సాక్షి, మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారంతో నేపథ్యంలో ఆయనతో మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ...‘ దామోదర్‌రెడ్డిని కలిసి మాట్లాడాను. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని చెప్పాను. నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్‌కు అండగా ఉన్న వ్యక్తి దామోదర్ రెడ్డి. 2004లో కేవలం 1400 ఓట్లతో ఓడిపోయారు. అప్పుడు పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లినా టీఆర్‌ఎస్ నుండి పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచారు.క్యాడర్ ఆయన వెంట ఉంది.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సమయంలో తన బాధ ఎవరూ వినలేదని దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశం, ఆవేదన, బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి, వ‍్యక్తిగత నిర్ణయం అని చెప్పాను. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మరోసారి ఆయనను కోరాను. డీకే అరుణ చెబితే దామోదర్ రెడ్డి వింటారని నన్ను ఇబ్బంది పెట్టే ప్రక్రియ అది. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎవరు ఇబ్బంది పెట్టినా, నన్ను టార్గెట్ చేసినా... నేను సిన్సియర్ కార్యకర్తను.
కాంగ్రెస్ గెలుపే నా లక్ష్యం. ఎవరు టార్గెట్ చేసినా భయపడి ఇంట్లో కూర్చోను. నా వ్యక్తిగతం కోసం పని చేయడం లేదు. మహబూబ్ నగర్‌లో ఎప్పుడూ వర్గం లేదు. ఇప్పుడే వినిపిస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే పని చేస్తున్నా. నన్ను డీ మోరల్ చేస్తే పార్టీకే నష్టం. నాకేం ఉంటుంది. బలం చేకూరే నాయకులు వస్తే తప్పులేదు. కానీ ఉన్న బలం పోతే లాభం ఏంటి?. నాగం టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చు కానీ కాంగ్రెస్‌లో కాదు. వాళ్లు బలమైన నాయకులు అయితే అక్కడే గెలవాలి కదా??’ అని ప్రశ్నించారు.
కాగా నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకపోవడంతో.. మనస్తాపానికి గురైన తానే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో డీకే అరుణ, జైపాల్‌రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటూ పలు అంశాల్లో విబేధాలు వస్తుండడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి డీకే అరుణ మద్దతుగా నిలవగా, ఇక నాగంకు సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మద్దతుగా నిలిచి పార్టీలోకి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment