నిజామాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక‍్వత లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించే అర్హత రాహుల్‌కు లేదన్నారు. మూడేళ్లలో మోదీ సర్కార్ సుపరిపాలన అందించిందని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంశాల్లో బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. మూడేళ‍్ల పాలనలో ఒక్క స్కాం ఆరోపణ కూడా లేకుండా వేలెత్తి చూపలేని సుపరిపాలన మోదీ అందిస్తున్నారని చెప్పారు.
నోట్ల రద్దు కేంద్రం చేపట్టిన సాహసోపేతమైన చర్య అని బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వన్ వే లో వెళ్తోందని, అది మంచి పద్ధతి కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయూతను రాష్ట్ర సర్కారు గుర్తించాలని కోరారు. కేంద్రాన్ని తక్కువ అంచనా వేయద్దని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన మతపరమైన రిజిస్ట్రేషన్లు రాజ్యాంగ విరుద్దమని తెలిపారు. సీఎం చేపట్టిన సర్వేలకు విశ్వసనీయత ఉండదని అన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు.