ఊరింపులు, గద్దింపులు చాలిక
డేట్‌లైన్ హైదరాబాద్
తెలంగాణ సీఎం విశ్వవిద్యాలయాలు, జాతీయస్థాయి పరిశోధనా సంస్థల స్థలాలకు ఎసరు పెడతానంటుంటే... ఏపీ సీఎం వ్యవసాయాన్ని శాశ్వతంగా సమాధి చేసేలా మూడు పంటలు, నాలుగు పంటలు పండే భూములకు రాజధాని పేరిట ఎసరు పెట్టేస్తున్నారు. ఇదేమంటే, ఇద్దరూ తమ సొంత శైలిలో ‘ఏం తమాషానా?’ అని బెదిరిస్తున్నారు. ఇద్దరు తెలుగు సీఎంలు అధికారంలోకొచ్చి ఏడాది పూర్తి కావొస్తున్నది. ఇప్పుడిక వాళ్లు బెదిరింపులు కట్టిపెట్టాలి. ‘ఏం తమాషా చేస్తున్నారా?’ అని రెండు రాష్ట్రాల ప్రజలే పాలకులను నిలదీసే సమయం వ చ్చింది.
కమ్యూనిస్టు మహాయోధుడు చండ్ర రాజేశ్వరరావు తుదిశ్వాస విడిచే ముందు రాసిన వీలునామాను ఆయన పోయాక పత్రికలన్నీ మొదటి పేజీల్లో ప్రముఖంగా ప్రచురించాయి. ‘నా బట్టలు పేదవారికి, పుస్తకాలు లైబ్రరీకి’ అని దాని సారాంశం. ఆయన దగ్గర అంత కంటే ఏం లేవు మరి. శరీరం మీదున్న లాల్చీ, పైజామా, చేసంచిలో ఉన్న మరో జత బట్టలు. ఎక్కడికెళితే అక్కడ ఆ బట్టలు తానే ఉతుక్కుని, ఆరేసుకుని, మళ్లీ తొడుక్కునేవారు. స్వార్థం పెరిగి పోతుందేమోనని రాజేశ్వరరావులాగే పిల్లలు సైతం వద్దను కున్న మరో మహా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఆ ఇద్దరూ తమ జీవితాలను కమ్యూనిస్టు ఉద్యమానికీ, ప్రజాజీవితానికీ అంకితం చేసిన వాళ్లే. అంత నిరాడంబరంగా జీవించిన వారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లూ కారు. కావాలనుకుంటే ఆ ఇద్దరూ తమ పలుకుబడితో కోట్లు సంపా దించు కోగలిగేవారే. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర రావు రష్యా పర్యటనకు వెళితే అక్కడి ప్రభుత్వం అధికారికంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సోవియెట్ యూనియన్‌లో బహుశా మరే భారత నేతకు అంతటి ఘన స్వాగతం లభించి ఉండదు. ఆ ఇద్దరు గొప్ప నేతలను స్మరిం చుకోవాల్సిన సందర్భం ఏమిటి? అని సందేహం రావచ్చు. ప్రజాజీవితంలో ఉన్న చాలామంది కమ్యూనిస్టులు, కమ్యూనిస్టేతరులు సంపన్నవర్గాల నుంచి వచ్చి కూడా ఇలాగే నిరాడంబరంగా జీవించారు. కరీంనగర్ జిల్లాలో ‘తోట పల్లి గాంధీ’గా ప్రఖ్యాతి చెందిన సర్వోదయ నాయకులు బోయినపల్లి వెంకట రామారావు వంటి వారు పలువురు ఉన్నారు. మన పాలకులు పోతున్న పోక డలను చూస్తే ఒక్కసారి అటువంటి వారిని గుర్తు చెయ్యాలని అనిపించింది.
ఇద్దరు అధినేతల తీరే వేరు
నేడు అధికార రాజకీయాల్లో ఉన్న వాళ్లంతా కోట్లకు పడగలెత్తినవారే. ఆర్థి కంగా వారి గతం అంత చెప్పుకోదగ్గదీ కాదు. రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు కూడబెట్టుకున్నారు. వ్యాపారాలు స్థిరపరచుకున్నారు. సరే, ఎవరి వ్యాపా రాలు వారివి, ఎవరి ఆస్తిపాస్తులు వారివి. నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ దాదాపుగా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరిదీ ఇంచుమించు ఒకే ఆర్థిక నేపథ్యం. నేడు వారూ, వారి సంతానమూ ఆర్థికంగా బ్రహ్మాండంగా నిలదొక్కుకుని, విజయవంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నవారే. దాన్ని ఎవరూ ఆక్షేపించనక్కరలేదు. తప్పు లు జరిగితే ఓ కంట కనిపెట్టే వ్యవస్థలు వేరే ఉన్నాయి. ఈ ఇరువురి నేతృ త్వంలోని రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ అధికారంలోకి వచ్చాక గడచిన దాదాపు ఏడాది కాలంలో చేస్తున్న, చేస్తామని చెబుతున్న కార్యక్రమాలు ఆ పాత కాలపు నాయకుల నిజాయితీ, నిరాడంబరతలను, ఈ ఇరువురు నాయకుల ఆర్ధిక సౌష్టవాన్ని పోల్చి చూసేలా చేస్తున్నాయి.
మినీ మోదీ ‘డబుల్’ ఊదర
నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత వారం తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నట్టు.. అక్కడ మోదీ అయితే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మినీ మోదీ అవతారమెత్తారు. మంచిదే, హైదరాబాద్ వీధులు బాగుపడితే సంతోషమే. అదేమి పోలిక? అంటూ రాహుల్ విమర్శను తప్పుపడుతూ ఒకాయన ‘‘మోదీ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటున్నారు, మన సీఎం విదేశా లకే వెళ్లడంలేదు కదా?’’ అన్నారు. ‘‘మోదీకి పిల్లలు లేరు కాబట్టి ఆయనే తిరుగుతున్నాడు, మన మినీ మోదీకి ఇద్దరు పిల్లలు, తండ్రి బదులుగా వాళ్లు విదేశాలన్నీ తిరుగుతున్నారు’’ అని జవాబిచ్చారు ఒక సీఎం అభిమాని. ప్రధాని అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో 18 దేశాలు తిరిగి ఏం సాధిం చారు? తెలంగాణ, ఏపీ సీఎంల పిల్లలు విదేశాలు తిరిగి ఏమేం సాధించారు? భవిష్యత్తులో తేలుతుంది. మోదీని మెప్పించి కూతురికి కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకోడానికో (మోదీ ఆహ్వానిస్తే కేంద్రంలో చేరే విషయం పరిశీలిస్తానని ముఖ్యమంత్రి కుమార్తె, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత నిన్ననే ప్రకటించారు) లేక రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసమో గానీ తెలంగాణ సీఎం ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని తెగ ఉధృతంగా మొదలెట్టారు.
ఇందులో భాగంగా ఆయన సికింద్రాబాద్ హమాలీ బస్తీ ప్రజల వద్ద మరోమారు పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇచ్చేసే విషయం పైకి మళ్లారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ఖాయపరచిన నాటి నుంచి... అధికారానికి ముందు, అధికారంలోకి వచ్చాకా... ఏడాదిన్నరగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రెండు బెడ్‌రూంల ఇళ్ళ విషయం చెప్పి చెప్పి, తెగ ఊదరగొట్టి ఊరించేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది కాలంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కడితే ఒట్టు. ఒకసారి ఇళ్ల నిర్మాణానికి బోలెడు జాగా ఉందంటారు, ఇంకోసారి ఫ్లాట్‌లు మాత్రమేనంటారు. ఇప్పుడు కొత్తగా ఉస్మానియా యూనివర్సిటీ స్థలాన్ని తీసుకుంటామని చెబుతున్నారు.
‘ఏం తమాషానా?’
ఒక్క ఉస్మానియా వర్సిటీ నుంచే కాదు, ఓపెన్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎన్‌జీఆర్‌ఐ, సీసీఎంబీ సంస్థల భూములతో రెండు లక్షల ఇళ్లు కడతామని చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి విశ్వవిద్యాల యాలూ, జాతీయస్థాయి అత్యద్భుత ఫలితాలనిస్తున్న పరిశోధనా సంస్థల స్థలాలకు ఎసరు పెడతానంటే.... అక్కడ ఏపీ సీఎం వ్యవసాయాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు మూడు పంటలు, నాలుగు పంటలు పండే భూములకు రాజధాని పేరిట ఎసరు పెట్టేస్తున్నారు. ఇదేమంటే, ఇద్దరూ తమ తమ శైలుల్లో ‘ఏం తమాషానా?’ అని బెదిరిస్తున్నారు. ఇద్దరు తెలుగు సీఎంలూ అధికారంలోకొచ్చి ఏడాది పూర్తి కావొస్తున్నది. ఇప్పుడిక వాళ్లు బెదిరింపులు కట్టబెట్టాలి. ‘ఏం తమాషా చేస్తున్నారా?’ అని రెండు రాష్ట్రాల ప్రజలే పాలకులను నిలదీసే సమయం వ చ్చినట్టే.
ఇక్కడే పాలకుల ఆస్తిపాస్త్తుల లెక్కలు ప్రస్తావన కొచ్చేది. ప్రజావసరా లకు ఎంతగానో ఉపయోగపడే ముఖ్యమైన భూముల్లో ఇళ్లు నిర్మిస్తామం టున్నారు... అందుకు బదులు మీ ఆస్తులు దానం చెయ్యొచ్చు కదా? అన్న మాట రాక తప్పదు. హైదరాబాద్‌కు 40 కిలో మీటర్ల దూరంలోనే తెలంగాణ సీఎం సొంత వ్యవసాయ క్షేత్రం ఉంది.
అధికారంలోకి రావడానికి బోలెడు త్యాగాలు చేశామనే పాలకులు పేదల ఇళ్ల నిర్మాణం వంటి బృహత్ కార్య క్రమాల కోసం సొంత ఆస్తులు త్యాగం చేస్తే తప్పేమిటి? విశ్వవిద్యా లయ భూముల ప్రస్తావన తెస్తూ ముఖ్యమంత్రి ‘‘అవేమన్న రాజ దర్బార్‌లా, మహారాజుల గదులా? తమాషానా? ఇది ప్రజాస్వామ్యం ప్రజాయుగం. ప్రజల సొత్తు, ప్రజలకు చెందాల్సిందే’’ అన్నారు. ఆయన ఒక విషయం మర చిపోతున్నారు. ఇప్పుడాయన హూంకరించి ఏ భూములనయితే లాక్కుని పేదలకు ఇల్లు కట్టిస్తానంటున్నారో అవి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజలవే.
‘కొత్త మిత్రుల’ కబ్జా భూముల్లో కట్టండి
ఇది ప్రజాస్వామ్యమని మరచి, వేలాది ఎకరాల ప్రజా భూముల చుట్టూ కోట గోడలు నిర్మించుకుని, రాజ మహళ్లలో భద్రత మధ్య జీవిస్తున్న మీ కొత్త మిత్రుల కబ్జాలోని భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లు కట్టి చూపించండి. ఇటీవలే ఆ కొత్త మిత్రుడి కోటను స్వయంగా సందర్శించి, భూమి మీద ఇదో అద్భుతమని వేనోళ్ల పొగిడి వచ్చిన ముఖ్యమంత్రి గారు అప్పుడే ఆ భూములను మరచిపోయి ఉండరు. ఆయనకు అలాంటి మిత్రు లింకా కొందరైనా ఉండే ఉంటారు.
వారందరి కబ్జాలోని భూములను స్వాధీన పరచుకోండి. అప్పుడు ప్రజలు మీకు ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకాన్ని, ప్రేమను నమ్ముతారు, జేజేలు పలుకుతారు. అంతకంటే ముందు మీ సొంత ఆస్తులుగా ఉన్న విశాల ప్రాంగణాలను ప్రజల పరం చేయగలరేమో ఆలో చించండి. అంతేగానీ ప్రజల విద్యా, విజ్ఞాన వికాస అవసరాల కోసం అప్పు డెప్పుడో కేటాయించిన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని బెదిరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు కొన్ని ఇప్పటికే కబ్జాదార్ల పాలయినాయి. వాటిని రక్షించాల్సిందిపోయి మరింత భూమికి ఎసరు పెడతామంటే విద్యార్థులు ఎందుకు ఊరుకుంటారు?
email: datelinehyderabad@gmail.com
- దేవులపల్లి అమర్