సాక్షి, హైదరాబాద్ : పాలమూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయం ముదిరి పాకాన పడుతోంది. జిల్లాలో కీలక నేతలైన కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి డి.కె. అరుణల మధ్య రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో అరుణకు వ్యతిరేకంగా జైపాల్ కుట్ర చేశారన్న ఆరోపణలతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ పరిణామం అనంతరం అరుణ కూడా దూకుడుగానే వెళ్తూ వీలున్నప్పుడల్లా జైపాల్‌ను ఇబ్బందుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో స్థానం లభిస్తుందని, అధిష్టానం వద్ద చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆశించిన జైపాల్‌రెడ్డికి ఈ విషయంలో ఆశాభంగం జరగ్గా ఇదే అదనుగా అరుణ ఏకంగా జైపాల్ లోక్‌సభ టికెట్‌కు ఎసరు పెట్టే వ్యూహాలు రచిస్తున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ టికెట్‌తోపాటు దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలనూ బీసీలకు కేటాయించాలని ఆమె ప్రతిపాదిస్తున్నారు. అయితే జైపాల్ శిబిరం మాత్రం అధిష్టానం తమకే ప్రాధాన్యమిస్తుందని ధీమాగా ఉంది.
తెరపైకి చిత్తరంజన్‌దాస్ పేరు...
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో అరుణ, జైపాల్ వర్గాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా లోక్‌సభతోపాటు ఆ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో తమ వర్గానికి చెందిన నేతలకే టికెట్లు దక్కించుకోవాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నాయి. ఇదే క్రమంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి టికెట్ ఖాయం అని ప్రచారం జరుగుతున్న జైపాల్‌రెడ్డికి కాకుండా బీసీ వర్గాలకు చెందిన చిత్తరంజన్‌దాస్ పేరును అరుణ తెరపైకి తెచ్చారు. గతంలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి లేదా చిత్తరంజన్‌దాస్‌లలో ఒకరికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించిన అరుణ ఇప్పుడు బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభతోపాటు అసెంబ్లీ స్థానాన్ని కూడా బీసీలకే ఇవ్వాలని ఆమె వాదిస్తున్నారు.
గతంలో ఎన్.టి. రామారావును ఓడించి సంచలనం సృష్టించిన ప్రస్తుత కాంగ్రెస్ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ చిత్తరంజన్‌దాస్‌కు లోక్‌సభ సీటు ఇవ్వాలంటున్నారు. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలకు లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లు ఇస్తే ప్రయోజనంగా ఉంటుందని వాదిస్తున్నారు. కానీ ఈ వాదనను జైపాల్ వర్గం కొట్టిపారేస్తోంది. పార్టీలో సీనియర్ నేతగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్‌రెడ్డికే మహబూబ్‌నగర్ లోక్‌సభ టికెట్ వస్తుందని చెబుతోంది. లోక్‌సభకు పోటీ చేయించే ఆలోచనతోపాటు రాష్ట్రంలో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు ఉన్నందునే అధిష్టానం జైపాల్‌ను సీడబ్ల్యూసీలోకి తీసుకోలేదని పేర్కొంటోంది.
నాలుగు అసెంబ్లీ స్థానాలపై కిరికిరి...
మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ్‌పేట్, కొడంగల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో షాద్‌నగర్ నుంచి సి.ప్రతాప్‌రెడ్డి, జడ్చర్ల నుంచి మల్లు రవి, కొడంగల్ నుంచి ఎ. రేవంత్‌రెడ్డిలకు టికెట్లు ఇచ్చే విషయమై ఇరువర్గాల్లోనూ ఏకాభిప్రాయముంది. మిగిలిన నాలుగు చోట్ల అరుణ, జైపాల్ వర్గాలు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాయి. మహబూబ్‌నగర్‌లో జైపాల్ వర్గం సురేందర్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తోంది. ఒకవేళ మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇబ్రహీంకు ఇవ్వాలంటోంది. అయితే అరుణ మాత్రం ఈ రెండు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ విషయంలో అరుణ వ్యతిరేక అభిప్రాయంతో లేనప్పటికీ అక్కడ ముదిరాజ్ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలని ఆమె అంటున్నారు. ఇందుకోసం స్థానిక నేత ఎన్.పి. వెంకటేశ్ పేరును ఆమె ప్రతిపాదస్తున్నారు. లేదంటే ఎర్ర శేఖర్‌కు ఇవ్వాలని చెబుతున్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో గతంలో పోటీచేసి ఓడిపోయి నాలుగేళ్లు పార్టీని కాపాడిన పవన్‌కుమార్‌రెడ్డిని అరుణ వర్గం ప్రతిపాదిస్తోంది. అయితే ఇక్కడ జైపాల్‌రెడ్డి మాత్రం బీసీ కోటాలో కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్ పేరు తెరపైకి తెస్తున్నారు. బంగారం వ్యాపారి షరాబు కృష్ణను నారాయణపేట సీటుకు జైపాల్ ప్రతిపాదిస్తుంటే తన బంధువు శివకుమార్‌రెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలనే ఆలోచనతో అరుణ ఉన్నారు. గతంలో ఆయన పార్టీలో చేరాలనుకున్నా తమ్ముడు రామ్మోహన్‌రెడ్డి కోసం తానే అడ్డుకున్నానని, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన శివకుమార్‌రెడ్డికి ఈసారి ఎలాగైనా టికెట్ ఇప్పిస్తానని అరుణ సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఇక పూర్తిగా అరుణ హవా నడిచే మక్తల్ నియోజకవర్గంలో ఆమె ప్రస్తుత జెడ్పీటీసీ శ్రీహరి పేరు ప్రతిపాదిస్తున్నారు. కానీ జైపాల్ మాత్రం స్థానిక నేత నిజాం పాషాకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ జైపాల్, అరుణల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment