలతో వారికి మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం కనిపించడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలుపొందిన కాంతారావు ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. చీఫ్ విప్, విప్ల నియామకాల్లో సామాజికవర్గాల సమతుల్యత, ఉద్యమ నేపథ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. సభాకమిటీలు కూడా ఖరారు.. శాసనసభ, మండలి సభ్యులతో కూడిన సభాకమిటీల ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కమిటీ చైర్మన్లుగా, మరికొందరు ఎమ్మెల్యేలు కమిటీ సభ్యులుగా నియమితులయ్యే అవకాశముంది. ఈ మేరకు ఏయే కమిటీకి ఎవరు చైర్మన్, సభ్యులుగా ఉండాలో కూడా సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ నెల 9న శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఫైనాన్స్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, సంఖ్యాబలం పరంగా కమిటీలన్నింటిలోనూ టీఆర్ఎస్ సభ్యులే ఏకపక్షంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మండలి చీఫ్‌విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు శాసనమండలి చీఫ్‌విప్‌గా బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్‌లుగా కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, టి.భానుప్రసాదరావు, కర్నె ప్రభాకర్‌లను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పేర్లను శనివారం సాయంత్రం ఖరారు చేశారు. -
బిజినెస్మెన్ కావాలనుకున్నా..
కసితో రాజకీయూల్లోకి వచ్చా మా కుటుంబంలో వరుస విషాదాలు అన్నయ్య మరణం తర్వాత ఎదురైన ఘటన కలచివేసింది రాజకీయంగా నాపై కుట్రలు చేశారు రెండుసార్లు ఓడిపోరుునా నిరాశ చెందలేదు కేసీఆర్ నన్ను ఎంతో ఆదరించారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ సాక్షిప్రతినిధి, వరంగల్: మాది హన్మకొండ వడ్డేపల్లి. మా ముత్తాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. నాన్న దాస్యం రంగయ్య విద్యుత్ శాఖలో ఉద్యోగి. అమ్మ శిలోత్రిదేవీ. నా భార్య రేవతి. నాకు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు. పెద్దన్నయ్య ఉదయభాస్కర్ ఇంజినీర్. రెండో అన్నయ్య ప్రణయ భాస్కర్, తమ్ముడు విజయభాస్కర్. నాన్న సిస్టమేటిక్. అన్ని పద్ధతిగా ఉండాలనే వారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉండే కాకతీయ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నా. హైదరాబాద్ సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశా. అనంతరం నృపతుంగా కాలేజీ లో డిగ్రీలో చేరాను. కానీ, పూర్తి చేయలేదు. అప్పు డు హైదరాబాద్‌లో వ్యాపారం మొదలుపెట్టి.. దానిపైనే శ్రద్ధ పెట్టిన. అదే సమయంలో నాన్నకు యాక్సిడెంట్ కావడంతో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వచ్చాం. మాకు వరంగల్‌లో ఫంక్షన్ హాల్ ఉండేది. జీవితంలో పెద్ద షాక్... అన్నయ్యకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. నిత్యం ప్రజలతో ఉండేవారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే వెళ్లేవారు. మొదటి నుంచీ టీడీపీలోనే ఉన్నారు. 1989లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. యువజన సర్వీసుల శాఖ మంత్రి అయ్యారు. టీడీపీలో జరిగిన పరిణామాలతో అన్నయ్య మంత్రి పదవికి దూరమయ్యారు. ఆ తర్వాత స్తబ్ధుగా ఉన్నారు. అన్నయ్య అప్పుడే అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడబోతుంటే అప్పటి స్పీకర్ సభలో తెలంగాణ పదం వాడవద్దని అన్నారు. ఇప్పటికీ ఈ విషయాన్ని మా పార్టీ అధినేత కేసీఆర్ చెబుతుంటారు. అన్నయ్య క్రియాశీలకంగా ఉన్నప్పుడు.. క్యాన్సర్ రూపంలో దురదృష్టం మా ఇంటికి వచ్చింది. అన్నయ్యను మాకు దూరం చేసింది. అది నా జీవితంలో పెద్ద షాక్. ఆ సంఘటన తలుచుకుంటేనే భయంగా ఉంటుంది. రాజకీయాల ఆలోచన ఉండేది కాదు.. రాజకీయాల్లోకి రావాలని నాకు ఎప్పుడు ఉండేది కాదు. ప్రత్యక్ష రాజకీయాల ఆలోచన అసలే లేదు. అప్పటికి అన్నయ్య ప్రణయభాస్కర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు ఆసరాగా ఉండేవాడిని. ఎప్పటికైనా వినూత్నంగా చిన్న పరిశ్రమ స్థాపించి మంచి బిజినెస్‌మెన్‌గా పేరు సంపాదించాలని కోరిక ఉండేది. స్కూల్ రోజుల నుంచీ ఇదే కోరిక. 1990లోనే మా స్నేహితుడు రవీందర్‌రెడ్డి నేను కలిసి ఆర్ఆర్ ప్రొడక్ట్స్ పేరుతో కొన్ని ఉత్పత్తులు మొదలుపెట్టాం. అప్పుడు క్యాప్టెన్కుక్ ఉప్పు వచ్చింది. దాన్ని చూసి అయోడిన్ ఉప్పును ప్యాకెట్లుగా చేసి అమ్మే వ్యాపారం చేశాం. అజయ్ బ్రెష్‌లను చూసి టూత్‌బ్రష్‌లను తయారు చేసి అమ్మాం. మరో మిత్రుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పేపర్ ప్లేట్ల్ తయారు చేశాం. ఏదైనా కొత్త పరిశ్రమల స్థాపించి మంచిగా ఎస్టాబ్లిష్ కావాలనే లక్ష్యం నెరవేరలేదు. ప్రజలకు ఉపయోగపడేలా మంచి థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఇప్పటికీ ఉంది. ఆ ప్రయత్నం చేస్తాను. క్వార్టర్ ఖాళీతో కసి... ఎమ్మెల్యేగా ఉన్నప్పడు అన్నయ్యకు క్వార్టర్ కేటాయించారు. అన్నయ్య మృతిచెంది కొద్ది రోజులే అయ్యాయి. ఒకసారి కుటుంబం మొత్తం వరంగల్‌కు వచ్చాం. ఆ సమయం చూసి క్వార్టర్ ఖాళీ చేయించారు. ఇది జరిగిన తీరు నన్ను తీవ్రంగా కలిచివేసింది. మేం లేని సమయం చూసి సమాన్లు మొత్తం బయట వేశారు. వెళ్లి చూసేసరికి క్వార్టరుకు తాళం వేశారు. జిల్లా రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి.. ఇలాగా చేసేది అనుకున్నా.. అప్పుడే కసి మొదలైంది. రాజకీయంగా నిలదొక్కుకోవాలనుకున్నా. ఎప్పటికైనా నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అన్నయ్యతో ఉన్న వాళ్లు చాలా మంది అప్పటికే ఒత్తిడి తెస్తున్నారు. వారి సహకారం ఉంటుందని చెప్పారు. ఎప్పుడైనా ఒకేలా... ప్రజల మధ్య ఉంటే ఆదరణ ఉంటుందనే విషయాన్ని బలంగా నమ్ముతాను. ఎన్నికల సమయంలో ఒకలా.. లేనప్పుడు మరోతీరుగా ఉండలేను. ఎన్నికల ఫలితాలు వచ్చి ఓటమి పాలైన వెంటనే నా వెంట ఉండే వాళ్లతో ‘చాయ్ తాగి వెళ్దాం’ అన్నాను. గెలిచినా అలాగే చెబుతాను. అన్నయ్యతో ఉన్న వాళ్లు చాల మంది ఇప్పుడు నాతో ఉన్నారు. మొదటి నుంచీ మమ్మల్ని నమ్ముకున్నారు. అందుకే నేను ఏ విషయంపై అయినా అందరితో చర్చిస్తా. యువకులు మొదటి నుంచీ వెంట ఉంటున్నారు. కార్మిక సంఘాలు అండగా నిలుస్తున్నారు. ఆటోలకు పన్ను మినహాయింపు విషయాన్ని నేను, గుడిమల్ల రవికుమార్ మా అధినేత కేసీఆర్ దృష్టికి ఒకసారి తీసుకెళ్లాము. ఆయన మరింత ముందుకువెళ్లి ట్రాక్టర్లకు సైతం వర్తింపజేశారు. ఇప్పడు మా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. ఓటమి.. గెలుపు పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో హన్మకొండ స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. స్వతంత్రుడిగా పోటీ చేసి ఓడిపోయా. 2004లోనూ ఇదే జరిగింది. ఇవన్నీ రాజకీయంగా అణగదొక్కాలనే కుట్రతోనే జరిగాయి. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు కాళోజీ నారాయణరావు, జయశంకర్ ఫొటోలతోనే ప్రచారం చేశాను. 1400 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఓటింగ్ యంత్రాలపై అవగాహన అంతగా లేకపోవడం వల్లే ఆ ఎన్నికల్లో ఓడిపోయానని నా అభిప్రాయం. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరాను. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నన్ను ఎంతో ఆదరించారు. 2006లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో 37వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాను. 2007లో హన్మకొండ నియోజకవర్గ ఇంచార్జీగా, టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. మా పార్టీ ముఖ్య నేతలు హరీశ్‌రావు, కేటీఆర్, వినోద్‌కుమార్‌లు నాకు రాజకీయంగా సహకరించారు. 2009లో టీఆర్ఎస్ టికెట్ వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచా. శాసనసభలో తెలంగాణ తల్లి సాక్షిగా ప్రమాణం చేశాను. అసెంబ్లీ నిబంధనల ప్రకారం లేదని చెప్పి మళ్లీ చేయించారు. 2010 ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఇటీవలి ఎన్నికల్లో ఇదే తీరుగా ఆశీర్వదించారు. తెలంగాణ సోయి... తెలంగాణ పెద్దలు కాళోజీ నారాయణరావు, కొత్తపల్లి జయశంకర్ సార్‌తో సన్నిహితంగా ఉండేవాడిని. అన్నయ్య మరణం తర్వాత ఆయన స్నేహితులు ప్రణయ్ మిత్ర మండలి ఏర్పాటు చేశారు. దీనికి కాలోజీ నారాయణరావు ప్రధాన సలహాదారుగా, జయశంకర్‌సార్ సలహాదారుగా ఉండేవారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రణయ్ మిత్ర మండలిలో ఎక్కువగా చర్చలు జరుగుతుండేవి. ఒకసారి జయశంకర్‌సార్ ప్రోగ్రాం ఉంది. సాయంత్రం ఐదు గంటలకు అంటే సార్ ఐదు నిమిషాల ముందే వచ్చారు. అప్పటికి 10 మందే ఉన్నారు. అయినా సార్ మొదలుపెట్టారు. కార్యక్రమం ముగిసే సరికి 100 మందికిపైగా వచ్చారు. తెలంగాణ భావజాల వ్యాప్తి జరగాలని, పది మంది ఉన్నా, 10వేల మంది ఉన్నా చెబుతూనే ఉండాలని జయశంకర్ సారు అన్నారు. 1997 సమయంలో గాదె ఇన్నయ్య, వి.ప్రకాశ్, విజయ్‌కుమార్, లక్ష్మయ్య ఇతరులు తెలంగాణపై నిత్యం చర్చా కార్యక్రమాలు నిర్వహించేవారు. తెలంగాణ సమస్యలు తొలగిపోవాలనే ఆకాంక్ష అప్పుడే మొదలైంది. వరుస దెబ్బలు... 1997లో అన్నయ్య ప్రణయభాస్కర్ అకాల మరణం నాకు, మా కుటుంబానికి పెద్ద కుదుపు. దీన్ని నుంచి ఎలా తట్టుకోవాలా అనే సమయంలోనే వరుస విషాదాలు ఎదురయ్యూరుు. అన్నయ్య మృతి తట్టుకోలేక నాన్న అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి ఆరు నెలలకు చనిపోయారు. నాన్న మరణంతో అమ్మ అనారోగ్యానికి గురై మృతిచెందారు. ఆమె తర్వాత నానమ్మ... ఇలా ప్రతి ఆరు నెలలు, ఏడాదికొకరు చొప్పున మాకు దూరమయ్యారు. ఆ సమయంలో మానసికంగా కుంగిపోయూను. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటే బయట రాజకీయంగా కుట్రలు.. ఇవన్నీ తట్టుకునేందుకు దైవాన్ని ఆశ్రయించాను. ఏదైనా పని పూర్తి చేసే శక్తి, ఏకాగ్రత రావడానికి నాకు దైవ చింతన మార్గంగా ఉంటుంది. ఇప్పటికీ రోజు గం టపాటు పూజలు చేస్తా. మా ఇంటి దైవం భద్రకాళి అమ్మవారు. ప్రతి శుక్రవారం ఉదయమే అమ్మను దర్శించుకుంటా. ఆగస్టు 15న జాతీయ జెండా అక్కడే ఎగురవేశా. రోజూ ఉదయం 5.30 కు యోగా, మెడిటేషన్ చేస్తా. రాజకీయ సమస్యల నుంచి బయటపడేందుకు ఇవి దోహదపడుతాయి. రాజకీయంగా కుట్ర చేశారు రాజకీయూల్లోకి వచ్చి టీడీపీలోనే కొనసాగా. నా శైలిలో పని చేసుకుంటూ పోయా. అన్నయ్య చనిపోయాక వచ్చిన ఉప ఎన్నికల్లో వదినకు టిక్కెట్ వచ్చింది. అప్పుడు కుట్ర చేసి గెలవకుండా చేశారు. టీడీపీ వేదికలపై తెలంగాణ గురించి నేను ప్రస్తావించడం మా పార్టీలోనే కొందరికి నచ్చలేదు. నాకు రాజకీయంగా అవకాశాలు రాకుండా చేశారు. పార్టీ నుంచి బయటికి వచ్చాక భౌతికంగా ఇబ్బంది పెట్టాలని చూశారు. తెలంగాణ విషయం మాట్లాడుతున్నారనే కారణంతో తరాలపల్లి ఎన్కౌంటర్ సంఘటనను ఆసరా చేసుకుని నాపై కుట్ర చేశారు. మిషనరీ ఆస్పత్రి స్థలం విషయంలో న్యాయం కోసం నిలిచిన నాపై భౌతిక దాడులకు ప్రయత్నించారు. ఈ విషయంలో కేసు పెట్టించా రు. విచారణ తర్వాత పేరు తీసేశారు. -
వీరికి తలుపుల్లేవా...
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కరెంటు బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ ఎన్పీడీసీఎల్ అధికారులు మూడు నెలల క్రితం ఓ కూలీ కుటుంబాన్ని వీధికీడ్చారు. మీటరు కనెక్షన్‌ను తొలగించి విద్యుత్ సరఫరా నిలిపేశారు. అంతటితో ఆగకుండా ఇంటి తలుపును కూడా తీసుకెళ్లారు. తన భార్య ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని... ఇప్పటికప్పుడు రూ.8,000 బకాయి చెల్లించలేనని వ్యవసాయ కూలీ చెక్క శంకర్ మొర పెట్టుకున్నా వారు వినిపించుకోలేదు. ఈ ఏడాది జూన్ 28వ తేదీన మొగుళ్లపల్లిలో జరిగిన ఈ సంఘటన నిరుపేదల్లో భయం పుట్టించింది. ఎన్పీడీసీఎల్ అధికారులు జబర్దస్తీగా వినియోగదారుల ముక్కుపిండి బకాయిల వసూళ్లు చేపట్టిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరుుతే.. ఇదే జిల్లాలో సాక్షాత్తూ కేంద్ర మంత్రి మొదలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం నెల నెలా కరెంటు బిల్లులు చెల్లించని జాబితాలో ఉన్నారు. పార్టీలకతీతంగా వీరిలో కొందరు ప్రముఖులు తమ పేర, తమ కుటుంబీకుల పేరిట లక్షలాది రూపాయలు ఎన్పీడీసీఎల్కు బకాయి పడ్డట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ పేరిట ములుగు ఏరియాలో ఉన్న సర్వీసుపై రూ.1,100 బిల్లు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉంటే.. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఓ మాజీ ప్రజా ప్రతినిధి, ఆయన కుటుంబీకులు అత్యధికంగా రూ.8 లక్షల వరకు బాకీ పడ్డారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వినయభాస్కర్, తాటికొండ రాజయ్య, మాలోతు కవిత, ఎంపీ సుధారాణి భర్త గుండు ప్రభాకర్ పేరిట, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తండ్రి వెంకటయ్య పేరిట బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా మాజీ మంత్రి జగన్నాయక్ రూ.1.83 లక్షలు, మాజీ ఎంపీ అజ్మీరా చందూలాల్ రూ.1.39 లక్షల కరెంటు బిల్లు బకాయి పడ్డారు. ఇటీవలే విద్యుత్తు రెవెన్యూ విభాగం తయారు చేసిన బకాయిల జాబితాలో ఈ వివరాలున్నాయి. అధికార, విపక్షాలకు చెందిన వీఐపీ నేతలు కావడంతో వారి నుంచి బిల్లులు వసూలు చేసేందుకు అధికారులు అడుగు ముందుకేయడం లేదు. నిబంధనల ప్రకారం వినియోగదారులెవరైనా సరే... నెలనెలా తమ కరెంటు బిల్లును గడువులోగా చెల్లించాలి. లేకుంటే విద్యుత్ సిబ్బంది నేరుగా వినియోగదారుడి ఇంటికి వెళ్లి అప్రమత్తం చేయాలి. అదనంగా ఒకటీ రెండు రోజులు గడువు ఇవ్వాలి. అప్పటికీ చెల్లించకపోతే ఫ్యూజులు తొలగించాలి. మరో నాలుగు రోజుల తర్వాత ఆ సర్వీస్‌కు విద్యుత్ సరఫరా నిలిపేయాలి. ఆ బిల్లును బకాయిల జాబితాలో చేర్చాలి. కానీ.. నిరుపేద కూలీలు బకాయి పడితే దౌర్జన్యంగా... వీఐపీలు బిల్లు కట్టకపోతే చూసీ చూడనట్లుగా ఎన్పీడీసీఎల్ వ్యవహరిస్తున్న తీరు రాజు-పేద తేడాకు అద్దం పడుతోంది.