balarannayak
-
విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్
కాంగ్రెస్‌కు నష్టం జరిగినా సోనియా తెలంగాణ ఇచ్చారు స్వార్థం లేకుండా పనిచేసింది జేఏసీ ఒక్కటే.. కేంద్ర మంత్రి బలరాంనాయక్ కాంగ్రెస్‌లో చేరిన మానుకోట జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ మహబూబాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణలో విశ్వాసం లేని వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనని కేంద్రమంత్రి బలరాంనాయక్ తీవ్రంగా విమర్శించారు. మహబూబాబాద్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ, నాయకులు పిల్లి సుధాకర్, కళాకారుల జేఏసీ కన్వీనర్ కంబాలపల్లి సత్యనారాయణ, కుల సంఘాల జేఏసీ కన్వీనర్ గుంజె హన్మంతు, వడు ప్సా నాయకుడు గుండోజు దేవేందర్, బుర్ర గోవర్ధన్, నలమాససాయి, బత్తులకృష్ణ, బిక్షపతి, వాహెద్, సోహె ల్, ఖాజా, గాంధీ వెంకన్నతోపాటు పలువురు జేఏసీ, టీఆర్ఎస్ నాయకులు ఆదివారం మాజీ మంత్రి రెడ్యానాయక్, ఎమ్మెల్యే మాలోతు కవిత సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మానుకోటలోని వీఆర్ఎన్ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బలరాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఏ స్వార్థం లేకుండా ఉద్యమించింది జేఏసీ ఒక్కటేనని కొనియాడారు. అయితే, కేసీఆర్ మాత్రం ఆది నుంచి స్వార్థంతో వ్యవహరించారని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. వారిది కుటుంబ పునర్నిర్మాణం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం పదవిపై ప్రేమ ఉండడం వల్లే ముందు చెప్పినట్లు కాంగ్రెస్‌లో విలీనం కావడం లేదని మాజీ మంత్రి రెడ్యానాయక్ అన్నారు. కేసీఆర్ పునర్నిర్మాణం కోసం కాకుండా కుటుంబ పునర్నిర్మాణం కోసం కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంతో ధైర్యంగా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వకుంటే మరో వందేళ్లయినా రాష్ర్టం ఏర్పడేది కాదన్నారు. కాంగ్రెస్‌లో చేరిన డోలి సత్యనారాయణకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. ఆ వెంట నే మానుకోటను జిల్లాకు ఏర్పాటుచేస్తామని రెడ్యా తెలి పారు. ఎమ్మెల్యే మాలోతు కవిత మాట్లాడుతూ సోని యాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇవ్వ డం వల్లే జేఏసీ బాధ్యులు కాంగ్రెస్‌లో చేరారని, వారికి రుణపడి ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన డోలి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవడానికే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు మనస్తాపం కలిగించామని, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి టీఆర్ఎస్ లో చేరి పార్టీ టిక్కెట్ తెచ్చుకున్నారని, ఇప్పుడు ఆమె తెలంగాణ కోసం ఉద్యమించినట్లుగా భావించాలా అని ప్రశ్నించారు. అలా గే, మానుకోటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు ఇటీవలి ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని, ఇందులో కోట్లాది రూపాయ లు చేతులు మారాయని ఆరోపించారు. తొలుత జేఏసీ నాయకులు ర్యాలీగా వీఆర్ఎన్ గార్డెన్సకు చేరుకోగా.. సమావేశంలో అమరవీరుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్‌రెడ్డి, పర్కాల శ్రీనివాసరెడ్డి, దేవరం ప్రకాష్‌రెడ్డి, కాటా భాస్కర్, మల్గిరెడ్డి సుధ, ముత్యం వెంకన్న, వెన్నం లక్ష్మారెడ్డి, కైరంకొండ యాదగిరి, మూలగుండ్ల వెంకన్న, భూక్య ప్రవీణ్‌నాయక్, బాలు నాయక్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మొక్కు’బడిగా
మేడారంలో ముగ్గురు మంత్రుల పర్యటన పనుల సమయంలో కానరాని అమాత్యులు చివరి నిమిషంలో హడావుడి సాక్షి, హన్మకొండ: సార్ పస్రా నుంచి తాడ్వాయి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా చేపడుతున్న సైడ్‌బర్మ్ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. పక్కనున్న మట్టిని తోడి పోస్తున్నారు. దుమ్ము లేస్తోంది అని ఓ పోలీస్ అధికారి ఫిర్యాదు.. సారూ.. మా పొలాల మధ్య నుంచి బీటీరోడ్డు ఏస్తళ్లు. జాతరప్పుడు తప్పితే ఈ రోడ్డు దేనికీ పనికి రాదు. మా పొట్టకొట్టొద్దు.. అంటూ స్థానికుల వేడుకోలు. ఇవీ.. మేడారం జాతరపనులు పరిశీలించేందుకు శుక్రవారం వచ్చిన కేంద్రమంత్రి బలరాంనాయక్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఎదురైన ఘటనలు. అయినా.. అమాత్యులు అవేమీ పట్టించుకోలేదు. క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన మంత్రులు ఒక్క జంపన్నవాగు వంతెన పనులను మాత్రమే పరిశీలించి మిగిలిన వాటిని విస్మరించారు. ఇక సమీక్షా సమావేశాన్ని సైతం గంటన్నరలో ముగించేశారు. జాతరకు పది రోజుల వ్యవధి ఉందనగా ఎనభైశాతం పూర్తై పనుల్లో ఇప్పుడు కొత్తగా నాణ్యత తేవడం అసాధ్యం. జాతర కారణంగా స్థానికులు, గిరిజనులకు తలెత్తే ఇబ్బందులకు సంబంధించి మంత్రులు వారికి ఎలాం టి భరోసా ఇవ్వలేదు. దీంతో శుక్రవారం సాగిన మంత్రుల పర్యటన మొక్కులు చెల్లించే మొక్కుబడి పర్యటనగానే మిగిలింది. వచ్చామా.. చూశామా ... ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరంగా పేరుపొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ఈసారి 2014 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.94 కోట్ల వ్యయంతో 19 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. డిసెం బరు మొదటివారం నుంచే ఒక్కొక్కటిగా పనులు ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ పనుల పూర్తి చేయడానికి మొద ట డిసెంబరు 31ని గడువుగా నిర్ణయించిన అధికార యంత్రాం గం చివరికి జనవరి 31కి మార్చింది. ఈ రెండు నెలల కాలంలో స్థానిక కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ర్ట మంత్రులు బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు రాజయ్య, సుధారాణి, ములు గు ఎమ్మె ల్యే సీతక్క డిసెంబర్ 28న మేడారం పనులను పరిశీలించారు. కాగా మన జిల్లాకే చెందిన మరో రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇటువైపు కన్నెత్తి చూడలేదు. తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పనులకు డెడ్‌లైన్ పూర్తయిన తర్వాత జనవరి 31 శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు, కేంద్రమంత్రి బలరాంనాయక్‌తో కలిసి మేడారం వచ్చారు. అయితే కేంద్ర మంత్రి బలరాంనాయక్‌కు జాతర అభివృద్ధి పనుల కంటే పార్టీ పనులే ఎక్కువైనట్టు కనిపించింది. సమీక్షా సమావేశంలో కన్పించి ఆ వెంటనే బయటకు వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి ఈయన మంగపేట మండలంలోని ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి.. అక్కడినుంచి వరంగల్‌కు వెళ్లినట్లు పార్టీ కార్యకర్తల ద్వారా తెలిసింది. డెడ్‌లైన్‌కు ముందు రోజుల్లో పర్యటించి పనుల్లో నాణ్యత, వేగాన్ని పెంచాల్సిన అమాత్యులు.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు పర్యటించేనాటికి అన్ని ప్రధాన విభాగాల్లో పనులు ఎనభైశాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు మధ్యలో ఉన్నాయి. ఈ దశలో మంత్రులు ఇచ్చే సూచనలు అమల్లోకి తేవడం ఏమేరకు సాధ్యమో వారికే తెలియాలని ఆదివాసీలు అంటున్నారు. రూ.94 కోట్ల విలువైన పనులపై గంటన్నరలో సమీక్ష నిర్దేశించిన గడువునాటికి ప్రధాన విభాగాల ఆధ్వర్యంలో పనులు ఎనభైశాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ దశలో మంత్రులు జనవరి 31న మేడారంలో పర్యటించారు. మధ్యహ్నం 1:30 గంటలకు జంపన్నవాగు వద్దకు చేరుకుని కొత్త వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. 2:40 గంటలకు సమ్మక్క-సారలమ్మ గ ద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు సమీక్షా సమావేశం ప్రారంభించి సాయంత్రం 4:30 గంటలకు ముగించారు. కోటి మంది భక్తుల అవసరాలు తీర్చేందుకు రూ.94 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమీక్షను కేవలం గంటన్నర వ్యవధిలో ముగించారు. సమీక్షలో చర్చకురాని కీలక అంశాలు సమ్మక్క-సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన జాతర. గత జాతర సందర్భంగా నియమించిన పాలకమండలి కాలపరిమితి 2014 జనవరి 8 నాటికి ముగిసింది. కొత్తపాలక మండలి ఏర్పాటు చేసేందుకు సమయం సరిపోకపోతే కనీసం తాత్కాలిక కమిటీ ఏర్పాటు విషయాన్ని సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖమంత్రితో పాటు కేంద్రమంత్రి బలరాం నాయక్ సైతం విస్మరించారు. మాటమాత్రంగానైనా ఈ అంశానికి సమీక్షలో చోటు కల్పించలేదు. ఆఖరికి ఊరట్టం నుంచి జంపన్నవాగు రోడ్డు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు వల్ల తమ భూములు కోల్పోతున్నాము.. తమకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్న బాధితులకు స్పష్టమైన హామీ లభించలేదు. రూ.10 కోట్లతో నిర్మిస్తున్న స్నానఘట్టాలు, కోటి రూపాయలతో నిర్మిస్తున చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్ వంటి కీలక పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లలేదు. జాతర పనుల పర్యవేక్షణ విషయంలో తమకేమీ పట్టనట్లు వ్యవహరించిన జిల్లా మంత్రులు సమీక్షా సమావేశంలో చివరల్లో.. వచ్చేసారి జరిగే జాతరకు సంబంధించినపనుల ప్రతిపాదనలు 2014 మార్చి 31 నాటికి ప్రభుత్వానికి పంపించాలంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం కొసమెరుపు. -
చిన్న రాష్ట్రాలతోనే సమగ్రాభివృద్ధి
హన్మకొండ సిటి, న్యూస్‌లైన్ : చిన్న రాష్ట్రాల ద్వారానే సమగ్రాభివృద్ధి సాధ్యమని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్ అన్నారు. ఆదివారం హన్మకొండలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బంజార బంధుమిత్ర సంక్షేమ సంఘం రూపొందించిన నూతన సంవత్స ర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడారు. తెలంగాణ వచ్చి తీరుతుంది.. 17 శాతం ఉన్న గిరిజన జనభా ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి చెందడంతోపాటు చైతన్య వంతులవుతున్నార ని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఇతర కులాలను చేర్చవచ్చు.. కానీ తొలగించడం కుదరదని చెప్పా రు. ఓబీసీలో చేర్చడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయం సరిపోతుందని, ఎస్సీ, ఎస్టీ జాబితాలో కలపడానికి పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంటుందన్నా రు. ఓబీసీలో ఇటీవల లక్కమారి కాపుతో సహా 107 కులాలను చేర్చామని వివరించారు. 1977లో ఇంది రాగాంధీ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారని, అప్పటి నుంచి రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకుం టూ అభివృద్ధి సాధిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. బంజారాలు ఒక శక్తిగా ఉండాలని సూచించారు. మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి మాట్లాడుతూ గిరిజనులు ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటి పరిష్కారానికి మంత్రి కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి ఆజ్మీర చందులాల్ మాట్లాడుతూ బంజారాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కేయూ ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో లంబాడా ల్లో 35 తెగలుండగా, జిల్లాలో ఏడు తెగలున్నాయని వివరించారు. ఆరు లక్షల 40వేల మంది జనాభా ఉందని, వీరికి వారి గోత్రాల గురించి సంపూర్ణ అవగాహన లేదన్నారు. ఈ క్రమంలో 2014 క్యాలెండర్‌ను, బంజార జాతికి సంబంధించిన సంపూర్ణ వివరాలు, సంస్కృతి, సాంప్రదాయాలు వివరిస్తూ తయారు చేశామని చెప్పారు. కార్యక్రమంలో బంజార బంధుమిత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోరిక వీరన్న, కార్యదర్శి బానోత్ కిషన్‌నాయక్, ప్రొఫెసర్ వీరన్ననాయక్, ప్రొఫెసర్ సురేష్‌లాల్, ప్రజా సంఘాల నాయకులు జి.సజ్జన్ నాయక్, జవహర్లాల్, రూపులాల్, దేవీలాల్, వీరన్న నాయక్, పి.రవీందర్‌నాయక్, పోరిక ఉదయ్ సింగ్ నాయక్ పాల్గొన్నారు. -
రేపు మేడారంలో మంత్రుల పర్యటన
=రూ. 100 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు =అక్కడే ఏర్పాట్లపై సమీక్ష =జిల్లా కలెక్టర్ కిషన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో రూ.100 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడారంలో పర్యటిస్తారని తెలిపారు. అదేవిధంగా వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తారని వివరించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుంటారని కలెక్టర్ అన్నారు. పస్రా నుంచి తాడ్వాయి వరకు సైడ్‌బర్మ్‌ల పనులు జనవరి 31నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గోవిందరావుపేట మండ లం బుస్సాపురం నుంచిలక్నవరం సరస్సు వరకు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపా రు. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. ఊరట్టం నుంచి మల్యాల రోడ్డును మరమ్మతు చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు పనులను పీఆర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా సైడ్‌బర్మ్‌లు పటిష్టంగా నిర్మించాలని రూరల్ ఎస్సీ లేళ్ల కాళిదాసు సూచించారు. జేసీ పౌసుమిబసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ఏజేసీ సంజీవయ్య, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో సురేంద్రరణ్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డ్వామా పీడీ హైమావతి, ట్రాన్స్‌కో ఎస్ఈ మోహన్‌రావు, ఈఓ రాజేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అన్నంత పని చేశారు
=ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ =ఫలించిన కేంద్ర మంత్రి పైరవీ =తనకు అనుకూలంగా ఉండే అధికారిని రప్పించేందుకు యత్నాలు =మహాజాతర ముందు బదిలీ చేయడంపై విమర్శలు సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరకు గడువు ముంచుకొస్తుంటే... అన్నీ తెలిసిన అధికారి ఉండాలని అందరూ భావిస్తారు. మన జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రం తమకు ‘తెలిసిన’ వారే ఉండాలని పట్టుబడుతున్నారు. జాతర పనులు, కాంట్రాక్టులను అనుచరులకు కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న ఉన్నతాధికారిని పంపించేశారు. ములుగు డివిజన్లో అన్ని అంశాలపై బాగా పట్టున్న ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయనను కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్ఫరాజ్ అహ్మద్‌కు జాయింట్ కలెక్టర్ పోస్టు ఇవ్వడం బాగానే ఉన్నా... జాతర సమయంలో బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాంనాయక్ పట్టుబట్టడం వల్లే ఈ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. మేడారం జాతర పనుల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో చెప్పినట్లు చేసే అధికారిని ఐటీడీఏ పీఓగా నియమించుకునేందుకు సర్ఫరాజ్‌ను ఇక్కడి నుంచి మార్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రికి బాగా నమ్మకస్తుడైన ఓ అధికారికి జాతర సమయంలో ఇక్కడ పోస్టింగ్ ఇప్పించుకునేందుకే ఇప్పుడున్న పీఓను మార్చినట్లు తెలుస్తోంది. సర్ఫరాజ్ అహ్మద్ 2012 ఆగస్టు 7న పీఓగా బాధ్యతలు చేపట్టారు. గిరి జన సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేసే అధికారులు సమయపాలన పాటిం చేలా చేశారు. నిధుల ఖర్చు విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేశారు. అన్నింటికంటే ముఖ్యంగా గోదావరి నదిలో ఇసుక తవ్వకాలపై కఠినంగా వ్యవహరించారు. ఇది రాజ కీయ నేతలకు మింగుడుపడలేదు. జిల్లాలోని మంత్రులు ఒత్తిడి తెచ్చినా... అహ్మద్ నిబంధనల ప్రకారం వ్యవహరించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఆయన బదిలీ కోసం మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చారు. సర్ఫరాజ్‌ను బదిలీ చేయడంతోపాటు తమకు పూర్తిగా అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేలా కేంద్ర మంత్రి ప్రయత్నాలు చేశారు. జాతర సమయంలో మార్చితే విమర్శలు వస్తాయని తెలి సినా ఉత్తర్వులు జారీ అయ్యేలా పట్టుబట్టారు. గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసి అవినీతి ఆరోపణలతో బదిలీ అయిన అధికారినే పీఓగా తీసుకువచ్చేందుకు మంత్రి ఇదే స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తోంది. జాతర సమయంలో సమర్థులైన అధికారులు ఉన్నా... కొత్త సమస్యలు ఎదురుకావడం సహజం. సర్ఫరాజ్ అహ్మద్ గతంలో ములుగు సబ్ కలెక్టరుగానూ పని చేశారు. ఈ అనుభవం జాతర ఏర్పాట్లు, నిర్వహణలో బాగా ఉపయోగపడేది. ఇవేమీ పట్టని ప్రజాప్రతినిధులు సొంత ప్రయోజనాల కోసం... ఆరోపణలు ఉన్న అధికారులను తీసుకొచ్చేందుకు సర్ఫరాజ్‌ను బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. -
వీరికి తలుపుల్లేవా...
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కరెంటు బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ ఎన్పీడీసీఎల్ అధికారులు మూడు నెలల క్రితం ఓ కూలీ కుటుంబాన్ని వీధికీడ్చారు. మీటరు కనెక్షన్‌ను తొలగించి విద్యుత్ సరఫరా నిలిపేశారు. అంతటితో ఆగకుండా ఇంటి తలుపును కూడా తీసుకెళ్లారు. తన భార్య ఇటీవలే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని... ఇప్పటికప్పుడు రూ.8,000 బకాయి చెల్లించలేనని వ్యవసాయ కూలీ చెక్క శంకర్ మొర పెట్టుకున్నా వారు వినిపించుకోలేదు. ఈ ఏడాది జూన్ 28వ తేదీన మొగుళ్లపల్లిలో జరిగిన ఈ సంఘటన నిరుపేదల్లో భయం పుట్టించింది. ఎన్పీడీసీఎల్ అధికారులు జబర్దస్తీగా వినియోగదారుల ముక్కుపిండి బకాయిల వసూళ్లు చేపట్టిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరుుతే.. ఇదే జిల్లాలో సాక్షాత్తూ కేంద్ర మంత్రి మొదలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం నెల నెలా కరెంటు బిల్లులు చెల్లించని జాబితాలో ఉన్నారు. పార్టీలకతీతంగా వీరిలో కొందరు ప్రముఖులు తమ పేర, తమ కుటుంబీకుల పేరిట లక్షలాది రూపాయలు ఎన్పీడీసీఎల్కు బకాయి పడ్డట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాంనాయక్ పేరిట ములుగు ఏరియాలో ఉన్న సర్వీసుపై రూ.1,100 బిల్లు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉంటే.. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఓ మాజీ ప్రజా ప్రతినిధి, ఆయన కుటుంబీకులు అత్యధికంగా రూ.8 లక్షల వరకు బాకీ పడ్డారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వినయభాస్కర్, తాటికొండ రాజయ్య, మాలోతు కవిత, ఎంపీ సుధారాణి భర్త గుండు ప్రభాకర్ పేరిట, ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తండ్రి వెంకటయ్య పేరిట బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా మాజీ మంత్రి జగన్నాయక్ రూ.1.83 లక్షలు, మాజీ ఎంపీ అజ్మీరా చందూలాల్ రూ.1.39 లక్షల కరెంటు బిల్లు బకాయి పడ్డారు. ఇటీవలే విద్యుత్తు రెవెన్యూ విభాగం తయారు చేసిన బకాయిల జాబితాలో ఈ వివరాలున్నాయి. అధికార, విపక్షాలకు చెందిన వీఐపీ నేతలు కావడంతో వారి నుంచి బిల్లులు వసూలు చేసేందుకు అధికారులు అడుగు ముందుకేయడం లేదు. నిబంధనల ప్రకారం వినియోగదారులెవరైనా సరే... నెలనెలా తమ కరెంటు బిల్లును గడువులోగా చెల్లించాలి. లేకుంటే విద్యుత్ సిబ్బంది నేరుగా వినియోగదారుడి ఇంటికి వెళ్లి అప్రమత్తం చేయాలి. అదనంగా ఒకటీ రెండు రోజులు గడువు ఇవ్వాలి. అప్పటికీ చెల్లించకపోతే ఫ్యూజులు తొలగించాలి. మరో నాలుగు రోజుల తర్వాత ఆ సర్వీస్‌కు విద్యుత్ సరఫరా నిలిపేయాలి. ఆ బిల్లును బకాయిల జాబితాలో చేర్చాలి. కానీ.. నిరుపేద కూలీలు బకాయి పడితే దౌర్జన్యంగా... వీఐపీలు బిల్లు కట్టకపోతే చూసీ చూడనట్లుగా ఎన్పీడీసీఎల్ వ్యవహరిస్తున్న తీరు రాజు-పేద తేడాకు అద్దం పడుతోంది.