MLC damodhar reddy
-
భయపడి ఇంట్లో కూర్చోను: డీకె అరుణ
సాక్షి, మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారంతో నేపథ్యంలో ఆయనతో మాజీమంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ...‘ దామోదర్‌రెడ్డిని కలిసి మాట్లాడాను. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని చెప్పాను. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్‌కు అండగా ఉన్న వ్యక్తి దామోదర్ రెడ్డి. 2004లో కేవలం 1400 ఓట్లతో ఓడిపోయారు. అప్పుడు పొత్తులో భాగంగా టీఆర్ఎస్లోకి వెళ్లినా టీఆర్ఎస్ నుండి పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఎమ్మెల్సీగా గెలిచారు.క్యాడర్ ఆయన వెంట ఉంది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సమయంలో తన బాధ ఎవరూ వినలేదని దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశం, ఆవేదన, బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి, వ్యక్తిగత నిర్ణయం అని చెప్పాను. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మరోసారి ఆయనను కోరాను. డీకే అరుణ చెబితే దామోదర్ రెడ్డి వింటారని నన్ను ఇబ్బంది పెట్టే ప్రక్రియ అది. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎవరు ఇబ్బంది పెట్టినా, నన్ను టార్గెట్ చేసినా... నేను సిన్సియర్ కార్యకర్తను. కాంగ్రెస్ గెలుపే నా లక్ష్యం. ఎవరు టార్గెట్ చేసినా భయపడి ఇంట్లో కూర్చోను. నా వ్యక్తిగతం కోసం పని చేయడం లేదు. మహబూబ్ నగర్లో ఎప్పుడూ వర్గం లేదు. ఇప్పుడే వినిపిస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే పని చేస్తున్నా. నన్ను డీ మోరల్ చేస్తే పార్టీకే నష్టం. నాకేం ఉంటుంది. బలం చేకూరే నాయకులు వస్తే తప్పులేదు. కానీ ఉన్న బలం పోతే లాభం ఏంటి?. నాగం టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చు కానీ కాంగ్రెస్‌లో కాదు. వాళ్లు బలమైన నాయకులు అయితే అక్కడే గెలవాలి కదా??’ అని ప్రశ్నించారు. కాగా నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకపోవడంతో.. మనస్తాపానికి గురైన తానే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో డీకే అరుణ, జైపాల్‌రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటూ పలు అంశాల్లో విబేధాలు వస్తుండడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి డీకే అరుణ మద్దతుగా నిలవగా, ఇక నాగంకు సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మద్దతుగా నిలిచి పార్టీలోకి తీసుకున్న విషయం విదితమే. -
ఇన్.. ఔట్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికలకు సరిగ్గా ఏడాది కాలం ఉండగానే ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో రాజకీయాల్లో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలతో కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరేందుకు ఇప్పటికే స్పష్టత వచ్చింది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని కూచుకుళ్ల మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకపోవడంతో.. మనస్తాపానికి గురైన తానే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానంపై కూచుకుళ్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలియగానే ప్రభుత్వంలో కీలక మంత్రి ఒకరు రంగంలోకి దిగారు. మరోవైపు నారాయణపేట నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం శివకుమార్ ఆ పార్టీని వీడనున్నారు. పేటలో బలమైన నేతగా గుర్తింపు పొందిన శివకుమార్ కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శివకుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే.అరుణ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇలా టీఆర్ఎస్లో ఓ కీలక నేత చేరేందుకు, ఆ పార్టీ నుంచి మరో నేత కాంగ్రెస్‌లో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు హాట్‌టాఫిక్‌గా మారాయి. నాగర్‌కర్నూల్‌లో ఉప్పు – నిప్పు ఇటీవలి కాలంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో అత్యంత సీనియర్‌గా గుర్తింపు పొందిన నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు ఎన్నికల బరిలో ఆరు సార్లు తలపడ్డారు. తద్వారా ఇరువురి మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. అయితే రాష్ట్రంలో, జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పునరేకీకరణలో భాగంగా నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని భావించారు. అయితే నాగం రాకను దామోదర్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ మంత్రి డీకే.అరుణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితిలో నాగంను చేర్చుకోవద్దని గట్టిగా పట్టుబట్టారు. అయితే తెరవెనుక కాంగ్రెస్ కురువృద్ధుడు ఎస్.జైపాల్‌రెడ్డి చక్రం తిప్పడంతో నాగం చేరికకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు అధిష్టానం కూడా పార్టీలోకి వచ్చే వారిని నిలువరించొద్దని, టిక్కెట్ల విషయం తర్వాత చూద్దామని సర్ది చెప్పింది. అలా నాగం కాంగ్రెస్‌లో చేరడంతో దామోదర్‌రెడ్డి పూర్తిగా మౌనం దాల్చారు. గత కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఆయనను టీఆర్ఎస్లోకి లాగేందుకు ముమ్మర కసరత్తు చేసిన ఓ కీలక మంత్రి ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. వచ్చే ఎన్నికల్లో నాగంను నిలువరించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు కూచుకుళ్ల సంకేతాలు పంపించడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆయనను చేర్చుకునేందుకు అంగీకరించగా.. రెండు, మూడు రోజుల్లో చేరిక ఉండొచ్చని చెబుతున్నారు. శివకుమార్‌కు కాంగ్రెస్ గాలం నారాయణపేట నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న టీఆర్ఎస్ నేత కుంభం శివకుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివకుమార్ పేట నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ప్రస్తత ఎమ్మెల్యే, అప్పటి టీడీపీ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్.రాజేందర్‌రెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి శివకుమార్‌కు ప్రాధాన్యం తగ్గుతుండడంతో సైలెంట్ అయ్యారు. దీంతో ఇటీవలి కాలంలో జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ సైతం శివకుమార్ బలాన్ని తెలుసుకుని పార్టీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని అయితే నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు లేకపోవడంతో మాజీ మంత్రి డీకే.అరుణ రంగంలోకి దిగి శివకుమార్‌ను చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా ఎన్నికల్లో పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాకు స్థానం దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతానని డీకే.అరుణ అధిష్టానానికి గట్టి హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శివకుమార్‌తో మంతనాలు జరపగా ఆయన నుంచి సానుకూలత వచ్చిందని.. వారం, పది రోజుల్లో శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌లో మళ్లీ ఆధిపత్యపోరు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో డీకే అరుణ, ఎస్.జైపాల్‌రెడ్డి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరు అవునంటే.. మరొకరు కాదంటూ పలు అంశాల్లో విబేధాలు వస్తుండడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికను వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి డీకే.అరుణ మద్దతుగా నిలిచారు. ఇక నాగంకు సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి మద్దతుగా నిలిచి పార్టీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జైపాల్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు డీకే.అరుణ వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో తన పట్టు ఏ మాత్రం తగ్గకుండా చూసుకునేందుకు నారాయణపేటలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న శివకుమార్‌ను పార్టీలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే నాగం విషయంలో డీకే.అరుణ ఏ విధంగా అడ్డు తగిలారో... అదే మాదిరిగా శివకుమార్ విషయంలో కూడా జైపాల్‌రెడ్డి అడ్డుపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగా నారాయణపేటలో జైపాల్‌రెడ్డి అనుచరులుగా గుర్తింపు ఉన్న సరఫ్ కృష్ణ, రెడ్డిగారి రవీందర్‌రెడ్డి ఇద్దరూ కూడా శివకుమార్‌ను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఫిర్యాదులు చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా డీకే.అరుణ తన పంతం నెగ్గించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో గట్టిగా పట్టుబట్టారు. దీంతో శివకుమార్ చేరికకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద లైన్ క్లియర్ అయింది. ఇలా శివకుమార్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్లేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
గాంధీభవన్ చేరిన కందనూలు రాజకీయం
సాక్షి, నాగర్‌కర్నూల్ : గత కొద్దికాలంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారి గాంధీ భవన్‌కు చేరింది. తనకు బదులుగా కొత్తగా పార్టీలోకి వచ్చి తన ప్రధాన ప్రత్యర్థి నాగం జనార్దన్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఎలా ఇస్తారంటూ స్థానిక ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అలక బూనిన విషయం విదితమే. అంతటితో ఆగకుండా ఆయన అధికార టీఆర్ఎస్లో చేరేందుకు సన్నాహాలు చేస్తుండడంతో గాంధీభవన్ వర్గాలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఆయనతో సంప్రదింపులు జరిపిన నేతలు.. నాగం జనార్దన్‌రెడ్డి ద్వా రా ఓ ప్రకటన చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని, నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా మద్దతు ఇస్తానంటూ నాగం ప్రకటన చేయడంతో కూచకుళ్ల దామోదర్‌రెడ్డి వర్గీయులు చల్లబడినట్లు తెలుస్తోంది. దీనికితోడు గద్వాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే.అరుణ సైతం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిని పార్టీ మారకుండా నిలువరించేందుకు ప్ర యత్నిస్తున్నట్లు సమాచారం. మరోపక్క ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో మంతనాలు జరిపారు. దీంతో ఎటూ తేల్చుకోలేక దామోదర్‌రెడ్డి మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. గాంధీభవన్ వద్ద నిరసన నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే సహించేది లేదని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మొదటి నుంచి ఉన్న కూచకుళ్ల దామోదర్‌రెడ్డి లేదా పార్టీ సీనియర్ నేతల్లో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివెళ్లి గాంధీభవన్‌లో తమ నిరసన వ్యక్తం తెలపనున్నట్లు జెడ్పీటీసీ కొండా మణెమ్మ, నగేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని మణెమ్మ డిమాండ్ చేశారు. -
కారెక్కనున్న కూచుకుళ్ల!
సాక్షి, నాగర్‌కర్నూల్ : ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా గత రోజులుగా ప్రచారం జరుగుతుండటం, ఆయన నాగర్‌కర్నూల్‌లో ఉంటూ పార్టీ కార్యకర్తలతో చర్చలు జరుపుతుండటంతో హైడ్రామా చోటుచేసుకుంది. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఆ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు సాధించారు. ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన ప్రమేయం లేకుండా అధిష్టానం మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, నాగర్‌కర్నూల్‌లో ఆయనకే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతుండడంతో దామోదర్‌రెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. అధిష్టానాన్ని కలిసినా... ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిన దామోదర్‌రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. అయినా తనను కాదని పీసీసీతోపాటు ఏఐసీసీ సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డిని వెనకేసుకువస్తుండంటంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అదనుగా టీఆర్ఎస్కు చెందిన ఓ కీలక నేత, మంత్రి ఆయనతో సంప్రదింపులు చేపట్టారు. కాంగ్రెస్‌లోని పరిణామాలతో విసుగు చెందిన ఆయన ఓ దశలో టీఆర్ఎస్లోకి వస్తానని హామీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని కార్యకర్తలతో పంచుకుని.. వారు సమ్మతిస్తే రానున్న పది రోజుల్లో టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానంటూ చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ విషయం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. కాగా, మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ వర్గీయుడిగా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గుర్తింపు ఉండగా.. ఆమె రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకువెళ్లినా నాగంను పార్టీలో చేర్చుకోవడంతో కూచుకుళ్ల తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. అధిష్టానానికి లీక్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్‌తో నాలుగు రోజుల క్రితం మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి లీకవడంతో దామోదర్‌రెడ్డి పార్టీ వీడకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు గురు, శుక్రవారాల్లో దామోదర్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌కు తన మకాం మార్చి పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటేలా ఉందని గుర్తించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దామోదర్‌రెడ్డికి ఫోన్ చేశారు. దామోదర్‌రెడ్డిని కలిసేందుకు నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి తాను వస్తానని ఉత్తం చెప్పగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదేవిధంగా మాజీ మంత్రి డీకే.అరుణ సైతం తొందరపడి నిర్ణయం తీసుకోవద్ద్దని దామోదర్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. ఇలా ఒకపక్క అధికార పార్టీ నేతల ఒత్తిడి, మరోపక్క సొం త పార్టీ నాయకుల అభ్యర్థనల మధ్య దామోదర్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు సమాచారం. పార్టీ విధానాలతోనే పరాజయాలు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో తాను వరుసగా పరాజయాల పాలయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ అసంబద్ధ నిర్ణయాలే కారణమని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నా మరొకరికి సీటు ఇవ్వడంతో ఇండిపెండెంట్‌గా రంగంలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి కన్నా తానే ఎక్కువ ఓట్లు సంపాదించినప్పటికీ పరాజయం పాలయ్యానని చెప్పుకొచ్చారు. 2004 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉన్న పొత్తు కారణంగా టీఆర్ఎస్ అభ్యర్థికి టికెట్ దక్కిందని గుర్తు చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో నాగం జనార్దన్‌రెడ్డికి కొందరు కాంగ్రెస్ కీలక నేతలు సహకరించడం కారణంగా పరాజయం పాలైనట్లుగా ఆవేదన వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. 2012లో జరిగిన ఉప ఎన్నికలు, 2014లో జరిగిన సాధారణ ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో విజయం సాధించలేకపోయానని, ప్రస్తుతం అంతా అనుకూలంగా ఉన్న సమయంలో పార్టీ అధిష్టానం నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోందని ఆయన తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని, లేకుంటే తన దారి తాను చూసుకుంటానని దామోదర్‌రెడ్డి తెగేసి చెప్పినట్లుగా సమాచారం. -
నాగం కాంగ్రెస్‌కి చాలా ద్రోహం చేశాడు..
సాక్షి, నాగర్ కర్నూల్: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. అయితే టిక్కెట్ ఆశిస్తే ఊరుకునేది లేదన్న ఆయన.. నాగంపై మరోసారి తన వ్యతిరేకతను చాటారు. రాజకీయంగా బతుకునిచ్చిన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి తమ పార్టీలోకి రావడానికి కొందరు పెద్దలు మద్దతునివ్వడంపై దామోదర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా తాను నాగంకు ప్రత్యర్థిగా ఉన్నానని, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలెందరికో ద్రోహం చేశారని ఆరోపించారు. నాగం కాంగ్రెస్‌లోకి వస్తే చాలామంది నాయకులు రాజీనామా చేస్తారని దామోదర్ రెడ్డి హెచ్చరించారు. అయినా పార్టీలో 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వబోమని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. మెయిల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం రాజీనామా లేఖను పంపారు. -
డీసీసీకి పోటాపోటీ l
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిని కలుస్తున్న ఆశావహులు కందనూలు కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయాలు సాక్షి, నాగర్‌కర్నూల్ : కందనవోలు కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్ష పదవి కోసం చురుగ్గా పావులు కదులుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవిని త్వరలో భర్తీ చేస్తుండటంతో తమకు అవకాశం కల్పించాలంటూ ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికోసం వారంరోజుల నుంచి వారు గాంధీ భవన్లో పైరవీలు ప్రారంభించారని సమాచారం. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. కొల్లాపూర్‌లో పార్టీ బలహీనంగా ఉందని, పూర్వవైభవం తీసుకురావాలంటే ఈ ప్రాంతం వారికే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి హర్షవర్ధన్‌రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన కోడేరు మండల నాయకుడు జగన్మోహన్రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఇక నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లికి చెందిన దిలీపాచారి ఈ పదవి కోసం పావులు కదుపుతున్నారు. గతంలో తనకు నాగర్‌కర్నూల్ అసెంబ్లీ టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, చివరి నిమిషంలో దామోదర్‌రెడ్డికి టికెట్ కేటాయించారని, అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైనందున తనకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆయన పట్టుబడుతున్నారు. జిల్లాలో తొలిసారిగా మహిళకు అవకాశం కల్పించాలని నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ సభ్యురాలు కొండా మణెమ్మ అడుగుతున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నానని, పార్టీ ప్రయోజనాల కోసం కష్టించి పనిచేస్తానని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా వివాదరహితుడైన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని మరోవర్గం డిమాండ్ చేస్తున్నా అందుకు ఆయన సుముఖంగా లేరని మరికొందరు చెబుతున్నారు. ఈ విషయం మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ వరకు వెళ్లడంతో దామోదర్‌రెడ్డినే ఆ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఈసారి యువతకు అవకాశం కల్పించాలని సూచించారని ఈ నేపథ్యంలో చురుగ్గా పనిచేసే వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. ఏదిఏమైనా టీఆర్ఎస్ విధానాలపై నిరసనలు వ్యక్తం చేయడమేగాక పార్టీ కేడర్‌కు అండగా ఉండే నాయకుడికే అవకాశం వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.