సాక్షి, హైదరాబాద్ : జరగబోయేది రామ-రావణ యుద్దమేనని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. శేరిలింగంపల్లిలో ఆంధ్ర సెటిలర్లతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని, కానీ సీతను రావణుడు తస్కరించినట్టు కేసీఆర్ తెలంగాణను తస్కరించాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేతిలో ఓటమి తప్పదని కేసీఆర్‌ను హెచ్చరించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఆస్తుల రక్షణపై అప్పుడు పార్లమెంట్‌లో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందిరాలేదని, కానీ తెలంగాణ వారికే ఇబ్బందులొచ్చాయన్నారు.
70 ఏళ్లలో రూ. 70 కోట్ల అప్పుతో తెలంగాణ ఇస్తే నాలుగేళ్లలో రూ. లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. ఉస్మానియాకు రాహుల్ గాంధీని రానివ్వకపోవడం సరికాదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కొడుకు వస్తానంటే విద్యార్థులు అడ్డుకోవాలి కానీ వీసీతో ఆపించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ఓయూకు వెళ్లాలని కాంగ్రెస్ ఎలాంటి ఆటంకాలు కల్పించదన్నారు. కానీ విద్యార్థులే కొట్టి చంపుతారని హెచ్చరించారు. ఎంత మంది పోలీసులు ఉన్నా, కేంద్ర బలగాలు కూడా కాపాడలేవన్నారు. ఉస్మానియానే కాదు రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకైనా వెళ్లి మాట్లాడగలవా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం పథకాలు ప్రారంభిస్తున్నారని, దమ్ముంటే సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎన్నికలు పెట్టు ఎదుర్కునేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చెంచా అన్నారు. కేసీఆర్ తెలంగాణలో సెటిలర్లు తమ వాళ్లే అంటాడు.. కానీ ఆంధ్రకు హోదా ఇస్తే అడ్డుకుంటాడని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment