హస్తినలో...కుస్తీ
జిల్లా కాంగ్రెస్ వర్గాలు ఇప్పుడు ‘హస్తిన’ వాకిట సిట్టింగ్ వేశాయి. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణలు అక్కడే మకాం వేయడంతో వారి మద్దతుదారులూ మోహరించారు. ఆ పార్టీ పెద్దలను కలుస్తూ తమ అనుయాయులకు అసెంబ్లీ బరిలో కర్చీఫ్‌లు వేయించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎవరికి వారు తమ వంతు లాబీయింగ్ చేస్తున్నారు. మరో వైపు టీఆర్‌ఎస్ మాజీ నేత ఇబ్రహీం ఆగమనంతో వచ్చిన తంటా కూడా అక్కడ కాక రేకెత్తిస్తోంది.
అసెంబ్లీ, లోక్‌సభ టికెట్లు ఆశి స్తున్న కాంగ్రెస్ జిల్లా నేతలు ఢిల్లీలో మ కాం వేసి జోరుగా లాబీయింగ్ చేస్తున్నా రు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు ప్రచార కమిటీ కన్వీనర్ దామోదర రాజనర్సిం హ ఢిల్లీలో మకాం వేశారు. దీంతో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకుని టీపీసీసీ నేతలపై ఒత్తిడి తెస్తున్నా రు. దిగ్విజయ్ సింగ్, వయలార్ రవిని కలుస్తూ తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞాపనలు అందజేస్తున్నారు. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో ఆయన అభిప్రా యం కీలకం కావడంతో ఆయన చుట్టూ జిల్లా నేతలు చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఢిల్లీలోనే మకాం వేసి తన మద్దతుదారుల అవకాశం చేజారకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే టికెట్ కోసం టీఆర్‌ఎస్ నుంచి చేరిన ఇబ్రహీం ప్రయత్నిస్తుండటంతో కాంగ్రెస్ ‘మార్కు’ రాజకీయం రంజుగా సాగుతోంది.
ఇబ్రహీంకు టికెట్ ఇవ్వవద్దంటూ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా నేతత్వంలో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ నేతలు చేసిన తీర్మానాన్ని పార్టీ ముఖ్యులకు అందజేశారు. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొలిక్కి వచ్చినా ఈ నెల 6న జరిగే తొలి విడత ప్రాదేశిక ఎన్నికల తర్వాతే విడుదల చేసే అవకాశముందని ఔత్సాహికులు అంచనా వేస్తున్నారు. మ రోవైపు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి తనకు అనుకూలంగా ఉండేవారికి టికెట్ ఇ ప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ దక్కని పక్షంలో కొందరు కాంగ్రెస్ నేత లు ఆయనకు వ్యతిరేక గళం విప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా నాగర్‌కర్నూ లు లోక్‌సభ స్థానం నుంచి మాజీ మం త్రి ఏ.చంద్రశేఖర్ పేరు దాదాపు ఖాయమైంది. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య పేరు కూడా తెరమీదకు వస్తున్నట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి జైపాల్‌రెడ్డి పోటీ చేయడం ఖాయం కావడంతో మాజీ ఎంపీ విఠల్‌రావుకు అసెంబ్లీ స్థానం కేటాయింపుపై మల్లగుల్లాలు పడుతున్నారు. విఠల్‌రావు కొడంగల్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతుండగా, జైపాల్‌రెడ్డి మాత్రం నారాయణపేట నుంచి బరిలో వుండాల్సిందిగా సూచిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలనే యోచనలో జైపాల్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ స్థాన ం నుంచి డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, సయ్యద్ ఇబ్రహీం పేర్లపై కసరత్తు జరుగుతోంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఇబ్రహీంకు మద్దతు పలుకుతున్నారు. నారాయణపేట నుంచి టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇతర జిల్లాల్లో జేఏసీ నేతలకు అవకాశం ఇస్తున్నందున రాజేందర్‌రెడ్డికి అవకాశం దక్కే సూచన కనిపించడం లేదు. విఠల్‌రావు పోటీ చేయని పక్షంలో రెడ్డిగారి రవీందర్‌రెడ్డి పేరును జైపాల్‌రెడ్డి బలంగా సూచించే అవకాశం వుంది.
మక్తల్ నుంచి డీకే అరుణ సోదరుడు రామ్మోహన్‌రెడ్డి ఆశిస్తున్నా జైపాల్‌రెడ్డి అభిప్రాయం కీలకం కానుంది. షాద్‌నగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డికి మరోమారు అవకాశం దక్కనుంది.
జడ్చర్ల నుంచి మల్లు రవి పేరు దాదాపు ఖరారైనా మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, సాధు వెంకట్‌రెడ్డి ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై స్పష్టత రావడం లేదు. డోకూరు పవన్‌కుమార్ రెడ్డి గట్టిగా ప్రయత్నం చే స్తున్నా, జైపాల్‌రెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది. కొత్తకోట, అడ్డాకుల, భూత్పూర్‌లో బీసీల ఓట్లు కీలకం కావడంతో బీసీ అభ్యర్థిపై జైపాల్‌రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్‌కర్నూలు స్థానం పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒకవేళ పొత్తు కుదరకపోతే దామోదరరెడ్డి, దిలీపాచారి పేర్లు పరిశీలనలో వున్నాయి. కల్వకుర్తి నుంచి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డితో పాటు జైపాల్‌రెడ్డి సమీప బంధువు పేర్లు పరిశీలనలో వున్నాయి. ప్రస్తుతానికి వంశీచంద్ వైపు మొగ్గు కనిపిస్తోంది.
గద్వాలలో మాజీ మంత్రి అరుణ, అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే వంశీకష్ణకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో దాదాపు ఖరారైనట్లే భావిస్తున్నారు. కొల్లాపూర్‌లో విష్ణువర్దన్‌రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి పేర్లు పరిశీలనలో వున్నాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం వుంది. అలంపూర్‌లో విజయుడు, సంపత్‌కుమార్, రజనీరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నా యి. చల్లా వెంకట్రాంరెడ్డి ఎవరి పేరును ప్రతిపాదిస్తారో వెల్లడి కావడం లేదు.