
ప్రభుత్వం పట్టింపులకు పోతోంది: జైపాల్
హైదరాబాద్ : ఛలో మల్లన్నసాగర్ వెళుతున్న కాంగ్రెస్ నేతల అరెస్ట్ను ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం... కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్ మల్లన్నసాగర్కు అవసరమా అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదని జైపాల్ రెడ్డి హితవు పలికారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఆయన సూచించారు.
కాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు ఛలో మల్లన్న సాగర్కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకుని, గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.