‘మొక్కు’బడిగా
- మేడారంలో ముగ్గురు మంత్రుల పర్యటన
- పనుల సమయంలో కానరాని అమాత్యులు
- చివరి నిమిషంలో హడావుడి
సాక్షి, హన్మకొండ: సార్ పస్రా నుంచి తాడ్వాయి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా చేపడుతున్న సైడ్‌బర్మ్ పనులు నాసిరకంగా సాగుతున్నాయి. పక్కనున్న మట్టిని తోడి పోస్తున్నారు. దుమ్ము లేస్తోంది అని ఓ పోలీస్ అధికారి ఫిర్యాదు.. సారూ.. మా పొలాల మధ్య నుంచి బీటీరోడ్డు ఏస్తళ్లు. జాతరప్పుడు తప్పితే ఈ రోడ్డు దేనికీ పనికి రాదు. మా పొట్టకొట్టొద్దు.. అంటూ స్థానికుల వేడుకోలు.
ఇవీ.. మేడారం జాతరపనులు పరిశీలించేందుకు శుక్రవారం వచ్చిన కేంద్రమంత్రి బలరాంనాయక్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు, జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఎదురైన ఘటనలు. అయినా.. అమాత్యులు అవేమీ పట్టించుకోలేదు. క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన మంత్రులు ఒక్క జంపన్నవాగు వంతెన పనులను మాత్రమే పరిశీలించి మిగిలిన వాటిని విస్మరించారు. ఇక సమీక్షా సమావేశాన్ని సైతం గంటన్నరలో ముగించేశారు. జాతరకు పది రోజుల వ్యవధి ఉందనగా ఎనభైశాతం పూర్తై పనుల్లో ఇప్పుడు కొత్తగా నాణ్యత తేవడం అసాధ్యం. జాతర కారణంగా స్థానికులు, గిరిజనులకు తలెత్తే ఇబ్బందులకు సంబంధించి మంత్రులు వారికి ఎలాం టి భరోసా ఇవ్వలేదు. దీంతో శుక్రవారం సాగిన మంత్రుల పర్యటన మొక్కులు చెల్లించే మొక్కుబడి పర్యటనగానే మిగిలింది.
వచ్చామా.. చూశామా ...
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరంగా పేరుపొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ఈసారి 2014 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో రూ.94 కోట్ల వ్యయంతో 19 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. డిసెం బరు మొదటివారం నుంచే ఒక్కొక్కటిగా పనులు ప్రారంభమవుతూ వచ్చాయి.
ఈ పనుల పూర్తి చేయడానికి మొద ట డిసెంబరు 31ని గడువుగా నిర్ణయించిన అధికార యంత్రాం గం చివరికి జనవరి 31కి మార్చింది. ఈ రెండు నెలల కాలంలో స్థానిక కేంద్ర మంత్రి బలరాంనాయక్, రాష్ర్ట మంత్రులు బస్వరాజు సారయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు రాజయ్య, సుధారాణి, ములు గు ఎమ్మె ల్యే సీతక్క డిసెంబర్ 28న మేడారం పనులను పరిశీలించారు. కాగా మన జిల్లాకే చెందిన మరో రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇటువైపు కన్నెత్తి చూడలేదు.
తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పనులకు డెడ్‌లైన్ పూర్తయిన తర్వాత జనవరి 31 శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు, కేంద్రమంత్రి బలరాంనాయక్‌తో కలిసి మేడారం వచ్చారు. అయితే కేంద్ర మంత్రి బలరాంనాయక్‌కు జాతర అభివృద్ధి పనుల కంటే పార్టీ పనులే ఎక్కువైనట్టు కనిపించింది. సమీక్షా సమావేశంలో కన్పించి ఆ వెంటనే బయటకు వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి ఈయన మంగపేట మండలంలోని ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి.. అక్కడినుంచి వరంగల్‌కు వెళ్లినట్లు పార్టీ కార్యకర్తల ద్వారా తెలిసింది.
డెడ్‌లైన్‌కు ముందు రోజుల్లో పర్యటించి పనుల్లో నాణ్యత, వేగాన్ని పెంచాల్సిన అమాత్యులు.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు పర్యటించేనాటికి అన్ని ప్రధాన విభాగాల్లో పనులు ఎనభైశాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు మధ్యలో ఉన్నాయి. ఈ దశలో మంత్రులు ఇచ్చే సూచనలు అమల్లోకి తేవడం ఏమేరకు సాధ్యమో వారికే తెలియాలని ఆదివాసీలు అంటున్నారు.
రూ.94 కోట్ల విలువైన పనులపై గంటన్నరలో సమీక్ష
నిర్దేశించిన గడువునాటికి ప్రధాన విభాగాల ఆధ్వర్యంలో పనులు ఎనభైశాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ దశలో మంత్రులు జనవరి 31న మేడారంలో పర్యటించారు. మధ్యహ్నం 1:30 గంటలకు జంపన్నవాగు వద్దకు చేరుకుని కొత్త వంతెన నిర్మాణ పనులు పరిశీలించారు. 2:40 గంటలకు సమ్మక్క-సారలమ్మ గ ద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు సమీక్షా సమావేశం ప్రారంభించి సాయంత్రం 4:30 గంటలకు ముగించారు. కోటి మంది భక్తుల అవసరాలు తీర్చేందుకు రూ.94 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమీక్షను కేవలం గంటన్నర వ్యవధిలో ముగించారు.
సమీక్షలో చర్చకురాని కీలక అంశాలు
సమ్మక్క-సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన జాతర. గత జాతర సందర్భంగా నియమించిన పాలకమండలి కాలపరిమితి 2014 జనవరి 8 నాటికి ముగిసింది. కొత్తపాలక మండలి ఏర్పాటు చేసేందుకు సమయం సరిపోకపోతే కనీసం తాత్కాలిక కమిటీ ఏర్పాటు విషయాన్ని సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖమంత్రితో పాటు కేంద్రమంత్రి బలరాం నాయక్ సైతం విస్మరించారు. మాటమాత్రంగానైనా ఈ అంశానికి సమీక్షలో చోటు కల్పించలేదు. ఆఖరికి ఊరట్టం నుంచి జంపన్నవాగు రోడ్డు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు వల్ల తమ భూములు కోల్పోతున్నాము.. తమకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్న బాధితులకు స్పష్టమైన హామీ లభించలేదు.
రూ.10 కోట్లతో నిర్మిస్తున్న స్నానఘట్టాలు, కోటి రూపాయలతో నిర్మిస్తున చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్ వంటి కీలక పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లలేదు. జాతర పనుల పర్యవేక్షణ విషయంలో తమకేమీ పట్టనట్లు వ్యవహరించిన జిల్లా మంత్రులు సమీక్షా సమావేశంలో చివరల్లో.. వచ్చేసారి జరిగే జాతరకు సంబంధించినపనుల ప్రతిపాదనలు 2014 మార్చి 31 నాటికి ప్రభుత్వానికి పంపించాలంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం కొసమెరుపు.