సాక్షి, హైదరాబాద్: అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ఇక్కడ సీఎం కేసీఆర్ ఇద్దరి శైలి ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లిలో ఆంధ్ర సెటిలర్లతో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ అంటారు.. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని కేసీఆర్ చెబుతారు. రఫెల్ కాంట్రాక్ట్ కోసం ప్రధానితో పాటు అనిల్ అంబానీ ఫ్రాన్స్ వెళ్లారు. ఎలాంటి అనుభవంలేని అనిల్ అంబానీకి కాంట్రాక్టు ఇస్తారు. ఎంతో అనుభవం ఉన్న హెచ్‌ఏల్‌కు మాత్రం కాంట్రాక్టు ఇవ్వరు. ఇంత చేస్తే అనిల్ అంబానీ కంపెనీకి ఉన్న అనుభవం కేవలం 10 రోజులు మాత్రమే. రహస్య ఒప్పందం ఏంటంటే జనం డబ్బంతా మోదీ దారాదత్తం చేశారు. పార్లమెంట్‌లో కలిసినప్పుడు మోదీని నిలదీశాను. రఫెల్ డీల్ గురించి కళ్లలో సూటిగా చూసి అడిగాను. మోదీ మాత్రం నా కళ్లలో చూడకుండా దిక్కులు చూశారు. తెలంగాణలో ఒకే కుటుంబం పాలన నడుస్తోంది. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. దళిత, ఆదివాసీ రైతులను నట్టెట ముంచారు.
చందమామను..
చందమామను భూమి మీద తీసుకొస్తానని చెప్పను. కానీ మోదీ, కేసీఆర్ అదే విషయాన్ని చెబుతున్నారు. ప్రతి అకౌంట్లో రూ 15 లక్షలు వేస్తానని తానేప్పుడు చెప్పను. కానీ మోదీ అదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ నెరవేరుస్తాం. అది ఏపీ, తెలంగాణల హక్కు. అర్ధరాత్రి 12 గంటలకు గబ్బర్ సింగ్ ట్యాక్స్ పెట్టారు. రైతలు రుణమాఫీ అడుగుతుంటే మోదీ నో అంటున్నారు. సూటు, బూటు మాఫీ చేస్తామంటున్నారు.’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment