జైపాల్‌రెడ్డే గల్లీ లీడర్..
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: బీజేపీని ప్రపంచంలోనే నంబర్ వన్ రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కృషి చేస్తున్నారని, ఆయనను గల్లీ లీడర్ అంటూ కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించడం అర్థరహితమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.
అమిత్‌షాను గల్లీ లీడర్ అంటూ జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. వాస్తవానికి జైపాల్ ఢిల్లీ నుంచి గల్లీకి చేరితే.. అమిత్‌షా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తమ పార్టీకి రెండు కళ్లుగా చెప్పుకునే కాంగ్రెస్ పెద్దలు సర్దార్‌కు ఏనాడూ తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదని విమర్శించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడంలో పటేల్ పాత్ర ఎంతో గొప్పదని, తెలంగాణ విమోచన కోసం సర్దార్ చేపట్టిన పోలీసుచర్యను నెహ్రూనే పలుమార్లు అడ్డుకున్నారన్న చరిత్రను జైపాల్‌రెడ్డి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఏనాడైనా తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు.
కనీసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవితమంతా వ్యక్తులతోనే ముడిపడి ఉందని, సత్యాగ్రహం నాటి కాంగ్రెస్ ఇప్పుడు లేదని, సోనియా, రాహుల్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారబోతోందని అన్నారు. నేడు కశ్మీర్‌లో అశాంతికి నాడు కాంగ్రెస్ అనుసరించిన విధానమే మూలకారణమని, కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు బీజేపీ ముందుకెళుతున్నా కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.