గాంధీభవన్‌ చేరిన కందనూలు రాజకీయం  | Gandhi Bhavan Response On MLC Damodar Reddy Issue | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌ చేరిన కందనూలు రాజకీయం 

Published Sun, Jun 3 2018 8:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Gandhi Bhavan Response On MLC Damodar Reddy Issue - Sakshi

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి(ఫైల్‌)

సాక్షి, నాగర్‌కర్నూల్‌ :  గత కొద్దికాలంగా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారి గాంధీ భవన్‌కు చేరింది. తనకు బదులుగా కొత్తగా పార్టీలోకి వచ్చి తన ప్రధాన ప్రత్యర్థి నాగం జనార్దన్‌రెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ ఎలా ఇస్తారంటూ స్థానిక ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అలక బూనిన విషయం విదితమే. అంతటితో ఆగకుండా ఆయన అధికార టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తుండడంతో గాంధీభవన్‌ వర్గాలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఆయనతో సంప్రదింపులు జరిపిన నేతలు.. నాగం జనార్దన్‌రెడ్డి ద్వా రా ఓ ప్రకటన చేయించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి పాలనను అంతమొందించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని, నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి ఇచ్చినా మద్దతు ఇస్తానంటూ నాగం ప్రకటన చేయడంతో కూచకుళ్ల దామోదర్‌రెడ్డి వర్గీయులు చల్లబడినట్లు తెలుస్తోంది. దీనికితోడు గద్వాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే.అరుణ సైతం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిని పార్టీ మారకుండా నిలువరించేందుకు ప్ర యత్నిస్తున్నట్లు సమాచారం. మరోపక్క ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో మంతనాలు జరిపారు. దీంతో ఎటూ తేల్చుకోలేక దామోదర్‌రెడ్డి మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. 

గాంధీభవన్‌ వద్ద నిరసన 
నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్‌ ఇస్తే సహించేది లేదని నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. మొదటి నుంచి ఉన్న కూచకుళ్ల దామోదర్‌రెడ్డి లేదా పార్టీ సీనియర్‌ నేతల్లో ఎవరికైనా టికెట్‌ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివెళ్లి గాంధీభవన్‌లో తమ నిరసన వ్యక్తం తెలపనున్నట్లు జెడ్పీటీసీ కొండా మణెమ్మ, నగేష్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గానికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని మణెమ్మ డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement