అన్నంత పని చేశారు
=ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ
=ఫలించిన కేంద్ర మంత్రి పైరవీ
=తనకు అనుకూలంగా ఉండే అధికారిని రప్పించేందుకు యత్నాలు
=మహాజాతర ముందు బదిలీ చేయడంపై విమర్శలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరకు గడువు ముంచుకొస్తుంటే... అన్నీ తెలిసిన అధికారి ఉండాలని అందరూ భావిస్తారు. మన జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రం తమకు ‘తెలిసిన’ వారే ఉండాలని పట్టుబడుతున్నారు. జాతర పనులు, కాంట్రాక్టులను అనుచరులకు కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న ఉన్నతాధికారిని పంపించేశారు. ములుగు డివిజన్‌లో అన్ని అంశాలపై బాగా పట్టున్న ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు.
ఆయనను కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్ఫరాజ్ అహ్మద్‌కు జాయింట్ కలెక్టర్ పోస్టు ఇవ్వడం బాగానే ఉన్నా... జాతర సమయంలో బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాంనాయక్ పట్టుబట్టడం వల్లే ఈ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. మేడారం జాతర పనుల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో చెప్పినట్లు చేసే అధికారిని ఐటీడీఏ పీఓగా నియమించుకునేందుకు సర్ఫరాజ్‌ను ఇక్కడి నుంచి మార్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కేంద్ర మంత్రికి బాగా నమ్మకస్తుడైన ఓ అధికారికి జాతర సమయంలో ఇక్కడ పోస్టింగ్ ఇప్పించుకునేందుకే ఇప్పుడున్న పీఓను మార్చినట్లు తెలుస్తోంది. సర్ఫరాజ్ అహ్మద్ 2012 ఆగస్టు 7న పీఓగా బాధ్యతలు చేపట్టారు. గిరి జన సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేసే అధికారులు సమయపాలన పాటిం చేలా చేశారు. నిధుల ఖర్చు విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేశారు. అన్నింటికంటే ముఖ్యంగా గోదావరి నదిలో ఇసుక తవ్వకాలపై కఠినంగా వ్యవహరించారు. ఇది రాజ కీయ నేతలకు మింగుడుపడలేదు.
జిల్లాలోని మంత్రులు ఒత్తిడి తెచ్చినా... అహ్మద్ నిబంధనల ప్రకారం వ్యవహరించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఆయన బదిలీ కోసం మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చారు. సర్ఫరాజ్‌ను బదిలీ చేయడంతోపాటు తమకు పూర్తిగా అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేలా కేంద్ర మంత్రి ప్రయత్నాలు చేశారు. జాతర సమయంలో మార్చితే విమర్శలు వస్తాయని తెలి సినా ఉత్తర్వులు జారీ అయ్యేలా పట్టుబట్టారు.
గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసి అవినీతి ఆరోపణలతో బదిలీ అయిన అధికారినే పీఓగా తీసుకువచ్చేందుకు మంత్రి ఇదే స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తోంది. జాతర సమయంలో సమర్థులైన అధికారులు ఉన్నా... కొత్త సమస్యలు ఎదురుకావడం సహజం. సర్ఫరాజ్ అహ్మద్ గతంలో ములుగు సబ్ కలెక్టరుగానూ పని చేశారు. ఈ అనుభవం జాతర ఏర్పాట్లు, నిర్వహణలో బాగా ఉపయోగపడేది. ఇవేమీ పట్టని ప్రజాప్రతినిధులు సొంత ప్రయోజనాల కోసం... ఆరోపణలు ఉన్న అధికారులను తీసుకొచ్చేందుకు సర్ఫరాజ్‌ను బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది.