=జాతర పనుల్లో అధికార యంత్రాంగం ఏకపక్షం
=పూజారులు, ఆదివాసీ గిరిజన సంఘాల ఆగ్రహం
=తలనీలాల వ్యవహారంపై వివాదం
=సమస్యలపై తిరుగుబాటుకు స్థానికులు సిద్ధం
=నేడు మేడారంలో అమాత్యుల పర్యటన
సాక్షి, హన్మకొండ: మేడారం జాతరలో గిరిజన ఆచార వ్యవహారాలు, ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోకుండా అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పూజారుల సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతర ఏర్పాట్ల కారణంగా తమకు వాటిల్లుతున్న నష్టానికి పరిహారం ఇప్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. తమ హక్కులకు రక్షణ కల్పించకపోతే శనివారం మేడారంలో పర్యటించనున్న మంత్రులను అడ్డుకుంటామని తేల్చిచెప్పాయి. మేడారం పర్యటన పేరుతో ఇక్కడికి వచ్చే మంత్రులు... అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్షల కంటే ముందు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిం చాలని ఆయూ సంఘాల నేతలు అంటున్నారు. ఆ తర్వాతే సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లేందుకు వారిని అనుమతిస్తామన్నారు. ఇప్పటికే తలనీలాల వ్యవహారంపై సమ్మక్క- సారలమ్మ జాతర కార్యనిర్వాహణ అధికారి దూస రాజేశ్వరరావుకు పూజారుల సంఘం ఈ నెల 15న సమ్మె నోటీస్ ఇచ్చింది.
జుట్టుపై పీఠముడి
మేడారం జాతర 1967లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేవాదాయశాఖ పర్యవేక్షణలో జాతర సాగుతోంది. గత జాతర సమయంలో 80 లక్షల మంది హాజరవుతారని భావించి రూ.42 లక్షలు చెల్లించి పూజారుల సంఘం తలనీలాల పనులను దక్కించుకుంది. ఈసారి కోటికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.75 లక్షలు చెల్లించేందుకు పూజారుల సంఘం సిద్ధమైంది. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో తలనీలాలకు డిమాండ్ ఉండడంతో.. నామినేషన్ పద్ధతిన కాకుండా టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి ఎక్కువ ఆదాయం వస్తుందని దేవాదాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే కాంట్రాక్టర్లు రింగైతే ఆదాయం తగ్గి తమకు నష్టం జరుగుతుందన్న అనుమానాలను గిరిజన పూజారులు వ్యక్తం చేస్తున్నారు. 2004, 2006 జాతర సమయాల్లో టెండర్లు పిలిస్తే రూ.10 లక్షలకు మించి పలకలేదు. దీంతో 2008 జాతర నుంచి మళ్లీ నామినేషన్ పద్ధతిని అమల్లోకి తెవడం వీరి వాదనకు బలం చేకూరుస్తోంది.
పంట నష్ట పరిహారం ఏదీ..
జాతరకు వచ్చే భక్తులకు బస, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం జాతర జరిగే పరిసరాల్లో స్థానిక రైతులు రెండో పంట వేయడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మేడారం, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరు, రెడ్డిగూడెం గ్రామాల పరిధిలో 164 మంది రైతులు 1015 ఎకరాల్లో రెండో పంటను నష్టపోతున్నారు. ఇందులో పట్టా భూములు 740, ప్రభుత్వ భూమి 274 ఎకరాలు ఉంది. దీనికి తోడు స్థానిక పొలాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, బ్యాటరీ ఆఫ్ టాప్స్ నిర్మాణాలు చేపట్టే అధికారులు.. జాతర ముగిసిన తర్వాత వాటిని పీక్కుని వెళ్తున్నారు. ఫలితంగా పొలాల్లో గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక పార్కింగ్ పేరుతో పొలం గట్లను కూల్చేసి మైదానంలా మారుస్తున్నారు. జాతర ముగిసిన తర్వాత ఈ గుంతలను పూడ్చుకోవడం, గట్లు కట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ జాతర సందర్భంలో వీరికి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నా... ఇంత వరకు అమల్లో పెట్టలేదు. దీంతో రెండో పంట నష్టంపై స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్థానికులు కోరుతున్నారు.
రైతలకు నష్టం వస్తోంది : అల్లం రామ్మూర్తి, మేడారం జాతర మాజీ చైర్మన్
భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న శానిటేషన్ పనుల వల్ల రైతుల పంట భూములకు నష్టం వస్తుంది. ప్రైవేట్ పార్కింగ్‌ల కోసం పంట భూముల ఒడ్లు తొలగిస్తున్నారు. జాతర తర్వాత వాటిని సరి చేసుకునేందుకు రైతులకు ఖర్చు ఎక్కువవుతోంది. జాతర పేరిట కోట్లాది నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. గిరిజన రైతుల రెండో పంట నష్ట పరిహారం ఎందుకు చెల్లించడం లేదు. స్థానిక సమస్యలపై మంత్రులు హామీ ఇచ్చేంత వరకు పూజా కార్యక్రమాలు అడ్డుకుంటాం. ఈ నిరసన కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు, కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
మంత్రులను అడ్డుకుంటాం
Published Sat, Dec 28 2013 2:25 AM | Last Updated on Sat, Apr 6 2019 9:37 PM
Advertisement