నాగర్‌కర్నూల్‌లోని తన స్వగృహంలో కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్ : ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా గత రోజులుగా ప్రచారం జరుగుతుండటం, ఆయన నాగర్‌కర్నూల్‌లో ఉంటూ పార్టీ కార్యకర్తలతో చర్చలు జరుపుతుండటంతో హైడ్రామా చోటుచేసుకుంది. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఆ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు సాధించారు. ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన ప్రమేయం లేకుండా అధిష్టానం మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, నాగర్‌కర్నూల్‌లో ఆయనకే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతుండడంతో దామోదర్‌రెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు.
అధిష్టానాన్ని కలిసినా...
ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసిన దామోదర్‌రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. అయినా తనను కాదని పీసీసీతోపాటు ఏఐసీసీ సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డిని వెనకేసుకువస్తుండంటంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అదనుగా టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత, మంత్రి ఆయనతో సంప్రదింపులు చేపట్టారు. కాంగ్రెస్‌లోని పరిణామాలతో విసుగు చెందిన ఆయన ఓ దశలో టీఆర్‌ఎస్‌లోకి వస్తానని హామీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదే విషయాన్ని కార్యకర్తలతో పంచుకుని.. వారు సమ్మతిస్తే రానున్న పది రోజుల్లో టీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటానంటూ చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ విషయం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది. కాగా, మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ వర్గీయుడిగా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి గుర్తింపు ఉండగా.. ఆమె రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకువెళ్లినా నాగంను పార్టీలో చేర్చుకోవడంతో కూచుకుళ్ల తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అధిష్టానానికి లీక్
టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్‌తో నాలుగు రోజుల క్రితం మంతనాలు జరిపినట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి లీకవడంతో దామోదర్‌రెడ్డి పార్టీ వీడకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు గురు, శుక్రవారాల్లో దామోదర్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌కు తన మకాం మార్చి పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటేలా ఉందని గుర్తించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దామోదర్‌రెడ్డికి ఫోన్ చేశారు.
దామోదర్‌రెడ్డిని కలిసేందుకు నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి తాను వస్తానని ఉత్తం చెప్పగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదేవిధంగా మాజీ మంత్రి డీకే.అరుణ సైతం తొందరపడి నిర్ణయం తీసుకోవద్ద్దని దామోదర్‌రెడ్డికి ఫోన్‌లో సూచించారు. ఇలా ఒకపక్క అధికార పార్టీ నేతల ఒత్తిడి, మరోపక్క సొం త పార్టీ నాయకుల అభ్యర్థనల మధ్య దామోదర్‌రెడ్డి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
పార్టీ విధానాలతోనే పరాజయాలు
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో తాను వరుసగా పరాజయాల పాలయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ అసంబద్ధ నిర్ణయాలే కారణమని ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నా మరొకరికి సీటు ఇవ్వడంతో ఇండిపెండెంట్‌గా రంగంలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి కన్నా తానే ఎక్కువ ఓట్లు సంపాదించినప్పటికీ పరాజయం పాలయ్యానని చెప్పుకొచ్చారు. 2004 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉన్న పొత్తు కారణంగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి టికెట్ దక్కిందని గుర్తు చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో నాగం జనార్దన్‌రెడ్డికి కొందరు కాంగ్రెస్ కీలక నేతలు సహకరించడం కారణంగా పరాజయం పాలైనట్లుగా ఆవేదన వెలిబుచ్చినట్లు తెలుస్తోంది.
2012లో జరిగిన ఉప ఎన్నికలు, 2014లో జరిగిన సాధారణ ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో విజయం సాధించలేకపోయానని, ప్రస్తుతం అంతా అనుకూలంగా ఉన్న సమయంలో పార్టీ అధిష్టానం నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోందని ఆయన తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని, లేకుంటే తన దారి తాను చూసుకుంటానని దామోదర్‌రెడ్డి తెగేసి చెప్పినట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment