వీరికి తలుపుల్లేవా... | Leaders of the cost of the electricity bill ... Union Minister of backlog | Sakshi
Sakshi News home page

వీరికి తలుపుల్లేవా...

Published Fri, Sep 20 2013 3:13 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

Leaders of the cost of the electricity bill ... Union Minister of backlog

సాక్షి ప్రతినిధి, వరంగల్ :  కరెంటు బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ ఎన్పీడీసీఎల్ అధికారులు మూడు నెలల క్రితం ఓ కూలీ కుటుంబాన్ని వీధికీడ్చారు. మీటరు కనెక్షన్‌ను తొలగించి విద్యుత్ సరఫరా నిలిపేశారు. అంతటితో ఆగకుండా ఇంటి తలుపును కూడా తీసుకెళ్లారు. తన భార్య ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని... ఇప్పటికప్పుడు రూ.8,000 బకాయి చెల్లించలేనని వ్యవసాయ కూలీ చెక్క శంకర్ మొర పెట్టుకున్నా వారు వినిపించుకోలేదు. ఈ ఏడాది జూన్ 28వ తేదీన మొగుళ్లపల్లిలో జరిగిన ఈ సంఘటన నిరుపేదల్లో భయం పుట్టించింది.

ఎన్పీడీసీఎల్ అధికారులు జబర్దస్తీగా వినియోగదారుల ముక్కుపిండి బకాయిల వసూళ్లు చేపట్టిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరుుతే.. ఇదే జిల్లాలో సాక్షాత్తూ కేంద్ర మంత్రి మొదలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం నెల నెలా కరెంటు బిల్లులు చెల్లించని జాబితాలో ఉన్నారు. పార్టీలకతీతంగా వీరిలో కొందరు ప్రముఖులు తమ పేర, తమ కుటుంబీకుల పేరిట లక్షలాది రూపాయలు ఎన్పీడీసీఎల్‌కు బకాయి పడ్డట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ పేరిట ములుగు ఏరియాలో ఉన్న సర్వీసుపై రూ.1,100 బిల్లు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉంటే.. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఓ మాజీ ప్రజా ప్రతినిధి, ఆయన కుటుంబీకులు అత్యధికంగా రూ.8 లక్షల వరకు బాకీ పడ్డారు.

ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వినయభాస్కర్, తాటికొండ రాజయ్య, మాలోతు కవిత, ఎంపీ సుధారాణి భర్త గుండు ప్రభాకర్ పేరిట, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తండ్రి వెంకటయ్య పేరిట బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా మాజీ మంత్రి జగన్‌నాయక్ రూ.1.83 లక్షలు, మాజీ ఎంపీ అజ్మీరా చందూలాల్ రూ.1.39 లక్షల కరెంటు బిల్లు బకాయి పడ్డారు. ఇటీవలే విద్యుత్తు రెవెన్యూ విభాగం తయారు చేసిన బకాయిల జాబితాలో ఈ వివరాలున్నాయి.

అధికార, విపక్షాలకు చెందిన వీఐపీ నేతలు కావడంతో వారి నుంచి బిల్లులు వసూలు చేసేందుకు అధికారులు అడుగు ముందుకేయడం లేదు. నిబంధనల ప్రకారం వినియోగదారులెవరైనా సరే... నెలనెలా తమ కరెంటు బిల్లును గడువులోగా చెల్లించాలి. లేకుంటే విద్యుత్ సిబ్బంది నేరుగా వినియోగదారుడి ఇంటికి వెళ్లి అప్రమత్తం చేయాలి. అదనంగా ఒకటీ రెండు రోజులు గడువు ఇవ్వాలి. అప్పటికీ చెల్లించకపోతే ఫ్యూజులు తొలగించాలి.  


 మరో నాలుగు రోజుల తర్వాత ఆ సర్వీస్‌కు విద్యుత్ సరఫరా నిలిపేయాలి. ఆ బిల్లును బకాయిల జాబితాలో చేర్చాలి. కానీ.. నిరుపేద కూలీలు బకాయి పడితే దౌర్జన్యంగా... వీఐపీలు బిల్లు కట్టకపోతే చూసీ చూడనట్లుగా ఎన్పీడీసీఎల్ వ్యవహరిస్తున్న తీరు రాజు-పేద తేడాకు అద్దం పడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement