Rahul tour
-
టీడీపీతో పొత్తు అవకాశాలు: రాహుల్
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై స్థానిక పీసీసీలదే తుది నిర్ణయమని ప్రకటించారు. ఈ విషయంలో స్థానిక నేతల నుంచి సూచనలొస్తే పరిశీలిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని, బీహార్‌లో ఆర్జేడితో కలిసి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 2019లో నరేంద్ర మోదీని ప్రధాని కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. యూపీఏ భాగస్వామ్యంతో పాటు అన్ని పార్టీలను కలుపుకుంటున్నామని చెప్పారు. 200 సీట్లు సొంతంగా వస్తేనే మోదీ ప్రధాని అవుతారని, యూపీ, బీహార్‌లో 120 సీట్లను కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై.. కుటుంబ పాలనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కుటంబ పాలనే లేదని, గడిచిన 20 ఏళ్లుగా నెహ్రు కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని కాలేదన్నారు. సోనియా రిమోట్‌తో యూపీఏ నడిపించారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మోదీ ప్రభుత్వమే ఆర్ఎస్సెస్ రిమోట్‌తో నడుస్తుందని ఎద్దేవా చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించాక ఎస్సీ వర్గీకరణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలన్నింటితో కలిసి పోటీచేస్తామని, కాంగ్రెస్ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రానికి సంబంధించిన అంశంగా పేర్కొంటూ రాహుల్ మాట దాటవేసారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఏపీలో మాత్రం ఓట్ల శాతం పెరుగుతుందన్నారు. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. గెలిచిన పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉండటం రాజ్యంగబద్ధమని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం ఉండదన్నారు. టీడీపీ వ్యాపార వేత్తల క్యూ.. రాహుల్ పారిశ్రామిక వేత్తల సమావేశానికి టీడీపీ వ్యాపారవేత్తలు క్యూ కట్టారు. నారా బ్రాహ్మణి, టీజీ భరత్( టీజీ వెంకటేశ్ కుమారుడు), జేసీ తనయుడు పవన్ హాజరయ్యారు. కొంత కాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభ పీఏసీ సభ్యుని ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వగా.. డిప్యూటీ ఛైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతునిచ్చింది. కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు చేయ్యేసి ఫొటోలకు ఫోజుచ్చిన విషయం తెలిసిందే. చదవండి: చంద్రబాబు లవ్ ఇన్ బెంగళూరు..! -
కాంగ్రెస్‌లో నూతన ఉత్తేజం!
ఏఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత, రాహుల్ గాంధీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి అన్ని అనుకూలతలున్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తుంది. జమిలీ ఎన్నికల మాట అటుంచి, రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోనున్నారన్న ప్రచారం ఎక్కువైంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ దూకుడు పెంచింది. ఏఐసీసీ ప్లీనరీలో చెప్పినట్టుగా కార్యకర్తలకు అధిష్టానానికి ఉన్న అడ్డుగోడలను కూల్చివేసే ప్రక్రియ తెలంగాణ నుంచే ఆరంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుపడుతున్న మోదీకి అన్ని సంద ర్భాలలో కేసీఆర్ మద్దతుగా నిలవటంతో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ‘బి–టీం’గా వ్యవహరిస్తోందని తేలి పోయింది. దీనితో సెటిలర్లలో, విభజన హామీలుS అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే మార్గమనే భావన ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తూ, అన్యాయం చేస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలని చూస్తున్న తరుణంలో, రాహుల్ పర్యటన తెలం గాణ ప్రజలకు భరోసా ఇవ్వనుంది. మోదీ రూపంలో ప్రజలను పట్టిపీడిస్తున్న ధరల పెరుగుదల, జీఎస్టీ భారం, బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత, అసహనం, దళితులపై దాడులు, రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం తదితర అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న ద్రోహాలను రాహుల్ తన రెండు రోజుల పర్యటనలో ఎత్తిచూపనున్నారు. ఇక రాహుల్ గతంలో నామకరణం చేసినట్టు ‘మినీ మోదీ’ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎమ్మెల్యేల పదవీ కాలం రద్దు, ప్రాజెక్టుల్లో అవినీతి, ఇసుక మాఫియా, నేరెళ్ల ఘటన, కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తించకపోవటం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో స్తబ్దత, అభయ హస్తం పింఛన్లు, ఊసే లేని కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, నిర్లక్ష్యానికి గురవుతున్న ఆరోగ్యశ్రీ, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరసనలు, రేషన్ డీలర్ల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు రైతు బీమా పేరుతో తెచ్చిన పథకం 60 ఏళ్ళు నిబంధన ఇలా ప్రజలు అసంతృప్తితోవున్న అనేక అంశాలు గ్రేటర్ వేదికగా, యావత్ తెలంగాణ ప్రజల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను రాజకీయాలకు అతీతంగా సందర్శించి, విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా, ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వస్తారంటే టీఆర్ఎస్ నేతలు దీన్నీ వివాదాస్పదం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అన్ని సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పని చేస్తుంటే, టీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం అనుమతి ఇవ్వొద్దని పోటీగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి యూనివర్సిటీ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ, పార్టీ కార్యక్రమాలతో పాటు, సమాజంలోని అనేక రంగాల ప్రజలను రాహుల్ ఈ పర్యటనలో కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కూడా కలవరం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బలమైన రాజకీయ శక్తి అని భావించి, ఈ మధ్యనే వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు రాహుల్ పర్యటనను తమ ఉనికిని చాటుకోవడానికి అనువైన సమయంగా భావిస్తుండటంతో పాత–కొత్త కలయికతో పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగనుంది. ఊహించినట్టుగా ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌లోపే వచ్చినా ఈ పర్యటనలో రాహుల్ స్ఫూర్తితో పనిచేసి, మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని, అధికారంలోకి రావాలనే ఊపు పార్టీ శ్రేణులలో కనబడుతుంది. -కొనగాల మహేష్(వ్యాసకర్త సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ -98667 76999) -
హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన
-
అక్కడ మోదీ.. ఇక్కడ కేసీఆర్: రాహుల్ ధ్వజం
-
అక్కడ మోదీ.. ఇక్కడ కేసీఆర్: రాహుల్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ఇక్కడ సీఎం కేసీఆర్ ఇద్దరి శైలి ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లిలో ఆంధ్ర సెటిలర్లతో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ అంటారు.. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని కేసీఆర్ చెబుతారు. రఫెల్ కాంట్రాక్ట్ కోసం ప్రధానితో పాటు అనిల్ అంబానీ ఫ్రాన్స్ వెళ్లారు. ఎలాంటి అనుభవంలేని అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇస్తారు. ఎంతో అనుభవం ఉన్న హెచ్‌ఏల్‌కు మాత్రం కాంట్రాక్టు ఇవ్వరు. ఇంత చేస్తే అనిల్ అంబానీ కంపెనీకి ఉన్న అనుభవం కేవలం 10 రోజులు మాత్రమే. రహస్య ఒప్పందం ఏంటంటే జనం డబ్బంతా మోదీ దారాదత్తం చేశారు. పార్లమెంట్లో కలిసినప్పుడు మోదీని నిలదీశాను. రఫెల్ డీల్ గురించి కళ్లలో సూటిగా చూసి అడిగాను. మోదీ మాత్రం నా కళ్లలో చూడకుండా దిక్కులు చూశారు. తెలంగాణలో ఒకే కుటుంబం పాలన నడుస్తోంది. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. దళిత, ఆదివాసీ రైతులను నట్టెట ముంచారు. చందమామను.. చందమామను భూమి మీద తీసుకొస్తానని చెప్పను. కానీ మోదీ, కేసీఆర్ అదే విషయాన్ని చెబుతున్నారు. ప్రతి అకౌంట్లో రూ 15 లక్షలు వేస్తానని తానేప్పుడు చెప్పను. కానీ మోదీ అదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుస్తాం. అది ఏపీ, తెలంగాణల హక్కు. అర్ధరాత్రి 12 గంటలకు గబ్బర్ సింగ్ ట్యాక్స్ పెట్టారు. రైతలు రుణమాఫీ అడుగుతుంటే మోదీ నో అంటున్నారు. సూటు, బూటు మాఫీ చేస్తామంటున్నారు.’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. -
ఇక రామ-రావణ యుద్దమే
సాక్షి, హైదరాబాద్ : జరగబోయేది రామ-రావణ యుద్దమేనని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. శేరిలింగంపల్లిలో ఆంధ్ర సెటిలర్లతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అని, కానీ సీతను రావణుడు తస్కరించినట్టు కేసీఆర్ తెలంగాణను తస్కరించాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేతిలో ఓటమి తప్పదని కేసీఆర్‌ను హెచ్చరించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల ఆస్తుల రక్షణపై అప్పుడు పార్లమెంట్లో హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందిరాలేదని, కానీ తెలంగాణ వారికే ఇబ్బందులొచ్చాయన్నారు. 70 ఏళ్లలో రూ. 70 కోట్ల అప్పుతో తెలంగాణ ఇస్తే నాలుగేళ్లలో రూ. లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. ఉస్మానియాకు రాహుల్ గాంధీని రానివ్వకపోవడం సరికాదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కొడుకు వస్తానంటే విద్యార్థులు అడ్డుకోవాలి కానీ వీసీతో ఆపించడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ ఓయూకు వెళ్లాలని కాంగ్రెస్ ఎలాంటి ఆటంకాలు కల్పించదన్నారు. కానీ విద్యార్థులే కొట్టి చంపుతారని హెచ్చరించారు. ఎంత మంది పోలీసులు ఉన్నా, కేంద్ర బలగాలు కూడా కాపాడలేవన్నారు. ఉస్మానియానే కాదు రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకైనా వెళ్లి మాట్లాడగలవా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం పథకాలు ప్రారంభిస్తున్నారని, దమ్ముంటే సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎన్నికలు పెట్టు ఎదుర్కునేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చెంచా అన్నారు. కేసీఆర్ తెలంగాణలో సెటిలర్లు తమ వాళ్లే అంటాడు.. కానీ ఆంధ్రకు హోదా ఇస్తే అడ్డుకుంటాడని దుయ్యబట్టారు. -
తెలంగాణలో కుటుంబపాలన.. కేసీఆర్‌పై రాహుల్ ఫైర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కుటుంబపాలన సాగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రాజేంద్ర నగర్ క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్లో డ్వాక్రా మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకురాగా ఆయన సమాధానిమిచ్చారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ టాక్స్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే సులభతరమైన టాక్స్ విధానం కోసం జీఎస్టీ తీసుకొచ్చిందని అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకించారన్నారు. మహిళా అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ది చెందదని కాంగ్రెస్ నమ్ముతుందని, మోదీ, కేసీఆర్ ప్రభుత్వాలు మహిళా భాగస్వామ్యాన్ని మరిచిపోయాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారని, అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు. మోదీ, కేసీఆర్ సర్కార్లు ఒకేలా ఉన్నాయన్నారు. ఇద్దరు హామీలను పూర్తిగా మరిచిపోయారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని మోదీ అన్నారని, ఆరోగ్యం, విద్య పేదలకు అందడం లేదని, యూనివర్సిటీలను ప్రయివేట్ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. భేటీ బచావో, భేటీ పడావో అని మోదీ అన్నారని, యూపీలో ఎమ్మెల్యే అత్యాచారం చేసినా.. బీహార్‌లో పిల్లల మీద అత్యాచారం జరిగినా, దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగినా ఆయన నోట మాట రావడం లేదని దుయ్యబట్టారు. నిరుపేదల కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందన్నారు. యూపీఎ హయాంలో రాజస్తాన్‌లో మందులు ఉచితంగా ఇచ్చామని, ఉపాథి హామీ పథకం తీసుకొచ్చామని, ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసామని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వచ్చేది మహిళా సంఘాల సర్కార్ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే మహిళల రుణాల మీద వడ్డీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. -
రాహుల్ పర్యటన: జైపాల్ రెడ్డికి చుక్కెదురు!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సీనియర్ నేత అయిన జైపాల్ రెడ్డిని సెక్యురిటీ సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించలేదు. రాహుల్‌కు స్వాగతం పలికేందుకు పోలీసులు 10 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ జాబితాలో తెలంగాణ పీసీసీ జైపాల్ రెడ్డి పేరు పేర్కొనలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో హౌజ్ టెర్మినల్ వద్దే జైపాల్ రెడ్డి వేచి చూస్తున్నారు. ఆయనతో పాటు పోన్నాల లక్ష్మయ్య, మర్రిశశిధర్ రెడ్డి, వీహెచ్, జీవన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డిలు బయటే వేయిట్ చేస్తున్నారు. వీవీఐపీ టెర్మినల్‌కు 2 కిలోమీటర్ల దూరం వరకే పోలీసులు కాంగ్రెస్ నేతలకు అనుమతినిచ్చారు. రాహుల్ పర్యటన సందర్భంగా శంషాబాద్‌కు 500 బైక్‌లతో ర్యాలీ వెళ్లాలనుకున్న పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పట్టించుకోని కార్యకర్తలు బైక్ ర్యాలీ తీసే ప్రయత్నం చేశారు. దీంతో భారీగా ట్రాఫీక్ జామ్ అయింది. ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. -
రాహుల్ టూర్ ఆగలేదు
సాక్షి,అమేథి: రాహుల్ పర్యటనను వాయిదా వేసుకోమని కోరినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన క్రమంలో ఆయన టూర్‌కు అమేథి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగే రాహుల్ అమేథి పర్యటన కోసం తాము సంసిద్ధంగా ఉన్నామని అమేథి జిల్లా మేజిస్ర్టేట్ యోగేష్ కుమార్ చెప్పారు. ఈనెల 4-6 తేదీల్లో రాహుల్ నియోజకవర్గ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించలేదని, కేవలం ఆయన భద్రత పట్ల ఆందోళనతోనే వాయిదా వేసుకోవాలని కోరారని తెలిపారు. దుర్గా విగ్రహాల నిమజ్జనం, మొహర్రం సందర్భంగా భద్రతా సిబ్బంది బిజీగా ఉంటారనే కారణంతోనే రాహుల్ పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ చీఫ్‌కు అధికారులు లేఖ రాశారని వివరణ ఇచ్చారు.అయితే రాహుల్ గతంలో ఇచ్చిన షెడ్యూల్ మేరకే పర్యటిస్తానని పేర్కొనడంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. అయితే రాహుల్ టూర్ వాయిదా వేయాలని అధికారులు కోరడాన్ని యూపీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ తప్పుపట్టారు. -
అంబేడ్కర్ ఊరికి రాహుల్!
ఇండోర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఉన్న మహూకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జూన్ 2వ తేదీన వెళ్లనున్నారు. దళితులు అధికంగా ఉన్న ఆ నియోజకవర్గంలో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు స్థానిక నేతలు కృషి చేస్తున్నారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, రాహుల్‌గాంధీకి, ఆయన కుటుంబానికి అంబేడ్కర్ సిద్ధాంతాలతో ఎలాంటి సంబంధం లేదని, దళితులు కానీ, అంబేడ్కర్ అభిమానులు కానీ వారిని ఆమోదించబోరని బీజేపీ వ్యాఖ్యానించింది. -
రైతులకు భరోసాకే రాహుల్ యాత్ర
హైదరాబాద్: రైతులకు భరోసా ఇవ్వడానికే రాహుల్ గాంధీ ఈ పర్యటన చేపట్టారని, రైతు ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క ఆరోపించారు. రాహుల్ రైతు భరోసా యాత్ర సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగత ఏర్పాట్లను బుధవారం ఆయన మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో రైతులు, ప్రజల సమస్యలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చి భరోసా కల్పించారని ఎద్దేవా చేశారు. స్వాగత ఏర్పాట్లలో బిజీ బిజీ.. శంషాబాద్ విమానాశ్రయానికి గురువారం చేరుకోనున్న రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. విమానాశ్రయంలోని హజ్‌హౌజ్ వద్ద రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. పీసీసీ ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా రాహుల్‌గాంధీ కలవడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. హజ్‌హౌజ్ భవనం ఎదుట కార్యకర్తలను కలవడానికి బారికేడ్లు, టెంట్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కె.శ్రవణ్‌కుమార్‌గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, సర్పంచ్ సిద్దేశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేణుగౌడ్, మాజీ ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.