సాక్షి,అమేథి: రాహుల్ పర్యటనను వాయిదా వేసుకోమని కోరినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన క్రమంలో ఆయన టూర్‌కు అమేథి జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చింది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సాగే రాహుల్ అమేథి పర్యటన కోసం తాము సంసిద్ధంగా ఉన్నామని అమేథి జిల్లా మేజిస్ర్టేట్ యోగేష్ కుమార్ చెప్పారు. ఈనెల 4-6 తేదీల్లో రాహుల్ నియోజకవర్గ పర్యటనకు అధికారులు అనుమతి నిరాకరించలేదని, కేవలం ఆయన భద్రత పట్ల ఆందోళనతోనే వాయిదా వేసుకోవాలని కోరారని తెలిపారు.
దుర్గా విగ్రహాల నిమజ్జనం, మొహర్రం సందర్భంగా భద్రతా సిబ్బంది బిజీగా ఉంటారనే కారణంతోనే రాహుల్ పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ చీఫ్‌కు అధికారులు లేఖ రాశారని వివరణ ఇచ్చారు.అయితే రాహుల్ గతంలో ఇచ్చిన షెడ్యూల్ మేరకే పర్యటిస్తానని పేర్కొనడంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. అయితే రాహుల్ టూర్ వాయిదా వేయాలని అధికారులు కోరడాన్ని యూపీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ తప్పుపట్టారు.