రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై స్థానిక పీసీసీలదే తుది నిర్ణయమని ప్రకటించారు. ఈ విషయంలో స్థానిక నేతల నుంచి సూచనలొస్తే పరిశీలిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని, బీహార్‌లో ఆర్జేడితో కలిసి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 2019లో నరేంద్ర మోదీని ప్రధాని కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. యూపీఏ భాగస్వామ్యంతో పాటు అన్ని పార్టీలను కలుపుకుంటున్నామని చెప్పారు. 200 సీట్లు సొంతంగా వస్తేనే మోదీ ప్రధాని అవుతారని, యూపీ, బీహార్‌లో 120 సీట్లను కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదన్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై..
కుటుంబ పాలనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కుటంబ పాలనే లేదని, గడిచిన 20 ఏళ్లుగా నెహ్రు కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని కాలేదన్నారు. సోనియా రిమోట్‌తో యూపీఏ నడిపించారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మోదీ ప్రభుత్వమే ఆర్‌ఎస్సెస్ రిమోట్‌తో నడుస్తుందని ఎద్దేవా చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించాక ఎస్సీ వర్గీకరణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
2019 ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలన్నింటితో కలిసి పోటీచేస్తామని, కాంగ్రెస్ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్రానికి సంబంధించిన అంశంగా పేర్కొంటూ రాహుల్ మాట దాటవేసారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఏపీలో మాత్రం ఓట్ల శాతం పెరుగుతుందన్నారు. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. గెలిచిన పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉండటం రాజ్యంగబద్ధమని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం ఉండదన్నారు.
టీడీపీ వ్యాపార వేత్తల క్యూ..
రాహుల్ పారిశ్రామిక వేత్తల సమావేశానికి టీడీపీ వ్యాపారవేత్తలు క్యూ కట్టారు. నారా బ్రాహ్మణి, టీజీ భరత్( టీజీ వెంకటేశ్ కుమారుడు), జేసీ తనయుడు పవన్ హాజరయ్యారు. కొంత కాలంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభ పీఏసీ సభ్యుని ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వగా.. డిప్యూటీ ఛైర్‌పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతునిచ్చింది. కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు చేయ్యేసి ఫొటోలకు ఫోజుచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment