medram mahajatara
-
9వేల మందితో బందోబస్తు
జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు ఎక్కువమంది కలిసి ఒకే వాహనం వినియోగిస్తే మేలు పాలిథిన్ కవర్ల వాడకంపై నియంత్రణ అవసరం నకిలీల బెడకు పాస్‌లపై హోలోగ్రామ్‌లు రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు వెంకటరంగారావు వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు వెంకటరంగారావు అన్నారు. జాతరకు వచ్చేందుకు ప్రజలు ఎక్కువ వాహనాలు వినియోగించకుండా తెలిసిన వ్యక్తులందరూ కలిసి పెద్ద వాహనంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌ను నివారించవచ్చన్నారు. అలాగే పాలిథిన్ కవర్లను వినియోగించవద్దని, వాటివల్ల పర్యావరణం దెబ్బతింటుందని సూచించారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో చేస్తున్న ఏర్పాట్లపై ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పటిష్ట బందోబస్తు తొమ్మిదివేల మంది పోలీసులతో జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ట్రాఫిక్ జామ్, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జాతర అవసరాలకు సంబంధించి ఓ చెక్‌లిస్ట్ తయారుచేసి సెక్టార్ ఇన్‌చార్జ్‌లకు ఇచ్చాం. వాటి ప్రకారం ఆయా ఇన్‌చార్జ్‌లు నడుచుకుంటారు. ఇలా ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రశ్న ఉండదు. అలాగే జాతరకు సంబంధించి మార్గదర్శకాలను పై అధికారులకు అందజేశాం. వాటి ఆధారంగా పనులు ముందుకు సాగుతున్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే భక్తులు బంగారం(బెల్లం) వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. జాతరలో స్పోరియన్ బెల్లం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లబెల్లాన్ని పరీక్షించి తీసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ పాటించాలి. వ్యర్థాలను ఎక్కడికక్కడ పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పాలిథిన్ కవర్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. వాటిని వాడి పడేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. భూమిలో కలిసిపోవు సరికదా.. పర్యావరణానికి తీవ్ర విఘాతం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం సూచించిన నాణ్యత గల క్యారీ బ్యాగులనే ఉపయోగించాలి. వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యం భక్తులు వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలి. అమ్మవారు గద్దెకు చేరుకునే సమయంలో జనాలు పెద్దమొత్తంలో ఉండడంతో తోపులాట జరిగే అవకాశం ఉంది. దీనికితోడు గద్దెలపై బంగారం(బెల్లం) ఉంటుంది కాబట్టి జారిపడే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. వీఐపీ పాస్‌లపై కూడా శ్రద్ధ చూపిస్తున్నాం. పాస్‌లకు హోలోగ్రామ్ ముద్రించడం వల్ల నకిలీల బెడద ఉండదు. అప్పుడు చాలా తక్కువ 1998లో నేను ములుగు డీఎస్పీగా ఉన్నప్పుడు జాతరకు వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉండేది. దీంతో భక్తుల కంటే అప్పటి పరిస్థితులను బట్టి మావోయిస్టులపైనే ఎక్కువగా నిఘాపెట్టేవాళ్లం. అప్పట్లో మావోయిస్టులు జాతరలో పోస్టర్లు అతికించేవారు. అటువంటివి జరగకుండా నిత్యం కూంబింగ్ నిర్వహించేవాళ్లం. అభివృద్ధికి సంకేతమే డీజీపీ పర్యటన వరంగల్ ఏజెన్సీలో డీజీపీ పర్యటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఏటూరునాగారం ఏజెన్సీకి డీజీపీ రోడ్డు మార్గంలో రావడం వెన క ఓ మంచి ఉద్దేశం ఉంది. ఆ స్థాయి వ్యక్తి సాధారణ పౌరుడిలా ఏజెన్సీ అంతా తిరిగితే నక్సలిజం అనేది లేదనే సంకేతాలు పారిశ్రామిక వేత్తలకు అందుతాయి. దీంతో ఆ ప్రాం తాభివృద్ధికి వారు సహకరిస్తారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. ఏజెన్సీ ఏరియాలు కూడా అభివృద్ధి చెం దుతున్నాయనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే డీజీపీ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం. -
కట్టబెట్టేదిఎవరికో...
=రూ .72 లక్షల విలువైన పనుల టెండర్లు రద్దు =చక్రం తిప్పిన ఐటీడీఏ ఇంజినీర్లు =కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించేలా ఎత్తుగడ =డిపార్ట్మెంట్ పేరిట అనుంగు కాంట్రాక్టర్‌కు అప్పగించే యత్నం మేడారం మహా జాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ... అధికారులు తమ తమ ఆలోచనలకు పదునుపెట్టారు. వనదేవతల సందర్శనార్థం వచ్చే కోట్లాది మంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకని అనుకుంటే మాత్రం పొరపాటే. తమ దగ్గరివారికి పనులు కట్టబెట్టి.. జేబులు నింపుకునేందుకు వారు కొత్త ఎత్తులు వేశారు. ఇన్‌ఫిల్టరేషన్ పనుల్లో ఏకంగా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి... టెండర్ల పద్ధతికి స్వస్తి పలికించి... దోపిడీకి దారి సుగమం చేసుకున్నారు. సాక్షి, హన్మకొండ: గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యులర్ ఎస్ఈ లేకపోవడంతో... ఐటీడీఏ ఇంజినీర్ల హవా నడుస్తోంది. పలువురు అధికారులు చక్రం తిప్పి.. డిపార్ట్మెంట్ పేరిట తమ అనుంగు కాంట్రాక్టర్‌కు ఇన్‌ఫిల్టరేషన్ పనులు అప్పగించేందుకు తెగబడ్డారు. వాటాల కోసం సర్కారు ఖజానాకు ఎసరు తెచ్చారు. టెండర్ల దాఖలు చివరి రోజున రద్దు చేసినట్లు ప్రకటించి తమ చాణక్యతను చాటుకున్నారు. మహా జాతర సందర్భంగా రెడ్డిగూడెం, చిలుకలగుట్ట వద్ద ఇన్‌ఫిల్టరేషన్ వెల్, పైపులైన్ నిర్మాణాలకు సంబంధించి ఒక్కో పనికి రూ.36 లక్షల వంతున గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన టెండర్లను ఆన్లైన్లో ఆహ్వానించారు. ఈ పనులకు టెండర్లు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2014 జనవరి 2 అని కూడా ప్రకటించారు. ఈ మేరకు పనులు దక్కించుకునేందుకు చాలా మంది కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. కానీ... దాఖలు చివరి రోజు గురువారం చివరి నిమిషంలో ఈ టెండర్లు రద్దయినట్లు ఆన్లైన్లో ఉత్తర్వులు రావడంతో కాంట్రాక్టర్లు షాక్ తిన్నారు. వాస్తవానికి ఈ టెండర్లు రద్దు చేస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 27వ తేదీనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ అధికారులు వెంటనే ధ్రువీకరించకుండా... టెండర్ దాఖలుకు చివరి రోజున వెల్లడించడాన్ని బట్టి వారి పన్నాగం ఏంటో ఇట్టే గ్రహించవచ్చు. తెరవెనుక ఒప్పందం తమకు అనుకూలంగా ఉండే ఓ కాంట్రాక్టర్‌తో ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ముందస్తుగా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సదరు కాంట్రాక్టర్‌తో పని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పైపులను సైతం అధికారులే దగ్గరుండి తెప్పించారు. అంతా తమ కనుసన్నల్లోనే జరుగుతోందని వారు అనుకుంటుండగా... హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ చీఫ్ ఇంజినీర్ పర్యవేక్షణలో గత ఏడాది డిసెంబర్ 26న ఈ పనులకు ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించారు. దీంతో ఏటూరునాగారం ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులకు దిక్కుతోచకుండా పోయింది. వెంటనే రంగంలోకి దిగి చ క్రం తిప్పారు. ఇప్పటికే ఐటీడీఏ నుంచి ఆలస్యంగా నిధులు విడుదలయ్యాయి.... ఇప్పుడు టెండర్లు అంటే మరింత ఆలస్యమవుతుంది.... దాని వల్ల జాతరకు ముందుగా పనులు పూర్తి కావనే ఉద్దేశంతో ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖ తరఫున పనులు ప్రారంభించామంటూ కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో టెండర్లు పిలిచిన మరుసటి రోజే కలెక్టర్ కిషన్ వాటిని రద్దు చేశారు. అయితే ఈ విషయాన్ని వెంటనే తెలిపితే తమ బండారం బట్టబయలవుతుందని గ్రహించిన అధికారులు మరో ఎత్తుగడ వేశారు. టెండర్ దాఖలు చేసేందుకు చివరి రోజున వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
మంత్రులను అడ్డుకుంటాం
=జాతర పనుల్లో అధికార యంత్రాంగం ఏకపక్షం =పూజారులు, ఆదివాసీ గిరిజన సంఘాల ఆగ్రహం =తలనీలాల వ్యవహారంపై వివాదం =సమస్యలపై తిరుగుబాటుకు స్థానికులు సిద్ధం =నేడు మేడారంలో అమాత్యుల పర్యటన సాక్షి, హన్మకొండ: మేడారం జాతరలో గిరిజన ఆచార వ్యవహారాలు, ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోకుండా అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పూజారుల సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతర ఏర్పాట్ల కారణంగా తమకు వాటిల్లుతున్న నష్టానికి పరిహారం ఇప్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. తమ హక్కులకు రక్షణ కల్పించకపోతే శనివారం మేడారంలో పర్యటించనున్న మంత్రులను అడ్డుకుంటామని తేల్చిచెప్పాయి. మేడారం పర్యటన పేరుతో ఇక్కడికి వచ్చే మంత్రులు... అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్షల కంటే ముందు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిం చాలని ఆయూ సంఘాల నేతలు అంటున్నారు. ఆ తర్వాతే సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లేందుకు వారిని అనుమతిస్తామన్నారు. ఇప్పటికే తలనీలాల వ్యవహారంపై సమ్మక్క- సారలమ్మ జాతర కార్యనిర్వాహణ అధికారి దూస రాజేశ్వరరావుకు పూజారుల సంఘం ఈ నెల 15న సమ్మె నోటీస్ ఇచ్చింది. జుట్టుపై పీఠముడి మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జాతర సాగుతోంది. గత జాతర సమయంలో 80 లక్షల మంది హాజరవుతారని భావించి రూ.42 లక్షలు చెల్లించి పూజారుల సంఘం తలనీలాల పనులను దక్కించుకుంది. ఈసారి కోటికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.75 లక్షలు చెల్లించేందుకు పూజారుల సంఘం సిద్ధమైంది. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో.. నామినేషన్ పద్ధతిన కాకుండా టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కువ ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే కాంట్రాక్టర్లు రింగైతే ఆదాయం తగ్గి తమకు నష్టం జరుగుతుందన్న అనుమానాలను గిరిజన పూజారులు వ్యక్తం చేస్తున్నారు. 2004, 2006 జాతర సమయాల్లో టెండర్లు పిలిస్తే రూ.10 లక్షలకు మించి పలకలేదు. దీంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెవడం వీరి వాదనకు బలం చేకూరుస్తోంది. పంట నష్ట పరిహారం ఏదీ.. జాతరకు వచ్చే భక్తులకు బస, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం జాతర జరిగే పరిసరాల్లో స్థానిక రైతులు రెండో పంట వేయడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మేడారం, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరు, రెడ్డిగూడెం గ్రామాల పరిధిలో 164 మంది రైతులు 1015 ఎకరాల్లో రెండో పంటను నష్టపోతున్నారు. ఇందులో పట్టా భూములు 740, ప్రభుత్వ భూమి 274 ఎకరాలు ఉంది. దీనికి తోడు స్థానిక పొలాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, బ్యాటరీ ఆఫ్ టాప్స్ నిర్మాణాలు చేపట్టే అధికారులు.. జాతర ముగిసిన తర్వాత వాటిని పీక్కుని వెళ్తున్నారు. ఫలితంగా పొలాల్లో గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక పార్కింగ్ పేరుతో పొలం గట్లను కూల్చేసి మైదానంలా మారుస్తున్నారు. జాతర ముగిసిన తర్వాత ఈ గుంతలను పూడ్చుకోవడం, గట్లు కట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ జాతర సందర్భంలో వీరికి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నా... ఇంత వరకు అమల్లో పెట్టలేదు. దీంతో రెండో పంట నష్టంపై స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్థానికులు కోరుతున్నారు. రైతలకు నష్టం వస్తోంది : అల్లం రామ్మూర్తి, మేడారం జాతర మాజీ చైర్మన్ భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న శానిటేషన్ పనుల వల్ల రైతుల పంట భూములకు నష్టం వస్తుంది. ప్రైవేట్ పార్కింగ్‌ల కోసం పంట భూముల ఒడ్లు తొలగిస్తున్నారు. జాతర తర్వాత వాటిని సరి చేసుకునేందుకు రైతులకు ఖర్చు ఎక్కువవుతోంది. జాతర పేరిట కోట్లాది నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. గిరిజన రైతుల రెండో పంట నష్ట పరిహారం ఎందుకు చెల్లించడం లేదు. స్థానిక సమస్యలపై మంత్రులు హామీ ఇచ్చేంత వరకు పూజా కార్యక్రమాలు అడ్డుకుంటాం. ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు, కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. -
రేపు మేడారంలో మంత్రుల పర్యటన
=రూ. 100 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు =అక్కడే ఏర్పాట్లపై సమీక్ష =జిల్లా కలెక్టర్ కిషన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో రూ.100 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడారంలో పర్యటిస్తారని తెలిపారు. అదేవిధంగా వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తారని వివరించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుంటారని కలెక్టర్ అన్నారు. పస్రా నుంచి తాడ్వాయి వరకు సైడ్‌బర్మ్‌ల పనులు జనవరి 31నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గోవిందరావుపేట మండ లం బుస్సాపురం నుంచిలక్నవరం సరస్సు వరకు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపా రు. ఈ పనులు వేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ అధికారులకు సూచించారు. ఊరట్టం నుంచి మల్యాల రోడ్డును మరమ్మతు చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు చేయాలన్నారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి నుంచి దొడ్ల వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు పనులను పీఆర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా సైడ్‌బర్మ్‌లు పటిష్టంగా నిర్మించాలని రూరల్ ఎస్సీ లేళ్ల కాళిదాసు సూచించారు. జేసీ పౌసుమిబసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ఏజేసీ సంజీవయ్య, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో సురేంద్రరణ్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డ్వామా పీడీ హైమావతి, ట్రాన్స్‌కో ఎస్ఈ మోహన్‌రావు, ఈఓ రాజేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జాతర పనులు ముమ్మరం
మేడారం (తాడ్వాయి), న్యూస్‌లైన్ : మేడారంలో ఫిబ్రవరిలో జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. జాతర పనుల కోసం ప్రభుత్వం రూ.68 లక్షలు కేటాయించింది. గిరిజన సం క్షేమ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు మినహా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో జంపన్నవాగుపై అదనం గా రూ.3కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మైనర్ ఇరిగేషన్ ఆధ్వర్యంలో రూ.9కోట్లతో కొత్తూరు సమీపంలో జంపన్నవాగుపై 300 మీటర్ల వరకు స్నానఘట్టాల నిర్మాణం జరుగుతోంది. భూమి చదును పనులు పూర్తి చేసి మెట్ల కోసం సెంట్రింగ్ చేపట్టారు. జాతరను అధికారులు పర్యవేక్షిం చేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలతో జంపన్నవాగు, ఊరట్టం జంపన్నవాగు, కొత్తూరు కాజ్వే, ఆర్టీసీ బస్టాండ్, గద్దెల ప్రాంతంలో చేపట్టిన మంచెల నిర్మాణం కొనసాగుతోంది. ఆర్అండ్బీ, పీఆర్ ఆధ్వర్యంలో బయ్యక్కపేట, నార్లాపూర్, ఊరట్టం, కన్నెపల్లి, ఎల్బాక, జంపన్నవాగు నుంచి గద్దెల వరకు రోడ్ల విస్తీర్ణం పనులు జరుగుతున్నాయి. ఈనెల 18న మేడారంలో జేసీ పౌసుమిబసు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర అభివృద్ధి పనుల వేగం పెంచాలని, వారంలో ఎంత పనిచేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను అదేశించడం గమనార్హం. హుండీలకు మరమ్మతులు మేడారంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హుండీలకు మరమ్మతులు చేస్తున్నారు. జాతర సమీపిస్తున్నందున భక్తుల రాక పెరుగుతోంది. వారు కానుకలు వేసేందుకు జాతరకు ముందుగానే అమ్మవార్ల గద్దెలపై హుండీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. -
అడవి మాదే..మేడారం మాదే...
=హక్కుల కోసం ఆదివాసీల పోరుబాట =ఆలయూనికి రంగులద్దే పనిని స్థానికేతరులకు అప్పగించడంపై ఆగ్రహం =దేవాదాయ శాఖ కార్యాలయ సామగ్రి ధ్వంసం.. ధర్నా =మేడారంలో వేడెక్కిన వాతావరణం మేడారం (తాడ్వాయి), న్యూస్‌లైన్: మేడారం జాతరపై అడగకుండానే హ క్కులు కల్పించాల్సి ఉన్నప్పటికీ హక్కుల కో సం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఆది వా సీ గిరిజనులకు తలె త్తుతోంది. ప్రతీ రెండేళ్ల కోమారు జరిగే జాతరలో పూజారులకు దక్కే ఆదాయ వనరులను లాక్కొని బడా వ్యాపారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయాలను ముందుకు తీసుకొస్తోంది. ఆఖరికి ఆలయానికి రంగులేసే పనిని సైతం స్థానికేతరులకే కేటాయిస్తూ గిరిజన యువతపై వివక్ష చూపిస్తోంది. దానితో గిరిజన యువతలో ఆగ్రహాం పెల్లుబుకుతోంది. జాతర పనులు పరిశీలించేందుకు దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి మంగళవారం మేడారం వచ్చారు. తమకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, తమ సంస్కృతి పట్ల కొనసాగుతున్న వివక్షను గిరిజనులు జాయింట్ కమిషనర్‌కు ఎకరువు పెట్టారు. రంగు పడింది మేడారం జాతర సందర్భంగా వంద కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను ప్ర భుత్వం చేపడుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెలు, పరిసర ప్రాంతాల్లో రంగులేసే పనికి రూ.16 లక్షలు మంజూరయ్యాయి. పెద్ద పనులను టెండర్ల ప్రక్రియ ద్వారా బడా కాంట్రాక్టర్లకు కేటాయించింది. ఈ పనిని ఒక శాతం ఎక్సెస్‌తో టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు అధికారులు కట్టబెట్టారు. తమ ప్రాంతంలో జరిగే గిరిజన జాతరలో తమ ప్రమేయం లేకుండా ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం పను లు చేపడుతుండ డం పట్ల గిరిజనులు ఆందోళన చెందారు. తమకు కనీస ఉపాధి కూడా చూపించకపోవడంతో వారిలో ఆగ్రహాం వ్యక్తమయింది. దాంతో వారు మంగళవారం దే వాదాయ శాఖ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. స్థానిక ఆదివాసీల పట్ల దేవదాయశాఖ అధికారుల తీరును నిరసిస్తూ యువకులు, పూజారులు గద్దెల ఎదుట ధర్నా కు దిగారు. పనులు పరిశీలించేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి దృష్టికి ఏసీ రాజేశ్వర్‌రావు ఫో న్లో యువకుల ధర్నా విషయాన్ని తెలిపా రు. వెంటనే ఆమె ధర్నా చేస్తున్న యువకుల వద్దకు వెళ్లి వారిసమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలరింగ్ పనులు పొందిన కాంట్రాక్ట ర్ టెండర్‌ను రద్దుచేసి, ఆ పనులను ఆది వా సీ యువకులకే ఇస్తామని హామీ ఇవ్వడంతో యువకులు ధర్నా విరమించుకున్నారు. వివాదాస్పదంగా మారిన తలనీలాలు జారత సందర్భంగా భక్తులు చెల్లించే తలనీ లాలను సేకరించి అమ్ముకునే పనిని ఇప్పటి వరకు నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికే కేటాయిస్తున్నారు. గత ఏడాది 80 లక్షల మంది జాతరకు వస్తారనే అంచనాతో పూజారుల సంఘం రూ 42 లక్షలు దేవాదా య శాఖకు చెల్లించి ఈ పనిని దక్కించుకుంది. ఈ సారి కోటి మంది భక్తులు వస్తారనే అంచానాతో గరిష్టంగా రూ 75 లక్షలు చె ల్లించేందుకు గిరిజన పూజారుల సంఘం సిద్ధమైంది. నామినేషన్ పద్దతిపై కాకుండా టెండర్లను ఆహ్వానించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందనే లక్ష్యంతో దేవాదాయశాఖ ప్రణాళిక రూపొందించడాన్ని పూజారు ల సంఘం వ్యతిరేకిస్తోంది. అయితే టెండర్ల పద్దతిని ప్రవేశపెడితే కాంట్రాక్టర్లంతా రింగైతే తమకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని పూజారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
అన్నంత పని చేశారు
=ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ =ఫలించిన కేంద్ర మంత్రి పైరవీ =తనకు అనుకూలంగా ఉండే అధికారిని రప్పించేందుకు యత్నాలు =మహాజాతర ముందు బదిలీ చేయడంపై విమర్శలు సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం మహాజాతరకు గడువు ముంచుకొస్తుంటే... అన్నీ తెలిసిన అధికారి ఉండాలని అందరూ భావిస్తారు. మన జిల్లా ప్రజాప్రతినిధులు మాత్రం తమకు ‘తెలిసిన’ వారే ఉండాలని పట్టుబడుతున్నారు. జాతర పనులు, కాంట్రాక్టులను అనుచరులకు కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న ఉన్నతాధికారిని పంపించేశారు. ములుగు డివిజన్లో అన్ని అంశాలపై బాగా పట్టున్న ఏటూరునాగారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. ఆయనను కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్ఫరాజ్ అహ్మద్‌కు జాయింట్ కలెక్టర్ పోస్టు ఇవ్వడం బాగానే ఉన్నా... జాతర సమయంలో బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి బలరాంనాయక్ పట్టుబట్టడం వల్లే ఈ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. మేడారం జాతర పనుల కాంట్రాక్టులను అప్పగించే విషయంలో చెప్పినట్లు చేసే అధికారిని ఐటీడీఏ పీఓగా నియమించుకునేందుకు సర్ఫరాజ్‌ను ఇక్కడి నుంచి మార్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రికి బాగా నమ్మకస్తుడైన ఓ అధికారికి జాతర సమయంలో ఇక్కడ పోస్టింగ్ ఇప్పించుకునేందుకే ఇప్పుడున్న పీఓను మార్చినట్లు తెలుస్తోంది. సర్ఫరాజ్ అహ్మద్ 2012 ఆగస్టు 7న పీఓగా బాధ్యతలు చేపట్టారు. గిరి జన సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పని చేసే అధికారులు సమయపాలన పాటిం చేలా చేశారు. నిధుల ఖర్చు విషయంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేశారు. అన్నింటికంటే ముఖ్యంగా గోదావరి నదిలో ఇసుక తవ్వకాలపై కఠినంగా వ్యవహరించారు. ఇది రాజ కీయ నేతలకు మింగుడుపడలేదు. జిల్లాలోని మంత్రులు ఒత్తిడి తెచ్చినా... అహ్మద్ నిబంధనల ప్రకారం వ్యవహరించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఆయన బదిలీ కోసం మంత్రులపై ఒత్తిడి తీసుకొచ్చారు. సర్ఫరాజ్‌ను బదిలీ చేయడంతోపాటు తమకు పూర్తిగా అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేలా కేంద్ర మంత్రి ప్రయత్నాలు చేశారు. జాతర సమయంలో మార్చితే విమర్శలు వస్తాయని తెలి సినా ఉత్తర్వులు జారీ అయ్యేలా పట్టుబట్టారు. గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసి అవినీతి ఆరోపణలతో బదిలీ అయిన అధికారినే పీఓగా తీసుకువచ్చేందుకు మంత్రి ఇదే స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలిస్తోంది. జాతర సమయంలో సమర్థులైన అధికారులు ఉన్నా... కొత్త సమస్యలు ఎదురుకావడం సహజం. సర్ఫరాజ్ అహ్మద్ గతంలో ములుగు సబ్ కలెక్టరుగానూ పని చేశారు. ఈ అనుభవం జాతర ఏర్పాట్లు, నిర్వహణలో బాగా ఉపయోగపడేది. ఇవేమీ పట్టని ప్రజాప్రతినిధులు సొంత ప్రయోజనాల కోసం... ఆరోపణలు ఉన్న అధికారులను తీసుకొచ్చేందుకు సర్ఫరాజ్‌ను బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది.