రైతులకు భరోసాకే రాహుల్ యాత్ర
హైదరాబాద్: రైతులకు భరోసా ఇవ్వడానికే రాహుల్ గాంధీ ఈ పర్యటన చేపట్టారని, రైతు ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క ఆరోపించారు. రాహుల్ రైతు భరోసా యాత్ర సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగత ఏర్పాట్లను బుధవారం ఆయన మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో రైతులు, ప్రజల సమస్యలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి టీఆర్‌ఎస్ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చి భరోసా కల్పించారని ఎద్దేవా చేశారు. స్వాగత ఏర్పాట్లలో బిజీ బిజీ.. శంషాబాద్ విమానాశ్రయానికి గురువారం చేరుకోనున్న రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. విమానాశ్రయంలోని హజ్‌హౌజ్ వద్ద రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. పీసీసీ ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా రాహుల్‌గాంధీ కలవడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. హజ్‌హౌజ్ భవనం ఎదుట కార్యకర్తలను కలవడానికి బారికేడ్లు, టెంట్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కె.శ్రవణ్‌కుమార్‌గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, సర్పంచ్ సిద్దేశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేణుగౌడ్, మాజీ ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.