ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితోమాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు
డీసీసీకి పోటాపోటీ l
Published Wed, Oct 19 2016 12:31 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిని కలుస్తున్న ఆశావహులు
కందనూలు కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయాలు
సాక్షి, నాగర్‌కర్నూల్ : కందనవోలు కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్ష పదవి కోసం చురుగ్గా పావులు కదులుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవిని త్వరలో భర్తీ చేస్తుండటంతో తమకు అవకాశం కల్పించాలంటూ ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికోసం వారంరోజుల నుంచి వారు గాంధీ భవన్‌లో పైరవీలు ప్రారంభించారని సమాచారం. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. కొల్లాపూర్‌లో పార్టీ బలహీనంగా ఉందని, పూర్వవైభవం తీసుకురావాలంటే ఈ ప్రాంతం వారికే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి హర్షవర్ధన్‌రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన కోడేరు మండల నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఇక నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లికి చెందిన దిలీపాచారి ఈ పదవి కోసం పావులు కదుపుతున్నారు. గతంలో తనకు నాగర్‌కర్నూల్ అసెంబ్లీ టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, చివరి నిమిషంలో దామోదర్‌రెడ్డికి టికెట్ కేటాయించారని, అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైనందున తనకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆయన పట్టుబడుతున్నారు.
జిల్లాలో తొలిసారిగా మహిళకు అవకాశం కల్పించాలని నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ సభ్యురాలు కొండా మణెమ్మ అడుగుతున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నానని, పార్టీ ప్రయోజనాల కోసం కష్టించి పనిచేస్తానని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా వివాదరహితుడైన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని మరోవర్గం డిమాండ్ చేస్తున్నా అందుకు ఆయన సుముఖంగా లేరని మరికొందరు చెబుతున్నారు. ఈ విషయం మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ వరకు వెళ్లడంతో దామోదర్‌రెడ్డినే ఆ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఈసారి యువతకు అవకాశం కల్పించాలని సూచించారని ఈ నేపథ్యంలో చురుగ్గా పనిచేసే వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. ఏదిఏమైనా టీఆర్‌ఎస్ విధానాలపై నిరసనలు వ్యక్తం చేయడమేగాక పార్టీ కేడర్‌కు అండగా ఉండే నాయకుడికే అవకాశం వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
Advertisement