ప్రభుత్వాల లోపాలను ఎత్తి చూపుతాం: ఉత్తమ్
సంగారెడ్డి: మూడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రతిబింబించేందుకే సంగారెడ్డిలో తెలంగాణ ప్రజా గర్జన నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. జూన్ ఒకటో తేదీన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో సభ ఏర్పాట్లను ఉత్తమ్ శుక్రవారం పరిశీలించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో వేదిక నిర్మాణం, సభ నిర్వహణ తదితరాలపై జిల్లా నేతలతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల్లో అనేక ఆశలు రేకెత్తించారన్నారు.
దేశ పౌరుల జీవితాలు మెరుగు పరుస్తామని మోదీ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తామంటూ కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. అయితే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదనే అంశాన్ని ప్రజలు గ్రహించారని ఉత్తమ్ పేర్కొన్నారు.గతంలో కంటే ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని.. ఏం సాధించారని కేసీఆర్ జూన్ రెండో తేదీన ఉత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని.. మూడేళ్లలో మూడు వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆవేదన చెందుతున్నా సీఎం స్పందించడం లేదని వాపోయారు.
కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తరహాలో రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.నాలుగు విడతల రుణమాఫీ మూలంగా గ్రామీణ ఆర్దిక వ్యవస్త ఛిన్నాభిన్నమైందని.. ప్రభుత్వమే వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ మూడేళ్ల పాలనలో యువత, విద్యార్థులు నైరాశ్యంలో మునిగిపోయారన్నారు. ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లోపించిందని విమర్శించారు. 2019లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలస వెళ్లేవారు ఎవరూ లేరని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.